Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ షోలో అపశృతి.. అతడికి నరాల వీక్‌నెస్.. షో చరిత్రలో తొలిసారి కట్ చేసి!
తెలుగు బుల్లితెర చరిత్రలోనే టాప్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఎన్నో అనుమానాల నడుమ మన భాషలోకి వచ్చిన దీనికి.. ప్రేక్షకులు ఊహించని రీతిలో స్పందనను అందించారు. ఫలితంగా ఈ షో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ కారణంగానే ఇది విజయవంతంగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఏడో దాన్ని ఇటీవలే ప్రారంభించారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుస్తోన్న ఇది ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇందులో అపశృతి చోటు చేసుకుంది. ఆ వివరాలు మీకోసమే!
బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పటికే మూడు వారాలు పూర్తవగా సందీప్, శివాజి, శోభా శెట్టి మాత్రం పవర్ అస్త్రాలను సాధించి కన్ఫార్మ్ అయిన కంటెస్టెంట్లుగా నిలిచారు. ఈ క్రమంలోనే నాలుగో వారానికి సంబంధించి పవర్ అస్త్ర కోసం బిగ్ బాస్ బ్యాంకర్స్ టాస్కుకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో మొదటి రౌండ్‌లో అమర్‌దీప్, గౌతమ్‌లు రతికా, తేజపై గెలిచి సత్తా చాటారు.

ఆ తర్వాతి రౌండ్ కోసం ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ బజర్ దగ్గరే కూర్చుని కనిపించారు. ఫుడ్ కూడా అక్కడే తినడంతో పెద్ద గొడవ కూడా జరిగింది. అయితే, ఇద్దరిలో ఎవరు బజర్ నొక్కినా ఒకే టీమ్‌గా ఆడాలని ప్లాన్ చేశారు. ఇక, బజర్ మోగిన వెంటనే అందరి కంటే ముందే ప్రిన్స్ యావర్ నొక్కేశాడు. ఫలితంగా పార్ట్‌నర్‌ను, ప్రత్యర్థులను ఎంపిక చేసే అధికారం అందుకున్నాడు.
ఆ రౌండ్‌లో భాగంగా ఇందులో ఏడ్చి అయినా.. నవ్వుకుంటూ అయినా కన్నీళ్లతో గ్లాస్‌ను నింపాలి అని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. దీంతో ప్రిన్స్ తన పార్ట్‌నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ఎంపిక చేసుకున్నాడు. అలాగే, ప్రత్యర్థి జట్టుగా అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణను సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్కును గురువారం ఎపిసోడ్‌లో ప్రసారం చేయాల్సి ఉన్నా ఎందుకనో కట్ చేసేశారు.

గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ఈ టాస్కును వివరించిన కొద్ది సేపటి తర్వాత ఇందులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ గెలిచినట్లు బిగ్ బాస్ ప్రకటించాడు. కానీ, వాళ్లు ఎందుకు గెలిచారు? ఎలా గెలిచారు? అన్నది మాత్రం ప్రసారం చేయలేదు. దీంతో ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ టాస్కులో సహజంగానే ఏడ్చైనా, నవ్వైనా కన్నీరు తెప్పించుకుని గ్లాసు నింపాల్సి ఉంది. అయితే, మధ్యలో అమర్‌దీప్‌కు నరాల వీక్‌నెస్ వచ్చి పడిపోయాడట. అలాగే, ఈ టాస్క్ మొత్తం ఎమోషనల్‌గా సాగడంతో చూసే వాళ్లకు కంటెస్టెంట్లను హింసిస్తున్నారు అనే ఫీలింగ్ కలిగేలా వచ్చిందట.

ఈ సన్నివేశాలను చూపించడం వల్ల షోపై కొందరిలో వ్యతిరేకత రావడంతో పాటు దీన్ని నిషేదించాలని కోరుకుంటున్న వారిని ప్రోత్సహించినట్లు అవుతుంది అని బిగ్ బాస్ టీమ్ భావించిందని తెలిసింది. అందుకే టీవీలో ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో దీన్ని కట్ చేశారని అంటున్నారు. ఇలా దేశంలోని ఏ భాషలో కూడా అపశృతి జరగడం, టాస్క్ కట్ చేయడం జరగలేదని కొందరు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











