Bigg Boss Telugu 5.. మహిళా మహారాణులదే హవా.. బిగ్‌బాస్‌ను ఎదురించే సెలబ్రిటీలు ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ప్రారంభానికి రంగం సిద్ధమైంది. అయితే ప్రారంభ వేడుకకు సమయం దగ్గరపడుతున్న కొద్ది షోలో పాల్గొనే సెలబ్రిటీల పేర్లపై ఊహాగానాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు కంటెస్టెంట్ల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందని, చివరి నిమిషంలో ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటే స్టాండ్ బైలో కొందరిని పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే తుది జాబితాను ఖరారు చేసి ఈ షోను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారనే విషయం బయటకు వచ్చింది. అయితే ఈ షో గురించిన మరిన్ని వివరాలు..

సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభం
కోవిడ్ కారణంగా తెలుగు బిగ్‌బాస్ కాస్త ఆలస్యమైంది. థర్డ్ వేవ్ భయాందోళనలతో నిర్వాహకులు ఆచితూచీ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ షోను సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సెట్, ఇతర మౌళిక సదుపాయాల పనులు పూర్తి చేసినట్టు సమాచారం. బిగ్‌బాస్ ఇంటిని అందంగా ముస్తాబు చేసే పనిలో సిబ్బంది ఉన్నట్టు తెలుస్తున్నది.

హోమ్ క్వారంటైన్‌లో సెలబ్రిటీలు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో గత సీజన్‌లో కంటెస్టెంట్లను క్వారంటైన్‌కు తరలించిన మాదిరిగానే తాజా సీజన్‌లో కంటెస్టెంట్లను గృహ నిర్బంధం చేయనున్నారు. అలాగే కంటెస్టెంట్లకు కరోనావైరస్ పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు జరిపించి వారిని నేరుగా స్టార్ హోటల్‌లోకి షిఫ్ట్ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తున్నది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు యూనిట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

20 రోజులపాటు గృహ నిర్బంధంలో
బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ఫైనల్ కంటెస్టెంట్లకు ఆగస్టు 15 తర్వాత వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిర్వాహకులు, ఇతర సిబ్బంది ప్లాన్ చేశారు. దాదాపు 20 రోజులు వారిని గృహ నిర్బంధంలో ఉంచేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఫైనల్ కంటెస్టెంట్లతో అగ్రిమెంట్స్ పూర్తి చేసుకొన్నారు. ఇక ఫైనల్ జాబితాలో ఉన్న సెలబ్రిటీలు తమకు కావాల్సిన షాపింగ్, ఇతర పనుల్లో బిజీగా ఉన్నారనే విషయం తెలుస్తున్నది.

బిగ్‌బాస్‌ను ఎదురించే మహిళా మహారాణులు వీరే
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలోకి వెళ్లే కంటెస్టెంట్లలో ప్రస్తుత సీజన్‌లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారనేది తాజా సమాచారం. లేడీ సెలబ్రిటీల్లో సురేఖ వాణి, నవ్యస్వామి, ప్రియాంక సింగ్, టీవీ9 ప్రత్యూష, ఆర్జే కాజల్, వర్షిణి సౌందర్యరాజన్, ప్రియా రామన్, ఆర్టిస్టు ప్రియ, సిరి హనుమంతు, అన్నీ మాస్టర్, కార్తీకదీపం ఫేమ్ ఉమాదేవి తదితరులు పేర్లు ప్రాబబుల్స్ లిస్టులో ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. పురుషుల్లో శేఖర్ మాస్టర్, దుర్గారావు, సిద్దార్థ్ వర్మ, యాంకర్ రవి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
Recommended Video

డిసెంబర్ 19న ఫైనల్ షో..
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 5లో పాల్గొనే మహిళా సెలబ్రిటీల్లో ఎక్కువ మంది వివాహితులే అని చెబుతున్నారు. దాంతో ఈ షో ఎలా ఉండబోతుందనే ఆసక్తి పెరుగుతున్నది. ఎన్ని పేర్లు వినిపించినా చివరకు వేదిక మీద మెరిసేది.. షోలో అదరగొట్టేది ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఈ షో డిసెంబర్ 19వ తేదీన ఫైనల్ జరిగేలా ప్లాన్ చేశారు.


Click it and Unblock the Notifications











