Bigg Boss: ఫినాలే ముందు ఊహించని సంఘటన.. సన్నీకి కలిసొచ్చిన మరో అంశం.. ఆమె వల్ల ఓటింగ్ పెరిగే ఛాన్స్
బిగ్ బాస్.. దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో ప్రసారం అవుతూ.. నెంబర్ వన్ స్థానంలో వెలుగొందుతోన్న రియాలిటీ షో. మరీ ముఖ్యంగా ఇది తెలుగులో భారీ స్థాయిలో స్పందనను అందుకుంది. ఫలితంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మొదలైన ఐదో సీజన్ కూడా అదే రీతిలో సాగుతూ ముగింపు దశకు చేరుకుంది. ప్రస్తుతం జరుగుతోన్న ఫినాలే వీక్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు విజయం సాధించాలని పాటు పడుతున్నారు. దీంతో వాళ్ల వాళ్ల అభిమానులు సైతం భారీగా ఓట్లు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్ అయిన సన్నీకి బాగా కలిసొచ్చే సంఘటన ఒకటి బిగ్ బాస్ హౌస్‌లో జరిగింది. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
Recommended Video

ఐదుగురు కంటెస్టెంట్ల మధ్య పోటీ
ఎన్నో అంచనాల నడుమ మొదలైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ కోసం పోరాడుతున్నారు.

గ్రాండ్ ఫినాలేకు ముందు సూపర్
బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతుంది. దీంతో ఈ వారం మొత్తం ఎలాంటి టాస్కులూ ఉండబోవన్న విషయం తెలిసిందే. కానీ, గ్రాండ్ ఫినాలే వరకూ ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటూనే ఉంటుంది. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో సైతం ఎన్నో సరికొత్త ప్లాన్లతో నిర్వహకులు సందడి చేస్తున్నారు. దీంతో ప్రేక్షకుల కావాల్సిన మజా ఈ వారం రోజుల్లోనే దొరుకుతుంది.

జర్నీ వీడియోలు.. ఫొటో స్టోరీలతో
ప్రతి సీజన్‌లోనూ ఫినాలేకు చేరుకున్న కంటెస్టెంట్లకు షో నిర్వహకులు వాళ్ల వాళ్ల జర్నీ వీడియోలను చూపిస్తూ ఉంటారు. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో సైతం ఫినాలే కంటెస్టెంట్లకు వాటిని చూపించారు. మూడు ఎపిసోడ్లలోనూ ఇదే చూపించింది బిగ్ బాస్ యూనిట్. ఆ తర్వాత రెండు ఫొటోలను ఎంచుకుని ఒకదాని గురించి మిగిలిన వాళ్లతో పంచుకునే టాస్క్ కూడా ఇచ్చారు.

పాత టాస్కులను మళ్లీ తీసుకొచ్చి
బిగ్ బాస్ ఫినాలే వీక్‌లో భాగంగా గతంలో జరిగిన ఐదు టాస్కులను ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లతో ఆడించారు. అంతేకాదు, వీటిలో గెలిచిన వాళ్లకు స్పెషల్ గిప్టులు ఇస్తామని కూడా వెల్లడించారు. ఇవి సరదాగా జరిగిన టాస్కులే అయినా కంటెస్టెంట్లు అందరూ పోటాపోటీగా ఆడారు. ఎలాగైనా గెలవాలన్న కసితో టాస్కులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.

ఐదు టాస్కుల్లో నలుగురు గెలుపు
ఆరంభం నుంచే సరదాతో పాటు కసిగా సాగిన ఈ టాస్కుల్లో మొదట బెలూన్లలో గాలిని నింపుతూ వాటిని పగలగొట్టే టాస్క్ ఇవ్వగా ఇందులో షణ్ముఖ్ జస్వంత్ గెలిచాడు. ఆ తర్వాత టీషర్టులు వేసుకునే గేమ్‌లో మానస్, టైం లెక్కించే గేమ్‌లో షణ్ముఖ్, సౌండ్లను గుర్తించే టాస్కులో శ్రీరామ్, రోప్ టాస్కులో సన్నీలు విజయం సాధించారు. సిరి మాత్రమే ఒక్క టాస్క్ కూడా గెలవలేదు.

సన్నీతో మళ్లీ ఫైటింగ్ చేసిన సిరి
ఐదో టాస్కులో రోప్‌ను ఎక్కువసేపు ఆపకుండా కదపాల్సి ఉంటుంది. ఇందులో సిరి, సన్నీ, షన్నూ ఆడగా సన్నీ గెలిచాడు. ఆ సమయంలో సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు, కానీ ఆమెకు ఓడిపోయావన్న మాట అస్సలు నచ్చలేదు. దీంతో తర్వాత వచ్చి సారీ చెప్పాడు. అయినా సిరి ఏమాత్రం తగ్గకుండా అతడిపై ఘోరంగా ఫైర్ అయింది. కానీ, సన్నీ మాత్రం కూల్‌గా ఉన్నాడు.

సన్నీకి కలిసొచ్చే మరో అంశంగా
నిన్నటి ఎపిసోడ్‌లో సిరి హన్మంత్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సన్నీపై ఆమె అరిచిన తీరు విమర్శలపాలవుతోంది. అదే సమయంలో ఎంతో సంయమనంగా వ్యవహరించిన సన్నీపై మాత్రం ప్రశంసలు వస్తున్నాయి. ఇది అతడికి ఓటింగ్‌లో కూడా బాగా కలిసొస్తుంది. దీంతో నిన్నటి ఎపిసోడ్ తర్వాత నుంచి అతడికి మరిన్ని ఓట్లు పోల్ అవుతున్నాయని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











