నా కులం కారణంగా ఛాన్స్‌లు ఇవ్వలేదు.. బిగ్ బాస్ సెలెబ్రిటీకి చేదు అనుభవం..
సినీ ఇండస్ట్రీలోకి సీరియల్స్ నుంచి ఎంట్రీ ఇచ్చి, బిగ్‌బాస్‌తో భారీ గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కఠిన అనుభవాలను బయటపెట్టారు. సినిమా అవకాశాలు చివరి దశలో తన కులం కారణంగా కోల్పోయానని చెప్పడం కలకలం రేపుతోంది. హీరోగా సెలెక్ట్ చేసి, అగ్రిమెంట్ దశకు వెళ్లిన తర్వాత కూడా ఇంటిపేరు చూసి తప్పించారని ఆయన ఆరోపించడం మరింత షాకింగ్‌గా మారింది. అసలు ఈ బిగ్‌బాస్ నటుడు ఎవరు? నిజంగా ఇండస్ట్రీలో ఇలాంటి వివక్ష ఉందా? అసలేం జరిగింది?
ఆ నటుడు ఎవరో కాదు.. యంగ్ హీరో రవికృష్ణ (Ravi Krishna). సీరియల్ నుంచి సినిమాల వరకు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు. 'మొగలిరేకులు' సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమైన రవి, తరువాత బిగ్ బాస్ తెలుగు షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించాడు. ఆ గుర్తింపుతో సినిమాల్లోకి అడుగుపెట్టిన ఆయనకు 'విరూపాక్ష' సినిమా కీలక మలుపుగా మారింది. ఆ వరుస తరువాత అవకాశాలతో బిజీ అయిన రవి, ఇటీవల విడుదలైన 'దండోరా'సినిమాలో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాయి.

'దండోరా' సినిమాలో కుల వివక్ష నేపథ్యంలో కథ నడుస్తుండగా, తక్కువ కులానికి చెందిన యువకుడిగా రవి పోషించిన పాత్ర ప్రేక్షకుల్ని కదిలించింది. అగ్రకులానికి చెందిన అమ్మాయితో ప్రేమలో పడిన యువకుడు చివరికి హత్యకు గురయ్యే పాత్రలో ఆయన నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే, తెరపై చూపించిన ఈ కథ కేవలం కల్పితం మాత్రమే అయినా, తన నిజ జీవితానికి దగ్గరగా ఉందని ఈ నటుడు రవి చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవికృష్ణ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలు, ఇండస్ట్రీలోని అనుభవాలను వివరంగా వెల్లడించాడు. విజయవాడకు చెందిన మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాలపై చిన్నప్పటి నుంచే ఆసక్తి . అయితే.. ఇండస్ట్రీ ఎలా వెళ్లని పరిస్థితి. ఈ క్రమంలో ఇంటర్ తర్వాత సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటే కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో, ముందుగా డిగ్రీ పూర్తి చేసి తర్వాత తన కలను నిజం చేసుకునే ప్రయత్నం చేశాడు.
ఇండస్ట్రీ ఎక్కడ ఉందో తెలియక తొలుత చెన్నైకి వెళ్లి అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. తరువాత తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌లోనే ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చాడు. అవకాశాల కోసం అనేక రోజులు తిరిగిన తర్వాత 'మొగలిరేకులు' సీరియల్ ఆడిషన్స్ గురించి తెలిసి చివరి నిమిషంలో అవకాశం పొందాడు. అదే అతని కెరీర్‌కు మొదటి మెట్టు అయింది. ఆ సీరియల్ ద్వారా వచ్చిన గుర్తింపు అతనికి సినిమాల దారిని తెరిచింది.
అయితే, ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలు మాత్రం సాధారణం కాదని రవి చెప్పాడు. ముఖ్యంగా కుల వివక్ష తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'కొంతమంది నన్ను హీరోగా సెలెక్ట్ చేశారు. అగ్రిమెంట్ దశకు కూడా వెళ్లాం. కానీ నా ఆధార్ కార్డు పంపిన తర్వాత నా ఇంటిపేరు చూసి వెనక్కి తీసుకున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కారణం అడిగితే 'ఈ కథ మీకు సెట్ కాదు' అంటూ తప్పించుకున్నారని పేర్కొన్నాడు.
ఇలాగే మూడు నుంచి నాలుగు సినిమాలు చివరి దశలో తన చేతిలోంచి జారిపోయాయని రవి తెలిపాడు. హీరోగా మాత్రమే కాకుండా ఫ్రెండ్ పాత్రైనా చేస్తానని చెప్పినా, వివిధ కారణాలు చూపించి అవకాశాలు ఇవ్వలేదని ఆయన బాధపడ్డారు. స్కూల్, కాలేజీ రోజుల నుంచే కులం గురించి ప్రశ్నలు ఎదుర్కొన్నానని, ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగిందని వెల్లడించాడు.
అయితే ఈ సమస్యల గురించి చాలా కాలం మౌనం పాటించానని, ఎందుకంటే కెరీర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాట్లాడితే అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఉండేదని రవి చెప్పారు. కానీ భవిష్యత్తులో మరింత స్థిరమైన స్థాయికి చేరుకున్న తర్వాత ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడాలని తన నిర్ణయం అని తెలిపారు. రవికృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications