ఇల్లు, కారు అలా వచ్చాయట... నా క్యారెక్టర్‌పై దారుణంగా... బిగ్‌బాస్ బ్యూటీ ఎమోషనల్
సోషల్ మీడియా రాకతో నటీనటులపై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. స్టార్స్ ఏం చేసినా సరే దానిని వక్రంగా ఆలోచించడం, దారుణమైన కామెంట్స్‌తో హింసించడం జరుగుతోంది. కొందరు దీనిపై సీరియస్ అవుతూ పోలీసులను ఆశ్రయిస్తుండగా.. మరికొందరు మాత్రం చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారు. తాజాగా తన సంపాదనపై, తన వ్యక్తిత్వంపై దారుణంగా కామెంట్స్ చేస్తున్న వారిపై బిగ్‌బాస్ కంటెస్టెంట్ విరుచుకుపడ్డారు. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయ్యారు హిమజ రెడ్డి. అయితే అంతకంటే ముందే సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. గుంటూరు జిల్లాకు చెందిన హిమజ రెడ్డి తొలుత 2015లో తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టారు. భార్యామణి సీరియల్‌లో నటించిన ఆమె తర్వాత స్వయంవరం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం సీరియల్‌తో ప్రేక్షకులను అలరించారు. అనంతరం సినీరంగం నుంచి పిలుపురావడంతో శివం సినిమాతో వెండితెరపై అడుగుపెట్టారు హిమజ. నేనుశైలజ, చుట్టలబ్బాయ్, జనతా గ్యారేజ్, ధ్రువ, మహానుభావుడు, శతమానంభవతి, స్పైడర్, నెక్ట్స్ నువ్వే, వినయ విధేయ రామ, చిత్రలహిరి, వరుడు కావలెను, మాయ పేటిక, దేవర, డాకు మహారాజ్, హరిహర వీరమల్లు తదితర చిల్రాల్లో నటించారు హిమజ రెడ్డి.

స్టార్ మాలో ప్రసారమయ్యే పాపులర్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకున్నారు. గేమ్స్, టాస్క్‌లు, వ్యక్తిత్వం పరంగా ప్రేక్షకుల చేత మంచి మార్కులు వేయించుకున్న ఈ ముద్దుగుమ్మ.. 9 వారాల పాటు హౌస్‌లో నిలిచి బిగ్‌బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు హిమజ. కరోనా లాక్‌డౌన్ టైంలో యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోల ద్వారా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ సత్తా చాటారు. ఎంతో కష్టపడి కారు, ఇల్లు కనుక్కొని తన కల నెరవేర్చుకున్నారు. అయితే హిమజ లగ్జరీ లైఫ్‌పై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు కొందరు. వీటిని కొన్నాళ్లు భరించినా.. నెటిజన్లు హద్దు మీరడంతో తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు హిమజ. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఆమె స్పందించారు.
చిన్నప్పటి నుంచి రౌడీ రాణి టైప్.. అలాంటివి చేసినప్పుడు బడితపూజ కూడా తప్పదు కదా. ఇండస్ట్రీకి వెళ్లేముందు.. వెళ్లిన తర్వాత కూడా అయినవాళ్ల నుంచి మాటలు పడ్డా. నేను హెర్బా లైఫ్‌కి సూపర్ వైజర్ అన్న సంగతి చాలామందికి తెలియదు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాను నా సర్కిల్ వరకు తెలుసు. కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు.. కొంచెం ఎక్కువ కష్టపడక తప్పదు. నేను అనుభవించే లగ్జరీ లైఫ్ వెనుక ఎంతో కష్టం ఉంది. కానీ ఇదంతా తెలియని వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారు. పాపం ఈ అమ్మాయి ఎందుకింత కష్టపడుతుందని మాత్రం ఎవరూ అడగరు. ఉదయం నుంచి రాత్రి వరకు సీరియల్స్‌లో నటించాను, సినిమాలలో కష్టపడుతున్నా. ఏ ఊరికి రమ్మంటే ఆ ఊరు వెళ్లాను. బిగ్‌బాస్‌లో మీ అందరూ చూసిందే. ఎంత మెంట టార్చర్ ఉంటుంది... నా ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కడ లేదు చెప్పండి అంటూ హిమజ ప్రశ్నించారు.
మీరు నన్ను స్క్రీన్ మీద చూస్తున్నారంటే సంపాదిస్తున్నాను అనే కదా. నేను హెర్బా లైఫ్‌కి సూపర్‌వైజర్‌ని అక్కడి నుంచి ఎంతో వస్తుంది. నేను కంపెనీని కూడా స్టార్ట్ చేశా, స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా దాని నుంచి ఎంత సంపాదిస్తానో కూడా తెలియదు. ఇవన్నీ తెలియదు అనుకున్నా.. సినిమాలు చేస్తూ ఇంత కష్టపడుతున్నాం.. మాకు లోన్స్ ఇవ్వరా? మేం కారు కొనుక్కోలేమా? ఇల్లు కొనుక్కోలేమా? ఇవన్నీ ఎందుకు ఆలోచించరు. నా బెంజ్‌ని చూస్తారు కానీ నా కష్టం చూడరు. ఈ బెంజ్ కారు మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలనే ఒక భయం, భక్తి నాకు ఉంటుంది. అందుకని నేను ఇంకో రెండు పనులు ఎక్కువ చేసుకుంటానని హిమజ తెలిపారు.
ఒకడు బాగుపడుతుంటే మన తెలుగువాళ్లలో ఏడ్చేవాళ్లు ఎక్కువ. ఒకరు ఏదన్నా కొనుక్కుని సంతోషపడుతున్నారు. ఒకరు ఏదైనా సినిమా చేస్తున్నారు అంటే ఏడ్చేవాళ్లే ఎక్కువ. నా మనస్తత్వం అస్సలు కాదు.. ఒక తెలుగమ్మాయి ఎవరైనా సక్సెస్ సాధిస్తే అభినందిస్తా. ఓ తెలుగు హీరోయిన్ టాప్ రేంజ్‌కి వెళితే ఏడుస్తున్నారు. ఆవిడలో ఏం లేకుండానే ఆఫర్లు వస్తున్నాయా? అనేది ఆలోచించరు. ఒక మనిషి కష్టాన్ని ముందు చూడాలి. నాపై వచ్చే ట్రోలింగ్‌కి ఎన్నోసార్లు ఫీలయ్యా, కానీ రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నా. పాపం వాళ్లకి ఎలా బతకాలో తెలియక ఇంకొకరి మీద పడి బతుకుతున్నారు. నేనేం పనిచేయకుండా .. ఇవన్నీ సంపాదించి ఉండి మీరు ఎన్ని మాటలు అన్నా పడతానని హిమజ తెలిపారు.
నా కష్టం కళ్ల ముందు కనిపిస్తున్నా, మా అసోసియేషన్‌లో మెంబర్‌ని. నేను కారు కొన్నానంటే ఎవడో ఇచ్చాడంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. లైవ్‌లోకి వచ్చి నేను కడుతున్న ఈఎంఐలు, పేపర్స్ చూపించాలని అనుకున్నా. బిగ్‌బాస్ నుంచి వచ్చాక 12 షాపింగ్ ఓపెనింగ్స్ చేశా... ఒక్కో ఓపెనింగ్‌కి ఎంత ఇస్తారో తెలుసా? నేను కారు కొనుక్కోవాలంటే అది చాలు కదా. ఈ మాటలన్నీ నేను తట్టుకోగలుగుతాను. మా పేరెంట్స్ పరిస్థితి ఏంటీ? నేను ఇల్లు కొనుక్కున్న దానికి మా అమ్మానాన్న ఎంతో సాయం చేశారు. ఇది తెలియకుండా ఎవరో గిఫ్ట్ ఇచ్చారు అంటే వాళ్ల గుండె పగిలిపోదా. ఇది వాళ్ల కష్టాన్ని అవమానించడమే. అలాంటి వాళ్లు కనిపిస్తే నేను ఊరుకోను.. ఉతికి ఆరేస్తానని హిమజ వార్నింగ్ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











