టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ చీటింగ్ ... కోట్ల రూపాయాలు మోసపోయా!
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామర్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంజన గల్రానీ (Sanjjanaa Galrani).. సినిమాలతో పాటు వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, డ్రగ్స్ కేసు, జైలు జీవితం కారణంగా తరచూ వార్తల్లో నిలిచే సంజన.. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని చేదు అనుభవాలను బయటపెట్టి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చి తిరిగి కెరీర్‌పై దృష్టి పెడుతున్న ఆమె.. 'కిస్సిక్ టాక్స్' ఇంటర్వ్యూలో పాల్గొని తన సినీ ప్రయాణం, ఆర్థిక ఇబ్బందులు, మోసాలు, ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఒత్తిళ్ల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇంతకీ ఏమన్నారంటే?
సంజన మాట్లాడుతూ.. "నేను ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు గాడ్‌ఫాదర్ లేరు. ప్రతి అవకాశాన్ని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డాను. ఒక సినిమా వదిలేస్తే మళ్లీ అవకాశం వస్తుందా లేదా అనే భయం ఎప్పుడూ వెంటాడేది. ఆ భయంతోనే నాకు నచ్చని పాత్రల్లో కూడా నటించాల్సి వచ్చింది" అని తెలిపారు. ఇండస్ట్రీలో నిలబడాలంటే ప్రతి రోజూ ఒక సైలెంట్ వార్ జరుగుతూనే ఉంటుందని, ఆ పోరాటాన్ని ఎదుర్కొనే వాళ్లే నిలబడగలరని ఆమె పేర్కొన్నారు.

తన కెరీర్‌లో ఇప్పటివరకు దాదాపు 55 సినిమాల్లో నటించానని, అనేక టీవీ షోలు, రియాలిటీ షోల్లో పాల్గొన్నానని సంజన చెప్పారు. "నన్ను ఎవరైనా కిందకు లాగాలని చూసినా నేను నిలబడతాను. విమర్శలు చేసే వాళ్లను అస్సలు పట్టించుకోను" అంటూ ధైర్యంగా స్పందించారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చేసిన కొన్ని నిర్ణయాలు తనను 'రాంగ్ రూట్స్' వైపు తీసుకెళ్లాయని కూడా ఆమె అంగీకరించారు.
డబ్బు, మనుషుల గురించి మాట్లాడిన సంజన.. "నేను చాలా మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిని. ఒక్క రూపాయి ఖర్చు పెట్టాలన్నా పది సార్లు ఆలోచిస్తాను. ఏదైనా కొనాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో ధరలు చెక్ చేసి తక్కువ ఉన్న చోట కొనడానికి ప్రయత్నిస్తాను" అని చెప్పారు. "డబ్బును గౌరవిస్తాను.. కానీ మనుషులకు మరింత విలువ ఇస్తాను. ముఖ్యంగా కుటుంబం చాలా ముఖ్యం" అంటూ ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తాను చిన్నప్పటి నుంచి సాధారణ కుటుంబంలో పెరిగానని గుర్తుచేసుకున్నారు.
సంజన.. "షూటింగ్‌కి వెళ్లడానికి సగం దూరం నడిచి వెళ్లి తర్వాత ఆటో ఎక్కేదాన్ని. డబ్బు సంపాదించడం కంటే దాన్ని సేవ్ చేయడం తెలిసినవారే నిజంగా రిచ్" అని అన్నారు. అయితే జీవితంలో నమ్మిన వాళ్ల చేతిలోనే భారీగా మోసపోయానని ఆమె వెల్లడించారు. "2015 సమయంలో కొంతమందికి డబ్బులు ఇచ్చి దాదాపు రెండు కోట్ల వరకు మోసపోయాను. ఇప్పటికీ ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి. అందులో ఒకరు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద ప్రొడ్యూసర్" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇక అప్పుల విషయంలో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటానని సంజన చెప్పారు. "ఇప్పుడు ఎవరైనా లక్ష రూపాయలు అడిగినా ఇవ్వలేను. అవసరం అయితే వెయ్యి లేదా రెండు వేల రూపాయలు ఇస్తాను.. తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ పెద్ద మొత్తాలు మాత్రం ఇక ఇవ్వను. ఒకసారి మోసపోయిన తర్వాత చాలా నేర్చుకున్నాను" అని తెలిపారు. ఇక అప్పు అడిగే వాళ్లకు నేరుగా 'మళ్లీ ఈ విషయం కోసం ఫోన్ చేయొద్దు' అని చెప్పేస్తానని అన్నారు.
ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయం కూడా సంజన వెల్లడించారు. "ఒక జ్యోతిష్యుడు నాకు ఒకసారి చెప్పాడు.. నువ్వు ఎవరికైనా డబ్బు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం కాదు.. ఆ మనిషి కూడా నీ జీవితంలో ఉండడు అని. ఆ మాట ఇప్పుడు నిజమని అనిపిస్తోంది. నేను జీవితంలో చాలాసార్లు ఇదే అనుభవించాను" అని ఆమె చెప్పారు. చివరిగా జీవితంపై తన అభిప్రాయాన్ని పంచుకున్న సంజన.. "ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు ఉంటాయి. వాటిని దాటుకుని ముందుకు సాగడమే జీవితం" అంటూ ముగించారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇండస్ట్రీలో ఎదురయ్యే ఒత్తిళ్లు, మోసాలు, మానసిక వేదనలపై మరోసారి చర్చ మొదలైంది.


Click it and Unblock the Notifications




