జబర్దస్త్ మానేయలేదు.. నన్ను గెంటేశారు.. బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ప్రియాంక సింగ్ (పింకీ). అమ్మడు బజర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu 5)లో అడుగుపెట్టి, తన ఆట తీరుతో ప్రత్యేకం గుర్తింపు తెచ్చుకుంది. ఈ సీజన్ లో యంగ్ హీరో మనస్ తో లవ్ ట్రాక్ నడిపి ఎనలేని ఫేమ్‌ను సొంతం చేసుకుంది. ఈ క్రేజ్ తో పలు షోలు, ఈవెంట్స్ లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది ప్రియాంక. తన అందం, ఆత్మవిశ్వాసంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. తాజాగా యాంకర్ వర్ష( Varsha)హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్ షోలో పాల్గొన్న ప్రియాంక.. జబర్దస్త్ షోలో జరిగిన అవమానం, బిగ్ బాస్ షోలో ఆఫర్ ఎలా వచ్చింది అనే విషయాలను వెల్లడించింది.
ఇంటర్వ్యూలో వర్ష 'జబర్దస్త్ నుంచి సడన్‌గా బిగ్‌బాస్‌లో కనిపించడానికి కారణం ఏంటి?'అని ప్రశ్నించగా, ప్రియాంక సింగ్ సంచలన నిజాలను బయటపెట్టారు. 'జబర్దస్త్‌ను నేనే మానేశానని చెప్పలేను. నిజానికి వారే నన్ను గెంటేశారు. ఓ స్కిట్ కోసం ప్రాక్టీస్ చేశాను. యాక్ట్ చేయడానికి మేకప్ కూడా వేసుకున్నాను. అప్పుడు షో మేకర్స్ వచ్చి 'ప్రస్తుతం ఈ షో చేయడం కరెక్ట్ కాదు. షోకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వేరే లేడీ గెటప్స్ రెడీగా ఉన్నారు' అని ముఖం మీదే చెప్పారు. ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి'అంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ సమయంలో తాను ఏం తప్పు చేశానో అర్థం కాలేదని ప్రియాంక చెప్పారు. 'ముందు కూడా లేడీ గెటప్స్ వేసేదాన్ని, ఇప్పుడూ వేస్తాను. అందులో కొత్త ఏముందో నాకు తెలియదు. కానీ 'లేదు.. నువ్వు ఈ షో నుంచి వెళ్లిపోవాలి' అని చెప్పారు. నేను ఎక్కువగా ప్రశ్నించలేదు. ఎందుకు అని అడగలేదు. వెంటనే నా లగేజ్ ప్యాక్ చేసి, అసిస్టెంట్‌ని పిలిచి కార్ తీయమని చెప్పాను. నా లగేజ్‌తోనే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను' అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.
జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితులు మరింత కఠినంగా మారాయని ప్రియాంక చెప్పారు. 'ఇక్కడ అవమానం జరిగితే ఎక్కడో మంచి జరుగుతుందన్న నమ్మకం నాకు ఉంది. కానీ జబర్దస్త్ మానేసిన 10-15 రోజులకే నేను చాలా వీక్ అయిపోయాను. ఆర్థరైటిస్ వచ్చింది. దాదాపు ఒక సంవత్సరం పాటు బెడ్ మీదే ఉండాల్సి వచ్చింది'అంటూ తన కష్టకాలాన్ని వివరించారు. ఆ కష్టకాలంలో మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu) తనకు దేవుడిలా అండగా నిలిచారని ప్రియాంక భావోద్వేగంగా చెప్పారు.
'నాగబాబు గారు నాకు ఆర్థికంగా భరోసా ఇచ్చారు. ప్రతిరోజూ ఫోన్ చేసి 'ఎలా ఉన్నావు? ఆరోగ్యం ఎలా ఉంది?' అని అడిగేవారు. నేను కోరుకున్నంతవరకు ప్రతి నెలా డబ్బులు పంపించారు. ఆ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్నో లేదో తెలియదు' అంటూ ఎమోషనల్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్లీ అవకాశాలు రావడం ప్రారంభమైందని ప్రియాంక చెప్పారు. 'మా టీవీలో కొన్ని షోలలో పాల్గొన్నాను. ఆ సమయంలో కూడా నాగబాబు గారు సపోర్ట్‌గా నిలిచి కొన్ని షోలకి నన్ను రిఫర్ చేశారు. అదే సమయంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది' అని వెల్లడించారు.
బిగ్‌బాస్‌లో పాల్గొనడం వల్ల తన జీవితమే మారిపోయిందని ప్రియాంక చెప్పారు.'బిగ్‌బాస్ తర్వాత నాకు ఫాలోయింగ్ బాగా పెరిగింది. అవకాశాలు కూడా వచ్చాయి. కానీ నిజం చెప్పాలంటే బిగ్‌బాస్‌లో జరిగిన ఎపిసోడ్స్‌ను ఇప్పటివరకు నేను పూర్తిగా చూడలేదు' అంటూ ఆశ్చర్యపరిచారు.
ముఖ్యంగా హౌస్‌లో జరిగిన కొన్ని విషయాలు, ముఖ్యంగా మానస్‌కు సంబంధించిన అంశాలను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
బిగ్‌బాస్‌లో అడుగుపెట్టినప్పుడు తన వయసు కేవలం 21 ఏళ్లేనని ప్రియాంక చెప్పారు. 'బయట ప్రపంచం గురించి అంత అవగాహన లేదు. అక్కడ కొట్టుకున్నా, తిట్టుకున్నా అడిగేవారు ఎవ్వరూ లేరు. ఉన్నన్ని రోజులు చాలా సరదాగా గడిచిపోయాయి' అంటూ తన జర్నీని ముగించారు.


Click it and Unblock the Notifications











