నా బతుకుకు చివరి ఆశ నువ్వే.. నటి ప్రియ ఎమోషనల్
ప్రియ.. అలియాస్ మామిళ్ల శైలజా ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్ల క్రితం ముద్దుగా బొద్దుగా కనిపిస్తూ హీరో హీరోయిన్లకు ఫ్రెండ్‌గానో, చెల్లెలిగానో కనిపించేది ప్రియ. చిన్నాచితకా పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ప్రియ. ఈ దశలో బిగ్‌బాస్ కార్యక్రమం ఆమెకు మరింత పాపులారిటీ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే శైలజా ప్రియ తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా బాపట్లలో 1978 మే 20న జన్మించారు శైలజా ప్రియ. అయితే వీరి కుటుంబం హైదరాబాద్‌లో స్థిరపడటంతో అక్కడే శైలజ చదువుకున్నారు. ఈ క్రమంలో ప్రియసఖి అనే సీరియల్‌లో అవకాశం దక్కించుకున్న శైలజకు ఇది సూపర్‌హిట్ కావడంతో అవకాశాలు క్యూకట్టాయి. అనంతరం సంఘర్షణ, లేడీ డిటెక్టివ్, మిసెస్ శారద, జ్వాల వంటి సీరియల్స్ ప్రియకు గుర్తింపు తీసుకొచ్చాయి. సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలోనే సినిమాల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకున్నారు ప్రియ.

సౌందర్యతో సన్నిహితంగా
దొంగాట, గోకులంలో సీత, మాస్టర్, మావిడాకులు,రాజకుమారుడు, అన్నయ్య, జయం మనదేరా, సూర్యుడు, ఢమరుకం, చిరునవ్వుతో, కత్తి కాంతారావు, పిల్లా నువ్వు లేని జీవితం, సన్నాఫ్ సత్యమూర్తి, పండగ చేస్కో, మిర్చి, ఉప్పెన, శ్రీకరం తదితర చిత్రాల్లో ప్రియ నటించారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే 2002లో కిషోర్ అనే వ్యక్తిని ప్రియ పెళ్లాడారు. ఈ దంపతులకు ఓ కుమారుడు నిశ్చయ్ సంతానం. దాదాపు 27 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎలాంటి వివాదం లేకుండా శైలజ ప్రియ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. దివంగత సౌందర్య సహా పలువురు హీరోయిన్లతో ఆమె క్లోజ్‌గా ఉండేవారు. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, విక్టరీ వెంకటేష్ వంటి అగ్రనటులతో ప్రియ నటించారు.
బిగ్‌బాస్‌తో పాపులర్
బిగ్‌బాస్ 5 తెలుగులో అవకాశం దక్కించుకున్న శైలజ ప్రియ తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు. కుర్రాళ్ల హవా కనిపించే బిగ్‌బాస్‌లో శైలజ ఎక్కువ రోజులు ఉండలేదని త్వరగానే ఎలిమినేట్ అయిపోతుందని అంతా అనుకున్నారు. కానీ తన వయసును లెక్కచేయకుండా డిస్కషన్స్, ఫిజికల్ టాస్కుల్లో అద్భుతంగా పోరాడారు ప్రియ. దాదాపు ఏడు వారాల పాటు హౌస్‌లో కొనసాగిన ఆమె తన కోపం, ఆవేశం వల్లే ఎలిమినేట్ అయినట్లు అంగీకరించింది. బిగ్‌బాస్ ద్వారా ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా బతికేయగలనని చెప్పింది.
ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్
బిగ్‌బాస్ కారణంగా వచ్చిన పాపులారిటీతో శైలజ ప్రియకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆమె ఎప్పటికప్పుడు తన సినిమాలు, సీరియల్స్, ఇతర వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. 50కి చేరువ అవుతున్నా చెక్కుచెదరని అందంతో మెస్మరైజ్ చేస్తున్నారు ప్రియ. తాజాగా తన కొడుకు నిశ్చయ్ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. నా బతుకు చివరి ఆశ నువ్వే.. నేను బతికేది నీ కోసమేనని అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం శైలజ ప్రియ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా నెటిజన్లు నిశ్చయ్‌కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications











