రెండో పెళ్లి చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ... సమంత రూట్‌లోనే షాకింగ్ డెసిషన్!
ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సెలబ్రిటీలంతా ఒకరి తర్వాత మరొకరు పెళ్లిపీటలెక్కుతున్నారు. కొద్దిరోజుల క్రితం స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. దర్శకుడు రాజ్ నిడిమోరులు పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో రాజ్- సమంతల పెళ్లి జరిగింది. అలాగే తమిళనాడుకు చెందిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ సంయుక్త షణ్ముగనాథన్ రెండో పెళ్లి చేసుకున్నారు. తన ప్రియుడు, క్రికెటర్ అనిరుధ్ శ్రీకాంత్‌ని వివాహం చేసుకున్నారు. తాజాగా మరో బిగ్‌బాస్ బ్యూటీ సైలెంట్‌గా షాకిచ్చింది. ఈ వివరాల్లోకి వెళితే..
మోడలింగ్ నుంచి హీరోయిన్‌గా
బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా ప్రసారమవుతోన్న హిందీ బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్‌గా పాపులర్ అయ్యారు సారా ఖాన్. భోపాల్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ తొలుత మోడలింగ్‌లోకి దిగారు 2007లో మిస్ భోపాల్‌గా గెలిచిన సారా ఖాన్.. ఆ తర్వాత బుల్లితెర ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. సప్నా బాబుల్ కా బిడాయీ, ప్రీత్ సే బందీ యే దోరి రామ్ మిలాయి జోడీ, సాసురల్ సిమార్ కా తదితర ధారావాహికలతో కుటుంబ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.

పెళ్లయిన 2 నెలలకే విడాకులు
ఈ దశలో సారా ఖాన్‌కు సినీ రంగం నుంచి పిలుపొచ్చింది. డార్క్ రెయిన్ బో, ఎం 3 మిడ్‌సమ్మర్ మిడ్‌నైట్ ముంబై, తుజ్ సే హీ రబ్తా, హమారి అధూరి కహానీ, షైలా, కాంప్ డీసెంట్ తదితర సినిమాలలో నటించారు. ఈ దశలో బిగ్‌బాస్ 4లో ఆమెకు కంటెస్టెంట్‌గా అవకాశం వచ్చింది. ఇదే షోకు కంటెస్టెంట్‌గా వచ్చిన టీవీ నటుడు అలీ మర్చంట్‌తో సారా ఖాన్‌కు పరిచయం ఏర్పడింది. బిగ్‌బాస్ హౌస్‌లోనే వీరిద్దరూ ప్రేమాయణం సాగించారు. ఈ క్రమంలో పెద్దల అంగీకారంతో సారా- అలీలు 2010లో ఇస్లామ్ సాంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ రెండు నెలలు తిరిగేసరికి వీరిద్దరూ విడిపోయి షాకిచ్చారు.
అతనితో పెళ్లి ఓ పీడకల
పెళ్లిపై ఇద్దరూ రకరకాల కామెంట్స్ చేశారు. అలీ మర్చంట్‌ని పెళ్లి చేసుకోవడం ఒక పీడకల లాంటిదని సారా ఆవేదన వ్యక్తం చేశారు. అటు అలీ కూడా సారాతో పెళ్లి తాను జీవితంలో చేసిన పెద్ద తప్పు అని వ్యాఖ్యానించారు. సారాతో విడాకుల తర్వాత 2016లో అనమ్ మర్చంట్‌ను పెళ్లి చేసుకున్నారు అలీ. కానీ ఈ పెళ్లి కూడా పెటాకులైంది. 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం తన సన్నిహితురాలు ఆండ్లీబ్ జైదీని మూడో పెళ్లి చేసుకున్నాడు అలీ మర్చంట్.
రెండో పెళ్లి చేసుకున్న సారా ఖాన్
సారా ఖాన్ మాత్రం తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి సినిమాలు, సీరియల్స్, రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలతో నటిస్తూ బిజీ అయ్యింది. ఈ క్రమంలో నటుడు క్రిష్ పాఠక్‌తో ప్రేమలో పడిన సారా ఖాన్ ఆయనతో డేటింగ్ చేసింది. ప్రఖ్యాత రామాచణ హిందీ సీరియల్‌లో లక్ష్మణుడిగా నటించిన సునీల్ లాహిరి కుమారుడే క్రిష్ పాఠక్. సారా- క్రిష్‌లు తమ ప్రేమాయణానికి చెక్ పెడుతూ.. పెద్దల అంగీకారంతో డిసెంబర్ 5న ముంబైలో వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇస్లాం, హిందూ వివాహ సాంప్రదాయాల ప్రకారం క్రిష్ - సారాలు పెళ్లి చేసుకున్నారు.
గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య - సమంతలు కూడా ప్రేమలో పడి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరి వివాహం ఘనంగా జరగ్గా.. నాడు హిందూ, క్రిస్టియన్ వివాహ సాంప్రదాయాల ప్రకారం సమంత, నాగచైతన్యలు రెండు సార్లు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











