నక్క తోక తొక్కిన నిఖిల్ .. 55 లక్షల ప్రైజ్‌మనీ, కారుతో పాటు మరో భారీ చెక్కు .. ఎన్ని లక్షలంటే?
దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 8కి ఎండ్ కార్డ్ పడింది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో సీరియల్ నటుడు , కర్ణాటకకు చెందిన నిఖిల్ విజేతగా నిలిచారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన పోటీలో గౌతమ్ టఫ్ ఫైట్ ఇచ్చిన విజయం మాత్రం నిఖిల్‌నే వరించింది. గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిఖిల్‌కు బిగ్‌బాస్ తెలుగు 8 ట్రోఫీ, రూ. 55 లక్షల ప్రైజ్ మనీ అందించాడు.
అయితే తెలుగు బిగ్‌బాస్‌లో కన్నడ వ్యక్తిని విజేతగా ప్రకటించడం ఏంటంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అలాగే ఆదివారం గౌతమ్ అభిమానులు భారీగా అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నిరసన తెలిపేందుకు ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే గత సీజన్ అనుభవాల దృష్ట్యా పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడంతో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకోలేదు. కానీ కన్నడ - తెలుగు ఫీలింగ్ మాత్రం గట్టిగానే వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. అర్చనా అనంత్, శోభాశెట్టి, ఐశ్వర్య పిస్సే, రక్షా గౌడ, మంజుల, నవ్య స్వామి, తేజస్విని గౌడ, అషికా పదుకొనె వంటి భామలతో పాటు పలువురు కన్నడ అబ్బాయిలు కూడా తెలుగు సీరియల్స్‌లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు.. తెలుగు బిగ్‌బాస్‌లోనూ కన్నడ నటీనటులు కంటెస్టెంట్స్‌గా వచ్చి ఇక్కడా తమ జైత్రయాత్ర మొదలుపెట్టారు. గత సీజన్‌లో కర్ణాటకకే చెందిన శోభాశెట్టి, పూజామూర్తిలు ఎంట్రీ ఇచ్చి టఫ్ ఫైట్ ఇచ్చారు.
ఈ కల్చర్‌ను బిగ్‌బాస్ తెలుగు 8లోనూ కంటిన్యూ చేశారు. ఈసారి ఏకంగా నలుగురు కన్నడిగులకు అవకాశం కల్పించారు. వారే నిఖిల్, యాష్మీ గౌడ, ప్రేరణ కంభం, పృథ్వీరాజ్ శెట్టి . వీరంతా ఒక బ్యాచ్‌లా మారి తెలుగు కంటెస్టెంట్స్‌కి గట్టి పోటీ ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తగా.. ఇప్పుడు ఏకంగా కన్నడిగుడికే తెలుగు బిగ్‌బాస్ టైటిల్ కట్టబెట్టారు. దీనిపై తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. మరి దీనిపై బిగ్‌బాస్ నిర్వాహకులు ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.
ఏది ఏమైనప్పటికీ బిగ్‌బాస్ తెలుగు 8 విజేతగా నిఖిల్ నిలిచారు. సీజన్‌లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన నాటి నుంచి నిఖిల్ నిలకడగానే ఆడాడు. ఓజీ టీమ్‌ను అద్భుతంగా నడిపించాడు. తను గెలవడం కోసం అమ్మాయిల ఎమోషన్స్‌ను అడ్డుపెట్టుకున్నాడంటూ విమర్శలు వెల్లువెత్తినా తన ఆటతోనే సమాధానం చెప్పాడు. మొదటి నుంచి చివరి వరకు ఓ ఫైటర్ లాగానే పోరాడి తెలుగు బిగ్‌బాస్ టైటిల్‌ను తన ప్రతిభతో గెలుచుకున్నాడు.

ఇక బిగ్‌బాస్ తెలుగు 8 విజేతగా ప్రైజ్ మనీ కింద రూ. 55 లక్షలు అందుకుని తెలుగు బిగ్‌బాస్ చరిత్రలోనే ఇంత మొత్తం అందుకున్న వ్యక్తిగా నిలిచాడు. అలాగే డిజైర్ కారును కూడా సొంతం చేసుకున్నాడు. వీటితో పాటు దాదాపు 15 వారాల పాటు హౌస్‌లో ఉన్నందుకు గాను వారానికి రూ. 2.25 లక్షల చొప్పున మొత్తంగా రూ.33,75,000 లక్షల రెమ్యునరేషన్ దక్కించుకున్నాడు. మొత్తానికి తెలుగు బిగ్‌బాస్‌లో పాల్గొన్నందుకు గాను రూ. 88 లక్షల నగదు, ఓ కారును నిఖిల్ సొంతం చేసుకున్నాడు.


Click it and Unblock the Notifications











