సంజన నిజస్వరూపం ఇదే.. ఆమె వల్లే ఇలా..: ఇమ్మాన్యుయేల్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Emmanuel About Sanjjanaa: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ఘనంగా ముగిసింది. కామనర్‌గా షోలో అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలవగా, తనూజ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో టైటిల్‌కు ప్రధాన పోటీదారుడిగా భావించిన ఇమ్మాన్యుయేల్ (ఇమ్మూ) నాలుగో స్థానంతోనే ఎలిమినేట్ కావడం ప్రేక్షకులకు పెద్ద షాక్‌గా మారింది. ఈ ఎలిమినేషన్ హౌస్‌మేట్స్‌కే కాదు, బయట ఉన్న ఆడియెన్స్‌కూ ఊహించని ట్విస్ట్‌గా నిలిచింది. నిజానికి బిగ్‌బాస్ 9 ఈ స్థాయిలో హిట్ కావడానికి ఇమ్మాన్యుయేల్ పాత్ర చాలా కీలకమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
టాస్క్ ఏదైనా, గొడవల మధ్యైనా, ఎమోషనల్ సిట్యుయేషన్ అయినా.. తన కామెడీ టైమింగ్, పంచులతో షోకు లైఫ్ తీసుకొచ్చాడు ఇమ్మూ. చాలాసార్లు హౌస్‌లో టెన్షన్ వాతావరణాన్ని కూడా తన హ్యూమర్‌తో లైట్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అందుకే అతను ఫినాలే వరకు వెళ్లి టైటిల్ గెలుస్తాడన్న అంచనాలు బలంగా ఉన్నాయి. అలాంటి ఇమ్మూ అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. "ఇమ్మూ లేకుండా బిగ్‌బాస్ 9 ఎలా?" అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలిమినేషన్ తర్వాత ఇమ్మాన్యుయేల్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ, షోలో జరిగిన విషయాలపై ఓపెన్‌గా మాట్లాడుతున్నాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంజన గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. హౌస్‌లో సంజనతో తన బాండింగ్ గురించి ఇమ్మూ వివరించాడు. 'సంజన గారికి సపోర్ట్ చేస్తే నాకు పాజిటివ్ ఇమేజ్ వస్తుందా? నెగటివ్ వస్తుందా? అని నేను ఎప్పుడూ ఆలోచించలేదు. గుడ్డు దొంగతనం టాస్క్ జరిగిన రోజే ఆమె గేమ్ స్ట్రాటజీ నాకు అర్థమైంది. ఆమె ఎక్స్‌ట్రా ఆర్డినరీ కంటెస్టెంట్, గేమ్ చేంజర్ అని అప్పుడు క్లియర్ అయింది' అని చెప్పాడు.
అప్పటివరకు తాను ఆమెను 'సంజు పాప' అని పిలిచేవాడినని, ఆమె తనను 'ఇమ్ము' అని పిలిచేదని చెప్పాడు. హౌస్‌లో భావోద్వేగంగా కనెక్ట్ కావడం, తాను ఆమెను 'అమ్మ' అని పిలవడం, ఆమె తనను 'కొడుకు' అని పిలవడం అన్ని సహజంగా జరిగాయని స్పష్టం చేశాడు. 'ఇలా చేస్తే పాజిటివ్ ఇమేజ్ వస్తుంది, అలా చేస్తే నెగటివ్ వస్తుంది అనే ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. హౌస్‌లో అందరికంటే నిజాయితీగా ఉన్న పర్సన్ ఆమె. 'వందమంది రానివ్వండి, నేను ఇమ్మాన్యుయేల్ సైడ్‌లోనే నిలబడతా' అని ఆమె నాకు సపోర్ట్ చేసింది. నేను కూడా అంతే' అని ఇమ్మూ చెప్పాడు.
షో చివరి దశకు వచ్చేసరికి, తమ మధ్య వచ్చిన చిన్న చిన్న సమస్యలను అక్కడికక్కడే మాట్లాడుకుని సెట్ చేసుకునేవాళ్లమని తెలిపాడు. సంజన చాలా బ్రాడ్ మైండెడ్, మెచ్యూర్ పర్సన్ అని, అదే తనకు చాలా నచ్చిన అంశమని చెప్పాడు. ఆమె ముక్కుసూటిగా, స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడుతుందని, ఆ నిజాయితీనే తనను ఆకట్టుకుందని వివరించాడు. సంజనతో తన బాండింగ్ గురించి మరింతగా చెబుతూ, 'నేను చచ్చేంత వరకు సంజన గారిని వదులుకోను. మా మధ్య బాండింగ్ చాలా ప్యూర్. మీరు ఏమైనా అనుకోండి, కానీ మా ఇద్దరి మనుషులకు తెలుసు మేమెంత దగ్గరగా ఉన్నామో. ఆమె తన సొంత కొడుకును ఎలా చూసుకుంటుందో నన్ను కూడా అలానే చూసుకుంది. వయసులో నేను ఎంత పెద్దవాడినైనా, ఆమె నన్ను కొడుకుగానే భావిస్తుంది'అని భావోద్వేగంగా చెప్పాడు.
'అమ్మ' గురించి పాడిన పాటను సంజన అపార్థంగా అర్థం చేసుకున్న సందర్భం గురించి ప్రశ్నించగా... ఆమెకు తెలుగు పూర్తిగా అర్థం కాదని ఇమ్మూ వివరించాడు. 'తెలుగు సరిగా అర్థం కాకపోవడం వల్లే అలా జరిగింది. నేను వివరించడానికి ప్రయత్నిస్తే, ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నావు అని ఆమె అనుకునేది. భాషా సమస్య వల్లే ఆ అపార్థం వచ్చింది' అని చెప్పాడు. తెలుగు అర్థం కాకపోవడం వల్ల ఇతర కంటెస్టెంట్లతో కూడా ఆమెకు కొన్ని సందర్భాల్లో గొడవలు జరిగాయని గుర్తు చేశాడు.
ఇదే ఇంటర్వ్యూలో ఇమ్మూ తన ఎలిమినేషన్‌పై కూడా స్పందించాడు. ఓటింగ్ విషయంలో తనకు పూర్తి నమ్మకం ఉందని, కానీ ఫలితం మాత్రం నిరాశపరిచిందని చెప్పాడు. అయినా, బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రేమ, సపోర్ట్ చూసి చాలా హ్యాపీగా ఉన్నానని ఎమోషనల్‌గా తెలిపాడు. 'బిగ్‌బాస్ నా జీవితంలో మర్చిపోలేని జర్నీ. మనల్ని మనం మార్చుకునేందుకు, మన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించేందుకు ఇది గొప్ప వేదిక. కోట్ల మంది ఇందులో పాల్గొనాలని ఎదురుచూస్తుంటారు. అలాంటి అవకాశం నాకు దక్కడం నిజంగా అదృష్టం' అని అన్నారు.
మొత్తానికి బిగ్‌బాస్ 9 ముగిసినా... ఇమ్మాన్యుయేల్ మాత్రం ఇంకా ప్రేక్షకుల మనసుల్లోనే ఉన్నాడు. సంజనతో తన బాండింగ్‌పై చేసిన వ్యాఖ్యలు, ఎలిమినేషన్‌పై స్పందన అన్ని కలిసి మరోసారి ఇమ్మూను వార్తల్లో నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో అతని కెరీర్ ఏ మలుపు తిరుగుతుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











