Bigg Boss: బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. నడిరోడ్డుపై పోలీసుల ఎన్‌కౌంటర్
కొద్దిరోజుల క్రితం బిగ్‌బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేత ఎల్విష్ యాదవ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు టార్గెట్ చేయడం దుమారం రేపింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న ఎల్విష్ యాదవ్ ఇంటిపై అగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశం ఉలిక్కిపడింది. కాల్పుల ఘటనను సీరియస్‌గా తీసుకున్న హర్యానా పోలీసులు విచారణ జరపడంతో పాటు దర్యాప్తులో కీలక పురోగతి సాధించారు. ఈ వివరాల్లోకి వెళితే..
ఎల్విష్ యాదవ్ ఇంటిపై బుల్లెట్ల వర్షం
ఆగస్ట్ 17వ తేదీ ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో గురుగ్రామ్‌లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు సాయుధులైన ముగ్గురు దుండగులు మోటార్ బైక్‌పై వచ్చారు. తొలుత అటు ఇటూ తచ్చాడిన దుండగులు ఆ కాసేపటికీ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దుండగులు దాదాపు 24 రౌండ్ల పాటు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బుల్లెట్లు ఎల్విష్ ఇంటి పై అంతస్తు వరకు వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. అదృష్టవశాత్తూ దాడి జరిగిన సమయంలో ఎల్విష్ యాదవ్ ఇంట్లో లేడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇది ఎవరి పని? ఎల్విష్‌కు పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో ఆరా తీశారు.

బిగ్‌బాస్ హిందీ ఓటీటీ విజేతగా
ఎల్విష్ యాదవ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా ఫేమస్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో అతనికి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఈ పాపులారిటీతోనే బిగ్‌బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2లో స్థానం దక్కించుకున్నాడు ఎల్విష్. అక్కడ అనూహ్యంగా విజేతగా నిలిచిన అతనికి బయటికొచ్చాక మరింత ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌తో పాటు సినిమాలలో అవకాశం దక్కించుకున్నాడు దూసుకెళ్తున్నాడు ఎల్విష్. ఈ దశలో అతని ఇంటిపై దుండగుల కాల్పులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసుల ఎన్‌కౌంటర్
ఎల్విష్ ఇంటిపై కాల్పులకు తెగబడిన దుండగుల్లో ఒకరిని గుర్తించారు పోలీసులు. ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీకి చెందిన ఇషాంత్ అలియాస్ ఇషు గాంధీపై పోలసులు నిఘా పెట్టారు. ఇతనికి గ్యాంగ్‌స్టర్ నీరజ్ ఫరీద్ పురియా ముఠాతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌ని కలిసేందుకు ఇషాంత్ వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించడంతో వెంబడించారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఇషాంత్ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులకు దిగడంతో ఇషాంత్ కాలికి గాయమైంది. వెంటనే అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
భద్రత కట్టుదిట్టం
రహదారిపై పోలీసుల ఛేజింగ్, కాల్పుల ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇషాంత్‌ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో గురుగ్రామ్, ఫరీదాబాద్‌లలో పోలసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఎల్విష్ ఇంటి వద్దా పోలీస్ పహారాను పెంచారు. ప్రస్తుతం ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











