Bigg Boss: బిగ్‌బాస్ షోకు బిగ్ షాక్.. బ్యాన్ చేయాలంటూ భారీ నిరసన
Bigg Boss: అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ (Bigg Boss) ఒకటి. ప్రతి సీజన్‌కి క్రేజ్ పెరుగుతున్న కొద్దీ, వివాదాలు కూడా పెరుగుతూనే ఉన్నాయి. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న ఈ షోలో కంటెస్టెంట్ల మధ్య జరుగుతున్న గొడవలు, వాగ్వాదాలు తరచూ హాట్‌టాపిక్‌గా మారుతున్నాయి. తాజాగా బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 చుట్టూ వివాదం మళ్లీ ముదురుతోంది. ఇంతకీ ఏం జరిగింది?
ప్రస్తుతం విజయ్ టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9 ఈసారి 24 మంది పోటీదారులతో ప్రారంభమైంది. ఇప్పటికే ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ సీజన్‌కి విజయ్ సేతుపతి వరుసగా రెండోసారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల షోలో కమరుద్దీన్, ప్రవీణ్ రాజ్ మధ్య జరిగిన ఘర్షణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, షోపై విమర్శలు మరింత పెరిగాయి. వీడియోలో ఇద్దరూ తారాస్థాయిలో గొడవ పడటం, కుర్చీలు తోసుకోవడం, ఇతర కంటెస్టెంట్లు ఆపడానికి ప్రయత్నించడం కనిపించింది. దీంతో ఈ షో "వినోదం కంటే హింస" వైపు వెళ్తోందని కొందరు నెటిజన్లు విమర్శించారు.

ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రాంతీయ పార్టీ తమిళగ వాజ్వురిమై కట్చి (TVK) ఈ కార్యక్రమాన్ని తక్షణమే నిషేధించాలి అంటూ చెన్నైలో తీవ్ర నిరసన చేపట్టింది. ఈ షో తమిళ ప్రజల సంస్కృతి, నైతిక విలువలను అవమానపరుస్తోందని, పార్టీ నాయకులు ఆరోపించారు. టీవీకే కార్యకర్తలు వేల్స్ ఫిల్మ్ సిటీ సమీపంలో గుమికూడి, విజయ్ సేతుపతి దిష్టిబొమ్మలను దహనం చేసి, "బిగ్ బాస్ బ్యాన్ చేయాలి" అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 100 మందికి పైగా సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు మోహరించారు.
ఈ క్రమంలో టీవీకే నాయకుడు, ఎమ్మెల్యే వెల్మురుగన్ మాట్లాడుతూ.. "బిగ్ బాస్ తమిళ్‌లో అసహ్యకరమైన ఘటనలు, ముద్దు సన్నివేశాలు, బెడ్‌రూమ్ సీన్స్ ప్రసారం అవుతున్నాయి. ఇది యువతను తప్పుదోవ పట్టించే కంటెంట్. డబ్బు కోసం తమిళ సమాజాన్ని చెడగొడుతున్నారు. కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలతో కలిసి ఈ షో చూడలేని స్థాయికి చేరింది. విజయ్ టీవీ అసభ్యకర కంటెంట్‌తో లాభాలు పొందాలని చూస్తోంది. ఇది కళ కాదు, వ్యాపారం మాత్రమే. ఇలాంటి షోలను తక్షణమే నిలిపివేయాలి," అని డిమాండ్ చేశారు.
వెల్మురుగన్ తెలిపిన ప్రకారం.. ఈ విషయాన్ని ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అప్పావు దృష్టికి తీసుకెళ్లారు. "స్పీకర్ ఈ విషయం చర్చకు అనుమతించకపోతే, ముఖ్యమంత్రి, ఐటీ, ప్రసార శాఖలు చర్యలు తీసుకోకపోతే, విజయ్ టీవీ కార్యాలయం వద్ద వేలాది మహిళలతో కలిసి భారీ ఆందోళన చేపడతాం," అని హెచ్చరించారు. టీవీకే, అధికార పార్టీ ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) మిత్రపక్షం కావడంతో, ఈ నిరసనకు రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. గతంలో తెలుగు బిగ్ బాస్ కుడా ఇలాంటి నిరసనలు ఎదుర్కొంది. తాజాగా తమిళ్ బిగ్ బాస్ నిరసనలు ఎదుర్కొంటుంది. ఈ షోను బ్యాన్ చేస్తారా? ఏమైనా చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











