టెలివిజన్ సీరియల్స్‌లోకి సంజన గల్రానీ... ఆ హీరోయిన్‌కి అమ్మగా బిగ్‌బాస్ బ్యూటీ?
హీరోయిన్లుగా కెరీర్ ముగిసిన వారంతా వెండితెరపైనే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. టాప్ పొజిషిన్ చూసిన వారు కూడా తల్లి, వదిన, అక్క పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్నారు. సినిమాలలో ఛాన్సులు లేని వారు బుల్లితెరపై సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలోకే వస్తారు సంజన గల్రానీ. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా తెలుగు, కన్నడ భాషలలో ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
బెంగళూరులో స్థిరపడిన సింధీ కుటుంబంలో జన్మించిన సంజన గల్రానీ తొలుత మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారు. 2005లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన సోగ్గాడులో చిన్న పాత్ర ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి, వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ హీరోగా వచ్చిన బుజ్జిగాడులో హీరోయిన్‌కి చెల్లెలిగా నటించిన ఆమెకు బ్రేక్ దొరికింది. అనంతరం సత్యమేవ జయతే, పోలీస్ పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, లవ్ యూ బంగారం, అవును 2, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాలలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకుంది సంజన గల్రానీ.

సినిమాలతో పాటు వివాదాలతోనూ వార్తల్లో నిలిచారు సంజన. శాండిల్‌వుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో సంజన పేర తెరపైకి రావడం, ఆమె అరెస్ట్ కావడం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. అజీజ్ పాషా అనే డాక్టర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సంజన. ఈ దంపతులకు ఓ కుమార్తె సంతానం. గతేడాది బిగ్‌బాస్ తెలుగు 9లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చారు సంజన. భాష తెలియకపోవడం, మధ్యలో కాంట్రవర్సీలతో ఈమె ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండలేదని అంతా అనుకున్నారు. కానీ ఫైనల్‌లో అడుగుపెట్టి కప్‌కి అడుగు దూరంలో ఎలిమినేట్ అయ్యారు. అప్పటి నుంచి స్టార్ మాలో ప్రసారమయ్యే పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వస్తున్నారు సంజన. బిగ్‌బాస్‌తో పాపులర్ అయినప్పటికీ సినిమాలలో ఎలాంటి ఆఫర్లు రాలేదు. ఈ క్రమంలో మరోసారి బుల్లితెరనే నమ్ముకున్నారు సంజన. అది కూడా ఏకంగా సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఈ బ్యూటీ.
త్వరలో స్టార్ మాలో ప్రసారం కానున్న ఏ దేవి వరమో నీవు అనే కొత్త సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై మరోసారి అదృష్టం పరీక్షించుకోనున్నారు సంజన. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం విజయనగరం జిల్లా కొత్త వలస గ్రామంలోని శబరి అనాథ శరణాలయం.. దానిని నడిపే ఓ వృద్ధురాలు, అక్కడ ఓ పాతికేళ్ల అమ్మాయి, అనాథలతో ప్రోమోను ప్రారంభించారు. అక్కడ చాలీ చాలని వసతులతో ఇబ్బందులు పడే పిల్లలు, వారికి అండగా నిలిచే ధైర్యవంతురాలైన యువతిగా ఉంటుంది. రోజూ ఉప్మానే పెడుతున్నారని పిల్లలు కంప్లయంట్ చేయగా.. అందుకే ఉప్మా లడ్డూలు చేయించామని హీరోయిన్ అంటుంది. దానికి ఆ పిల్లలు గోల గోల చేస్తారు.
ఇంతలో కొందరు రౌడీలు వచ్చి అనాథాశ్రమాన్ని ఖాళీ చేయాలని లేదంటే అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతారు. దాంతో హీరోయిన్ వచ్చి అంతా నేను చూసుకుంటాను, మీరేం బాధపడొద్దని చెబుతుంది. ఈ ఆశ్రమం కాదు.. నీకూ ఓ కుటుంబం ఉందని ఓ కాగితంలో వివరాలు రాసి పంపిస్తుంది. తల్లిని వెతుక్కుంటూ వెళ్లిన కూతురు.. తల్లి పాతికేళ్ల ప్రశాంతతను కల్లోలంగా మారుస్తుందా? అంటూ ఎండ్ కార్డ్ వేశారు.
ప్రోమోను బట్టి చూస్తే.. తల్లి పాత్రలో ఉన్న సంజన.. వయసులో ఉన్నప్పుడు చేసిన తప్పు వల్ల అంజలి పుట్టడంతో ఆమెను అనాథ శరణాలయంలో వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటుంది. అలాంటిది పాతికేళ్ల తర్వాత తన కూతురు వస్తే ఆమె జీవితంలో ఎలాంటి కల్లోలం చోటు చేసుకుంది? ఆమెను కూతురిగా అంగీకరిస్తుందా అన్నదే ఏ దేవి వరమో నువ్వు సీరియల్ కథగా తెలుస్తోంది. ఇందులో సంజన తల్లి పాత్రలో నటిస్తుండగా.. ఉప్పెన సీరియల్ ఫేమ్ సోనియా ఆమెకు కూతురిగా అంజలి అనే పాత్రలో ఈ సీరియల్‌లో లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇంకా సీనియర్ నటి, డ్యాన్సర్ మంజు భార్గవి ఆశ్రమాన్ని నడిపే జానకమ్మగా కీలకపాత్ర పోషిస్తున్నారు. మిగిలిన నటీనటులు, సీరియల్ లాంచింగ్‌కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications



