బిగ్‌బాస్‌లో ఇమ్యాన్యుయేల్ సంచలనం.. ఏకైక కంటెస్టెంట్‌గా సరికొత్త చరిత్ర
బిగ్‌బాస్ తెలుగు 9 ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఇప్పటి వరకు 8 వారాలు పూర్తి చేసుకున్న ఈ సీజన్.. 9వ వారం ముగింపుకు చేరుకుని మరికొద్దిగంటల్లో 10వ వారంలోకి అడుగుపెట్టనుంది. ఈ సీజన్‌లో పలువురు కంటెస్టెంట్స్ తమ మైండ్ గేమ్, గేమ్స్‌లో దూకుడు, తమ వ్యక్తిత్వంతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వీరిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్ కూడా ఒకరు. ఈ సీజన్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ఎవరి వల్లనైనా వస్తోందంటే అది ఒక్క ఇమ్మాన్యుయేల్ వల్లే. తన పంచ్‌లు, కామెడీ టైమింగ్‌తో హౌస్‌లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తున్నారు. తాజాగా ఇమ్మాన్యుయేల్ బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించారు. ఈ వివరాల్లోకి వెళితే..
జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు రాష్ట్రాల్లో పాపులరైన ఇమ్మాన్యుయేల్... ఆ తర్వాత పలు షోలలోనూ పాల్గొంటూ బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. సినీ పరిశ్రమ నుంచి కూడా ఆఫర్లు అందుకుని దూసుకెళ్తున్నాడు. ఇమ్మాన్యుయేల్ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది. అందరిపై జోకులు, పంచ్‌లు విసురుతూ నవ్వుతూ నవ్విస్తుంటాడు. బిగ్‌బాస్ తెలుగులో కొత్త సీజన్ ప్రారంభమయ్యే ప్రతిసారి ఇమ్యాన్యుయేల్ పేరు వినిపిస్తూనే ఉంది. ఆ తర్వాత అది గాలి వార్తలుగా మిగిలిపోతూనే ఉన్నాయి. అయితే బిగ్‌బాస్ తెలుగు 9 ప్రారంభానికి ముందు మాత్రం ఇమ్మాన్యుయేల్ పేరు ఖచ్చితంగా ఉంటుందని గాసిప్స్ వచ్చాయి.

మరోసారి కెప్టెన్‌గా ఇమ్మాన్యుయేల్
సెప్టెంబర్ 7వ తేదీన బిగ్‌బాస్ లాంచింగ్ ఎపిసోడ్‌లో ఇమ్మాన్యుయేల్ కంటెస్టెంట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. నాటి నుంచి టాస్క్‌లు, గేమ్స్‌లో దూకుడుగా ఉంటూనే అందరితో కలివిడిగా ఉంటున్నారు ఇమ్మూ. హౌస్‌లో తన ఫ్రెండ్ రీతూ చౌదరి ఉన్నప్పటికీ ఆమెతోనే కాకుండా అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ఏ కంటెస్టెంట్ కూడా ఇమ్మాన్యుయేల్ గురించి చెడుగా చెప్పలేదు. తాజాగా బిగ్‌బాస్ తెలుగులో ఇమ్మాన్యుయేల్ చరిత్ర సృష్టించాడు. 9వ వారంలో అందరినీ దాటుకుని కెప్టెన్ అయిన అతను, హౌస్‌లో రెండోసారి కెప్టెన్ అయిన వారి లిస్ట్‌లో చేరాడు.
సంజన కోసం కెప్టెన్సీ త్యాగం
నిజానికి మొత్తం మూడు సార్లు ఇమ్మాన్యుయేల్ కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో సంజనను తిరిగి హౌస్‌లోకి పంపడానికి కంటెస్టెంట్స్ త్యాగాలు చేయాలని నాగార్జున కండీషన్ పెట్టారు. దీంతో తనూజ తనకు ఎంతో ఇష్టమైన కాఫీని వదులుకోగా.. రీతూ చౌదరి హెయిర్ కట్ చేయించుకుంది. అయితే సంజన కోసం ఇమ్మూ ఎవరూ చేయని త్యాగం చేశాడు. కెప్టెన్‌గా కష్టపడి గెలిచి సంజనను తిరిగి హౌస్‌లోకి తీసుకురావడం కోసం ఆ పదవిని వదులుకున్నాడు. లేదంటే మొత్తం మూడు సార్లు బిగ్‌బాస్ షోకి కెప్టెన్‌గా నిలిచిన ఘనత దక్కించుకునేవాడు.
9 వారాలుగా నామినేషన్స్‌లో లేకుండా
తాజాగా ఇమ్మాన్యుయేల్ మరో ఘనత సాధించారు. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఎందరో నామినేషన్స్‌లోకి వచ్చారు. వీరిలో కొందరు ఎలిమినేట్ కాగా.. మరికొందరు ప్రేక్షకుల మద్ధతుతో హౌస్‌లోనే కొనసాగుతున్నారు. ఒక కంటెస్టెంట్‌కు ప్రజల్లో బలం ఎంత ఉందో తెలియాలంటే కనీసం ఒకసారైనా నామినేషన్స్‌లోకి రావాలని విశ్లేషకులు చెబుతుంటారు. ప్రేక్షకుల నాడిని బట్టే బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారో కూడా అంచనాకు వస్తుంటారు. మరికొందరు మాత్రం కెప్టెన్సీ టాస్క్‌లలో గెలిచి నామినేషన్స్‌లోకి వెళ్లకూడదని సేఫ్ గేమ్ ఆడతారు.
ఇమ్మాన్యుయేల్ సంచలన రికార్డ్
ఈ నామినేషన్స్ విషయంలోనే ఇమ్మాన్యుయేల్ రేర్ రికార్డ్ సాధించాడు. బిగ్‌బాస్ తెలుగు 9 మొదలైన నాటి నుంచి కేవలం ఒకే ఒక్కసారి నామినేషన్స్‌లో నిలిచాడు. తొలి వారం ఒక్కసారే ఆయన నామినేషన్స్‌లోకి వచ్చి ఆ తర్వాత సేవ్ అయ్యాడు. గడిచిన 9 వారాలుగా ఇమ్మాన్యుయేల్‌ను ఎవరూ నామినేట్ చేయలేదు. దాంతో ప్రతి వారం సేవ్ అవుతూ హాయిగా తన ఆట ఆడుకుంటూ వస్తున్నాడు. ఇది ఓ రికార్డ్‌గానే చూసినప్పటికీ, ఇన్ని వారాల పాటు నామినేషన్స్‌లో రాకుండా ఉంటే జనంలో పాపులారిటీ, ఓటింగ్ తగ్గిపోతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో 5 వారాల్లో బిగ్‌బాస్ తెలుగు 9 ముగుస్తుండగా ఈసారైనా ఇమ్మాన్యుయేల్ నామినేషన్స్‌లోకి వస్తాడేమో చూడాలి.


Click it and Unblock the Notifications











