నీ శ్వాసలో కలిసిపోతా .. సింగిల్ లైన్‌తో బాంబు పేల్చిన బిగ్‌బాస్ దివి
బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా వెలుగులోకి వచ్చిన వారిలో దివి వైద్య ఒకరు. చిన్నా చితకా వేషాలు వేస్తూ అలా వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాస్ షోలో అవకాశం దక్కించుకుంది దివి. మైండ్ గేమ్, హాట్ డిస్కషన్స్‌తో పాటు తన అందచందాలతో బిగ్‌బాస్ హౌస్‌కి మరింత గ్లామర్ అద్దింది దివి. తెలుగు చిత్ర పరిశ్రమ కళ్లలో పడిన ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత అవకాశాలు వెల్లువెత్తి బిజీ అయ్యింది.
హైదరాబాద్‌కు చెందిన దివికి చిన్నప్పటి నుంచి సినిమా అంటే మక్కువ. ఆమె తల్లి, అన్నయ్య ఇద్దరూ డాక్టర్సే. దివి ఎంటెక్ పూర్తి చేసి ఇష్టమైన సినిమాల్లోకి అడుగుపెట్టడానికి వీలుగా మోడలింగ్ వైపు వెళ్లారు. మోడల్‌గానే తన పాకెట్ మనీ సంపాదించుకునేది. తొలిసారిగా సూపర్‌స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన మహర్షిలో ఓ సీన్‌లో తళుక్కున మెరిసింది. ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్నా చితకా పాత్రలతో పాటు కొన్ని కవర్ సాంగ్స్‌లోనూ దుమ్ముదులిపింది.

బిగ్‌బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే గెస్ట్‌గా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. ఈమెకు తన గాడ్ ఫాదర్ మూవీలో అవకాశం కల్పించారు. ఇక నయీం డైరీస్‌లో రొమాంటిక్ సీన్స్‌లోనూ హద్దులు దాటి మరి నటించి షాకిచ్చింది దివి. నవీన్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన లంబసింగిలో ఆమె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందినా దివి నటనకు, అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇవికాక జీ5లో ప్రసారమైన మా నీళ్ల ట్యాంక్, ఏటీఎం వెబ్ సిరీస్‌లతో ఆమె అలరించారు.
కథ నచ్చితే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ ప్రాజెక్ట్‌లో నటిస్తానని పలుమార్లు ప్రకటించింది దివి. ఇప్పుడిప్పుడే ఈ బిగ్‌బాస్ బ్యూటీకి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కుతున్నాయి. రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్‌ల పుష్ప 2లో రిపోర్టర్‌గానూ, డాకు మహారాజ్‌లో నందమూరి బాలకృష్ణకు అనుచరురాలిగానూ నటించి మెప్పించింది దివి.
ఏ విషయాన్నైనా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం దివి స్టైల్ . తనకు సినిమాల్లో మంచి అవకాశాలు వచ్చి ఉంటే ఖచ్చితంగా బిగ్‌బాస్‌లోకి వెళ్లేదాన్ని కాదని ఆమె ఓ ఇంటర్వ్యూలో షాకిచ్చింది. బిగ్‌బాస్‌లో 50 రోజులు ఉన్నానని, సమంత హోస్ట్‌గా రావడంతోనే తనను ఎలిమినేట్ చేశారని.. లేదంటే ఇంకొన్ని రోజులు ఉండేదాన్నని దివి బోల్డ్ కామెంట్స్ చేసింది.
ఓ వైపు సినిమాలు, షోలు, డ్యాన్స్ వీడియోలు చేస్తూనే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటారు దివి . తన వ్యక్తిగత విషయాలతో పాటు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు హీటెక్కిస్తుంది. మోడ్రన్ డ్రెస్సులోనైనా, చీరకట్టులోనైనా ఎలాంటి దుస్తుల్లోనైనా సరే ఈమె అందాలకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నాకేం ఆశ లేదు .. నీ సగ భాగం అవ్వాలని తప్ప, కోరికలు ఎక్కువ లేవు నీ రాత నా నుదిటిన రాయాలని తప్ప, ఆశలు అంతకన్నా లేవు.. నీతో ఉండాలని తప్ప, నా ఊపిరి ఆగిపోయిన రోజు నీ శ్వాసలో కలిసిపోవాలని తప్ప అంటూ దివి రాసుకొచ్చింది. దీంతో ఆమె ఎవరి గురించి ఈ కవిత రాసింది? కొంపదీసి దివి ప్రేమలో పడిందా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


Click it and Unblock the Notifications











