బిగ్‌బాస్‌లో చీటింగ్.. మూసుకుని కూర్చోలేనన్న భరణి... రీతూ, కళ్యాణ్‌లతో గొడవ
బిగ్‌బాస్ తెలుగు 9 తుది అంకానికి చేరుకుంది. మరో రెండు వారాలలో ఈ సీజన్ ముగియనుంది. ఫ్యామిలీ వీక్ నడిచినప్పటికీ హౌస్‌లో కొందరు కంటెస్టెంట్స్ మధ్య ఎలాంటి బాండింగ్ రాలేదు. ఇప్పటికీ ఇగోలు, పర్సనల్ అజెండాలతో హౌస్‌లో కొట్టుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు హౌస్‌లో ఉన్న వారందరి లక్ష్యం ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం. హౌస్‌లోని ప్రతి కంటెస్టెంట్ ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. గత కొద్దిరోజుల నుంచి హౌస్‌లో ఇందుకోసం టాస్క్‌లు జరుగుతున్నాయి. తాజాగా భరణి - రీతూ చౌదరి, భరణి - పవన్ కళ్యాణ్ మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్‌లో ఎంతమంది మిగిలారంటే?
బిగ్‌బాస్ తెలుగు 9లో ఇప్పటి వరకు శ్రష్టి వర్మ, మర్యాద మనీష్, ప్రియాశెట్టి, హరిత హరీష్, ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ, ఆయేషా జీనత్, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, రాము రాథోడ్, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, దివ్య నిఖితలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో భరణి శంకర్, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్, పవన్, రీతూ చౌదరి, సంజన గల్రానీ, సుమన్ శెట్టి, తనూజ పుట్టస్వామిలు హౌస్‌లో ఉన్నారు. ఇక ఈ వారం తనూజ, డిమోన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజన గల్రానీలు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఈ వారం ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు.

తొలి ఫైనలిస్ట్‌గా సోల్జర్ కళ్యాణ్?
కాగా.. ఇప్పటి వరకు ఇచ్చిన పలు టాస్క్‌ల అనంతరం ఫైనలిస్ట్ రేసు నుంచి ఇప్పటికే సంజన, తనూజ, పవన్, సుమన్ శెట్టిలు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, రీతూ చౌదరి, భరణిలు ఫైనలిస్ట్ రేసులో నిలిచారు. వీరికి రకరకాల టాస్క్‌లు నిర్వహిస్తున్నాడు బిగ్‌బాస్. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి.. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌లో టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచి ఫైనల్‌లో అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్ పడాల. తద్వారా బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్‌కు తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఈ సీజన్ చివరి కెప్టెన్‌గానూ కళ్యాణ్ నిలిచాడు. ప్రస్తుతం టైటిల్ రేసులో తనూజ, భరణి, కళ్యాణ్‌లు పోటీ పడుతున్నారు. ఈ విజయ పరంపరతో కళ్యాణ్ టైటిల్‌కు మరింత చేరువ అవుతున్నాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రచ్చ లేపిన వీడియోల వ్యవహారం
అలా హోరాహోరీగా సాగుతున్న బిగ్‌బాస్‌లో గత వారం నాగార్జున బయటపెట్టిన చీటింగ్ వీడియోలు రచ్చ లేపాయి. వీటిపై హౌస్‌లో గొడవలు జరుగుతుండగా... భరణి శంకర్ తాజాగా ఈ విషయంపై గొడవకు దిగాడు. తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోను బట్టి చూస్తే... టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో భాగంగా రీతూ చౌదరికి, భరణికి పోటీ జరగ్గా.. భరణి ఓడిపోయి రీతూ గెలిచింది. దాంతో సంచాలక్ ప్లేస్‌లో ఉన్న సంజన నిర్ణయాన్ని భరణి శంకర్ తప్పుబట్టాడు. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం.. ట్రయాంగిల్స్, స్క్వేర్స్, సర్కిల్స్ షేప్స్‌ని సరిగా గుర్తించి ముందుగా పెట్టినవాళ్లు గెలిచినట్లు. అయితే ఇందులో రీతూ పెట్టిన ట్రయాంగిల్.. అసలు ట్రయాంగిల్ కాదని నాలుగు భుజాలు ఉన్నాయని వాదించాడు భరణి.
మూసుకుని కూర్చోలేను
దాంతో నా పేరెందుకు తీస్తున్నావని రీతూ చౌదరి విరుచుకుపడింది. దానికి భరణి కూడా ఏమాత్రం తగ్గకుండా ఎక్కడెక్కడ చీటింగ్ జరిగింది? అన్యాయం జరిగింది? మొత్తం వీడియోలు బయటకు వచ్చాయి.. ఇప్పటి వరకు నోరుమూసుకుని కూర్చొన్నాను అంటూ పవన్, కళ్యాణ్‌ల చీటింగ్‌పై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశాడు భరణి. ఎవరైనా ఒకరు గెలిచారంటే పెద్ద రచ్చ చేయాలి, దానిని చెండాలం చేయాలి, ఒకడు హ్యాపీగా ఉంటే ఉండకూడదంటూ రీతూ కోపంగా లోపలికి వెళ్లిపోయింది. ఈ వ్యాఖ్యలతో కళ్యాణ్ మండిపడ్డాడు.. కన్ఫెషన్ రూంలో ఏం చూపించారో నాకు తెలుసు.. ఈ విషయం వీడికి కూడా తెలియదు అని చెప్పాడు. ఎవరెవరు ఏం చేశారో శ్రీజ నాకు మొత్తం చెప్పిందని కళ్యాణ్ అన్నాడు. అయితే నేను మీ పేరు తీశానా, నీ పేరు తీసినప్పుడు మాట్లాడమంటూ కళ్యాణ్ మీదికి కోపంగా వెళ్లాడు భరణి శంకర్. మరి ఈ గొడవలో చివరికి ఏం జరిగింది? ఎవరిది తప్పు? ఎవరిది ఒప్పు అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











