‘నాకు అలాంటి పాత్రలే ఇస్తున్నారు.. ఆ ముద్ర జీవితాంతం పోదేమో'.. బిగ్‌బాస్ నటి ఆవేదన
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి హరితేజ (Hari Teja). యాంకర్‌గా, సీరియల్ నటిగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె, తన సహజ నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. టెలివిజన్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ తర్వాత సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుని నటిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఒకే రకమైన క్యారెక్టర్స్ ఇస్తున్నారనీ,ఆ మూవీ జీవితాంతం పోయేలా లేదని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ పాత్రలేంటీ? అసలేం జరిగిందంటే?
హరితేజ టెలివిజన్ సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా మనసు మమత, రక్తసంబంధం, తాళికట్టు శుభవేళ, శివరంజని, కన్యాదానం వంటి పాపులర్ సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించారు. ఈ సీరియల్స్‌లో ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. ముఖ్యంగా ఆమె సహజ నటన, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సీరియల్స్‌లో వచ్చిన గుర్తింపుతో హరితేజ సినిమాల్లోకి అడుగుపెట్టారు. మొదట చిన్న చిన్న పాత్రలతో కనిపించినా, తర్వాత కీలక పాత్రల్లో నటించే అవకాశాలు పొందారు.

ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో వచ్చిన అ ఆ (A Aa) సినిమాలో హీరోయిన్ సమంత పనిమనిషిగా చేసిన పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చింది. ఈ సినిమాలో హరితేజ కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టెలివిజన్ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించిన హరితేజకు మరింత గుర్తింపును తెచ్చింది బిగ్ బాస్ తెలుగు. 2017లో ప్రసారమైన మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో హరితేజ కంటెస్టెంట్‌గా పాల్గొని తన ఎంటర్టైనింగ్ నేచర్, పాజిటివ్ వైబ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఆమె చెప్పే హరికథలు, సరదా మాటలు, హాస్యభరితమైన వ్యవహారం కారణంగా బిగ్ బాస్ హౌస్‌లో ప్రత్యేక గుర్తింపు పొందారు. తర్వాత మళ్లీ బిగ్ బాస్ సీజన్ 8లో కూడా పాల్గొని ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా రెండోసారి పాల్గొన్నప్పుడు ఆమె గేమ్ ప్లే, ఎంటర్టైనింగ్ స్టైల్ మరింత మెప్పించింది. హరితేజ కేవలం సీరియల్స్,టెలివిజన్ షోలు, సినిమాలు, వెబ్ ప్రాజెక్టుల్లో కూడా ఆమె కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న'లేచింది మహిళా లోకం' (LechindhiMahilaLokam)లో కీలక పాత్రలో నటిస్తుంది.
లేచింది మహిళా లోకం మూవీ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో హరి తేజ పాల్గొంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో మీడియా ప్రతినిధులు ఆమెను ప్రశ్నిస్తూ.. 'మీరు చాలా సినిమాల్లో మేడ్ లేదా పనిమనిషి పాత్రల్లోనే కనిపిస్తున్నారు. దానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?'అని అడిగారు. దీనికి సమాధానంగా హరితేజ మాట్లాడుతూ.. ఆ పాత్రకు తాను బ్రాండ్ అంబాసిడర్‌లా మారిపోయానని చమత్కారంగా చెప్పారు. 'చాలా మంది రచయితలు ఆ పాత్రలు రాస్తున్నప్పుడు నన్నే ఊహించుకుని రాస్తున్నారు. వాళ్లు ఆలోచన మార్చితే నా పాత్రలు కూడా మారుతాయి'అని ఆమె అన్నారు.
అయితే ఇటీవలి కాలంలో తాను ఇతర పాత్రలలో కూడా నటించినట్టు ఆమె తెలిపారు. కానీ ఒకసారి ఒక పాత్రతో ముద్ర పడితే దాన్ని మార్చుకోవడం చాలా కష్టమని చెప్పింది. 'ఒక ఆర్టిస్ట్‌కు అది కొంచెం బాధగానే ఉంటుంది. ఎన్ని పాత్రలు చేసినా ప్రేక్షకులు మాత్రం ఒక పాత్రతోనే గుర్తుంచుకుంటారు. జనాలు అలానే ఫిక్స్ అయిపోతారు. రచయితలు కూడా అదే ఇమేజ్‌లో ఆలోచిస్తుంటారు'అని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే భవిష్యత్తులో అలాంటి పాత్రలు తగ్గే అవకాశం ఉందని హరితేజ ఆశాభావం వ్యక్తం చేశారు. 'ఈ ఏడాది గానీ, వచ్చే ఏడాది గానీ ఆ తరహా పాత్రలు పూర్తిగా తగ్గిపోవచ్చు. కొత్త రకాల పాత్రలు చేసే అవకాశం రావచ్చు'అని ఆమె అన్నారు.
ఇక తాను ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలకు పరిమితం కావాలని అనుకోలేదని హరితేజ స్పష్టం చేశారు. 'నేను ఒకే రకమైన పాత్రలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్ కాలేదు. ఏ పాత్ర వచ్చినా దానికి న్యాయం చేయాలనే ఆలోచనతోనే పనిచేస్తాను. విభిన్నమైన పాత్రలు చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను' అని చెప్పారు. అంతేకాదు, పనిమనిషి పాత్రలు చేస్తున్నప్పుడు తాను ఎప్పుడూ అసౌకర్యంగా భావించలేదని ఆమె తెలిపారు. 'ప్రేక్షకులు ఆ పాత్రలను ఎంజాయ్ చేస్తున్నారు. వారికి నేను వినోదం అందిస్తున్నాను. ప్రేక్షకులను అలరించడమే ఒక ఆర్టిస్ట్‌కు పెద్ద ఆనందం' అంటూ హరితేజ తన మనసులోని భావాలను పంచుకున్నారు.


Click it and Unblock the Notifications










