రమ్య పికిల్ కు బిగ్ బాస్ అన్యాయం.. ఫినాలేలో అర్హత లేని వాళ్ళే.. దువ్వాడ
Bigg Boss Telugu 9: ఎంతో రసవత్తరంగా సాగిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆదివారంతో అధికారికంగా ముగిసింది. 105 రోజుల పాటు ప్రేక్షకుల వినోదాన్ని పంచిన ఈ సీజన్‌లో కామనర్‌గా, మాజీ ఆర్మీ జవాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. మరోవైపు, సీజన్ ప్రారంభం నుంచే టైటిల్ ఫేవరేట్‌గా ప్రచారం పొందిన సీరియల్ నటి తనూజ రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ సీజన్‌కు సంబంధించిన మరో అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 'చిట్టి పికిల్స్' ఫేమ్ రమ్య మోక్షకు బిగ్ బాస్ అన్యాయం జరిగిందంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
అలేఖ్య చిట్టీ పికిల్స్ ఫేమ్ రమ్య మోక్ష ఐదో వారం వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టింది. షోలోకి వచ్చిన తొలి రోజే ఆమె ఆట తీరు చర్చనీయాంశమైంది. ఫిజికల్ టాస్క్‌లలో మగ కంటెస్టెంట్లకు ఏమాత్రం తీసిపోకుండా ఆడుతూ 'ఫైర్ స్టార్మ్' లాంటి ఎంట్రీ ఇచ్చింది. ఒక టాస్క్‌లో భరణిని కూడా ఈడ్చి పడేయడం అప్పట్లో పెద్ద హైలైట్‌గా మారింది. ఎనర్జీ, కమిట్‌మెంట్ ఉన్న కంటెస్టెంట్‌గా కనిపించినప్పటికీ, ఆమె నోటి దూల మాత్రం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు గురైంది.

ముఖ్యంగా కళ్యాణ్ పడాల, తనూజ మధ్య రిలేషన్‌పై రమ్య చేసిన వ్యాఖ్యలు హౌస్‌లోనే కాకుండా బయట కూడా పెద్ద దుమారం రేపాయి. మొదటి నామినేషన్‌లో ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నప్పటికీ, తరువాత వారంలో తనూజను లక్ష్యంగా చేసుకుని చేసిన కామెంట్స్ ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదని విమర్శలు వచ్చాయి. అంతేకాదు, లైవ్ క్లిప్స్‌లో కట్ కాని కొన్ని సన్నివేశాలు ఆమెకు మరింత నెగటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి. ఇతర కంటెస్టెంట్లపై వ్యక్తిగత వ్యాఖ్యలు, అనవసర ఆర్గ్యుమెంట్స్ ఆమె ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. ఈ కారణాలతోనే వచ్చిన రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్ చేసి బయటకు పంపారని టాక్.
ఈ ఎలిమినేషన్‌పై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 'చిట్టి పికిల్స్ రమ్య మోక్ష మొదటి వారంలోనే బయటకు రావడం నాకు చాలా బాధ కలిగించింది. రమ్య ఫైనల్ వరకు ఉండాల్సిన కంటెస్టెంట్. టాప్ ఫైవ్‌లో ఉంటుందో లేదో చెప్పలేను కానీ, అనవసరమైన వారిని మాత్రం అక్కడ ఎక్కువ రోజులు ఉంచారు' అంటూ ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 'రమ్య కష్టపడి పైకి వచ్చిన అమ్మాయి. ఆమె జీవిత కథ ప్రజలందరికీ తెలుసు. ఈ అమ్మాయి గెలిస్తే బాగుంటుందని చాలామంది అనుకున్నారు. ఈ విషయంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ రమ్య మోక్షకు తీరని అన్యాయం చేసింది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అంతేకాదు, రమ్య వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడిన దువ్వాడ శ్రీనివాస్, 'తండ్రి మరణం వంటి తీవ్రమైన బాధను మింగి తమ కాళ్ల మీద తాము నిలబడ్డారు. ఇలాంటి వారిని చూసి యువత నేర్చుకోవాలి. జీవితం ఎంత కష్టం వచ్చినా ఎలా ఎదుర్కోవాలో రమ్య లాంటి వారిని చూసి తెలుసుకోవాలి' అంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్యలకు పాల్పడే యువత ఒకసారి ఆలోచించాలి అని కూడా ఆయన సూచించారు.
అలాగే.. రమ్య పికిల్స్ కాంట్రవర్సీపై స్పందిస్తూ 'నా దృష్టిలో ఆమె చేసినది తప్పు కాదు. ఎదుటివారు ఎంత అవమానకరంగా మాట్లాడి ఉంటే, ఆ స్థాయిలో స్పందించాల్సి వచ్చి ఉంటుంది. ఆ మాటల వెనుక ఆమె ఎంత బాధ అనుభవించి ఉండవో ఆలోచించాలి' అంటూ రమ్యకు దువ్వాడ శ్రీనివాస్ పూర్తి మద్దతు తెలిపారు. ఇదే అంశంపై దివ్వెల మాధురి కూడా స్పందిస్తూ, "రమ్య విషయంలో బిగ్ బాస్ మేనేజ్మెంట్ అన్యాయం చేసింది. ఆమె చాలా స్ట్రాంగ్, ప్రతి విషయాన్ని ఎదిరించే ధైర్యం ఉన్న అమ్మాయి" అంటూ వ్యాఖ్యానించారు.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో, బిగ్ బాస్ 9లో రమ్య మోక్ష ఎలిమినేషన్ మళ్లీ చర్చకు వచ్చింది. కొందరు ఆమె ఆటలో తప్పులున్నాయని అంటుండగా, మరికొందరు మాత్రం ఆమెకు న్యాయం జరగలేదని మద్దతుగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











