అమ్మా రాజశేఖర్ తీవ్ర వ్యతిరేకత.. ఇంటి సభ్యులపై బిగ్‌బాస్ గట్టి దెబ్బ.. మరోసారి చిచ్చుతో..
బిగ్‌బాస్ తెలుగు షో నుంచి ఎనిమిదో వారం అమ్మా రాజశేఖర్ వెళ్లిపోతారని అందరూ అంచనా వేశారు. అయితే అందరి అంచనాలకు భిన్నంగా ట్విస్ట్ ఇచ్చి అమ్మా రాజశేఖర్‌ను సేవ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ప్రేక్షకుల్లోనే కాకుండా ఇంటి సభ్యుల్లో కూడా మాస్టర్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదనే విషయం మరోసారి స్పష్టమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

అమ్మా రాజశేఖర్‌పై తీవ్ర అసంతృప్తి
అమ్మా రాజశేఖర్‌పై గత కొద్దివారాలుగా ఇంట్లో అసంతృప్తి వ్యక్తమవుతున్నది. అప్పటి నుంచి అమ్మా రాజశేఖర్‌ను అందరూ కార్నర్ చేయడం ప్రారంభించారు. అయినా రాజశేఖర్ ఇంటి సభ్యులకు చేరవయ్యేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ.. ఆయనపై ఇంటి సభ్యుల అభిప్రాయం మారడం లేదనే ఆదివార ఎపిసోడ్‌లో స్పష్టమైంది.

మాస్టర్‌పై బహిరంగంగానే విమర్శలు
అమ్మా రాజశేఖర్‌పై అభిజిత్, అఖిల్, నోయల్ సీన్ బహిరంగంగానే విమర్శించారు. మోనాల్‌తో కూడా మాస్టర్‌కు సరిగా పడటం లేదు. ముక్కుసూటిగా మాట్లాడటం... కామెడీ చేయడం లాంటి విషయాలు ఇంట్లో అమ్మాకు ప్రతికూలంగా మారాయి. ఈ క్రమంలో ఆదివారం ఎపిసోడ్‌లో గేమ్ ఆడించగా.. వ్యతిరేకంగా ఆరు ఓట్లు పడ్డాయి. దానిని బట్టి అమ్మా రాజశేఖర్ అంటే ఇంటి సభ్యులకు ఎంత అయిష్టమో అర్థమైంది.

అమ్మా వెళ్లిపోవాలని అందరూ కోరుకొంటే
ఎలిమినేషన్‌లో భాగంగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో అరియానా, అవినాష్ తప్ప మిగితా ఇంటి సభ్యులందరూ అమ్మా రాజశేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోవాలని కోరుకొన్నారు. అమ్మా రాజశేఖర్ సిల్లిగా వ్యవహరిస్తారని అఖిల్ కామెంట్ చేస్తే.. పెద్దరికాన్ని మాపై రుద్దాలని చూస్తున్నాడని అభిజిత్ అభిప్రాయపడ్డారు. అలా అందరూ రకరకాల కారణాలు చెబుతూ వ్యతిరేకంగా ఓటు వేశారు.

ఆటను కొత్త మలుపు తిప్పిన బిగ్‌బాస్
ఇక నోయల్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో డబుల్ ఎలిమినేషన్‌ను కొనసాగించడం ఇష్టం లేక అమ్మా రాజశేఖర్‌ను సేవ్ చేయాలనే ప్లాన్ జరిగినట్టు స్పష్టమైంది. ఆ క్రమంలోనే అమ్మా రాజశేఖర్‌ను సేవ్ చేసి ఆటను కొత్త మలుపు తిప్పారు. ఇక తనపై వ్యతిరేకతను వ్యక్తం చేసిన ఇంటి సభ్యులపై అమ్మా రాజశేఖర్ ఎలా వ్యవహరిస్తారనే విషయం తదుపరి వారంలో మజాగా మారే అవకాశం ఉంది.

అమ్మా సేవ్ కావడంపై ఇంటి సభ్యుల నిరుత్సాహం
ఇక ఇంటి నుంచి వెళ్లిపోతాడని ఫిక్స్ అయిన ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఘోరమైన షాక్ ఇచ్చారు. అమ్మా రాజశేఖర్‌ను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేయడమే కాకుండా... నేరుగా కెప్టెన్సీ టాస్క్‌లో పాల్గొనే అవకాశాన్ని నేరుగా ఇస్తూ ఓ బంపర్ ఆఫర్‌ను కూడా ప్రకటించడం ఇంటిలోని వారికి జీర్ణించుకోలేకుండా పోయింది. అమ్మా రాజశేఖర్ సేవ్ అయ్యారని చెప్పినప్పుడు.. అరియానా, అవినాష్, సోహైల్, మెహబూబ్ తప్ప.. మిగితా వారి ముఖంలో ఆనందం కనిపించకపోవడం గమనార్హం.
Recommended Video

అతి మంచితనంతో అమ్మకు చేటా?
బిగ్‌బాస్ గేమ్‌లో రాజశేఖర్ ఆటతీరు చూసినప్పుడు పెద్దరికంగా వ్యవహరించాలనుకొంటాడు. అంతేకాకుండా అతి మంచితనానికి పోవడం కూడా కనిపిస్తుంది. ఈ రెండు అంశాలే మాస్టర్‌కు ప్రతికూలంగా మారుతున్నాయనేది ఇంటి సభ్యుల మాటల్లో వ్యక్తమైంది. ఇలాంటి అభిప్రాయాలు బయటపడిన తర్వాత ఇంటి సభ్యులతో అమ్మా రాజశేఖర్ తీరు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











