ఇళ్లు కట్టివ్వకపోతే.. నాగార్జున ఇంటికెళ్లి నిలదీస్తా.. 50 లక్షలు అంటూ.. గంగవ్వ కామెంట్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లో సంచలనం రేపిన గంగవ్వకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే బ్రహ్మండంగా రాణిస్తున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లారు. దాంతో ఒక్కసారిగా అభిమానులు, టీవీ ప్రేక్షకులు షాక్ గురయ్యారు. ఈ నేపథ్యంలో గంగవ్వను బిగ్‌బాస్ తెలుగు 2 విజేత కౌశల్ మండా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా గంగవ్వ మాట్లాడుతూ..

బిగ్‌బాస్‌కు ముందు ఎలాంటి సమస్యలు లేవు
బిగ్‌బాస్‌కు రావడానికి ముందు నాకు ఎలాంటి సమస్యలు లేవు. చెట్లు, పుట్టలు, పోలాల్లో తిరిగిన దానిని. నేను చాలా ఉత్సాహంగా ఉండేదానిని. అయితే బిగ్‌బాస్ కోసం వెళ్లినప్పుడు నన్ను 21 రోజులు హోటల్‌లో బంధించారు. క్వారంటైన్ పేరుతో కదలకుండా చేశారు. ఒక చిన్న గదిలో పెట్టడం వల్ల నాకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడింది. దాంతో నా ఆరోగ్యం క్షీణించింది అంటూ గంగవ్వ చెప్పారు.

బిగ్‌బాస్‌కు వచ్చే వరకు నా పరిస్థితి
హోటల్‌లో ఎక్కువ రోజులు ఉండి.. బిగ్‌బాస్ వేదిక మీదకు వచ్చేసరికే నాలో సహనం పోయింది. ఉత్సాహం తగ్గిపోయింది. ఇక ఇంటి వాతావరణం నాకు పడలేదు. ఏసీ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం సహకరించడం లేదు. నేను ఎప్పుడూ ఏసీలో ఉండలేదు. రెండుసార్లు జ్వరం వచ్చింది. డాక్టర్లు మంచి వైద్య అందించారు అని గంగవ్వ పేర్కొన్నారు.

50 లక్షలు సాధించాలనే ఉద్దేశంతో
బిగ్‌బాస్‌కు ముందు షో గురించి నాకు ఏమి తెలియదు. మా పిల్లలు కొంత సమాచారం ఇచ్చారు. ఇంట్లోకి వెళ్లే వరకు గుబులుగానే ఉండేది. ఒక్కసారి అక్కడికి వెళ్లిన తర్వాత కలిసిపోయాను. కేవలం 50 లక్షల బహుమతి సాధించాలనే పట్టుదలతో బిగ్‌బాస్ షోలోకి వెళ్లాను అంటూ గంగవ్వ చెప్పారు.
Recommended Video

అఖిల్ లవ్ ట్రాక్ గురించి
ఇక ఇంటిలో అందరూ తనను బాగా చూసుకొన్నారు. ఇంటిలో నాకు అఖిల్ సార్థక్ అంటే ఇష్టం. మోనాల్ గజ్జర్ అంటే నాకు ఇష్టం ఉండదు. నిమిషానికి ఓ సారి ఆమె మూడ్ మారిపోతుంది. అందుకే నాకు ఇష్టం ఉండదు. అఖిల్, మోనాల్ లవ్ ట్రాక్‌లో విషయం లేదు. అతా ఉత్తిదే అని గంగవ్వ చెప్పారు.

నా రెమ్యునరేషన్ ఎంతంటే..
బిగ్‌బాస్ నాకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారు. వారానికి చొప్పున పారితోషికం చెల్లించారు. వారానికి 2 లక్షల చొప్పున ఐదువారాలకు రూ.10 లక్షలు చెల్లించారు. నేను ఇల్లు కట్టుకోవాలని అనుకొంటున్నాను. దానిక పది లక్షలు సరిపోవు. బిగ్‌బాస్ ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. వాళ్లు మాట తప్పరు అని గంగవ్వ వెల్లడించారు.

ఇల్లు కట్టించకపోతే అంటూ..
నాకు ఇళ్లు కట్టిస్తానని నాగార్జున సార్ అందరికి తెలిసేలా చెప్పారు. ఒకవేళ ఇళ్లు కట్టించకపోతే నాగార్జున సార్ ఇంటికి వెళ్లి నిలదీస్తా అని సరదాగా నవ్వుతూ గంగవ్వ అన్నారు. ఆయన నన్ను ఇంటికి కూడా రమ్మని చెప్పారు. ఇళ్లు కట్టిస్తారని చెప్పారు కాబట్టి నాకు అది చేసి పెడుతారనే నమ్మకం ఉంది అని అన్నారు. నాగార్జున సార్ సహాయం చేస్తే కొంత ఇళ్లు కొట్టుకోవడానికి, కొంత దాచుకోవడానికి, మరికొంత బంగారం కొనుక్కొంటాను అని చెప్పారు.


Click it and Unblock the Notifications











