నా ఫ్యామిలీని వెంటాడుతున్నారు.. నన్ను బతకనివ్వరా... తనూజ పుట్టస్వామి ఎమోషనల్
బిగ్‌బాస్ తెలుగు 9లో రన్నరప్‌గా నిలిచి అందరి మనసులు గెలుచుకున్నారు కన్నడ నటి తనూజ పుట్టస్వామి. సీజన్ ప్రారంభం నుంచి ఒకేలా ఆడిన ఈ ముద్దుగుమ్మ... ఖచ్చితంగా విజేతగా నిలుస్తారని అంతా అనుకున్నారు. అయితే మధ్యలో కళ్యాణ్ పడాల దూసుకురావడంతో ఇద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది. చివరి క్షణం వరకు ఇది కొనసాగి.. ప్రేక్షకులను టెన్షన్ పెట్టింది. అయితే చివరికి కళ్యాణ్ పడాలను బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా ప్రకటించారు కింగ్ అక్కినేని నాగార్జున.
తనూజ విజయం సాధిస్తుందని ఎంతోమంది భావించగా.. బిగ్‌బాస్ ఇచ్చిన ఆఫర్‌కు ఆమె కూడా రాజీపడకుండా చివరి వరకు పోరాడారు. ఏ గ్రూప్‌లోనూ లేకుండా, ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా గేమ్ ఆడిన తనూజకు తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా గట్టి మద్దతు లభించింది. పక్కింటి అమ్మాయిలా కనిపించే తనూజకు మద్ధతుగా ఫ్యాన్ గ్రూప్‌లు, పేజీలు బలమైన గొంతుకలా నిలబడ్డాయి. ఎప్పుడు తనూజ నామినేషన్స్‌లో వచ్చినా ఆమె ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచేవారు.

అయితే తనూజకు మద్దతు నిలిచిన కొందరు.. ఇతర కంటెస్టెంట్స్‌ను ట్రోల్ చేయడం, అసభ్యకరంగా పోస్టులు పెట్టడం వివాదాస్పదమైంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ శ్రీసత్య, యష్మీ గౌడ తదితరులు ఏకంగా లైవ్‌లోకి వచ్చి మరీ దీనిపై ఆరోపణలు చేశారు. తనూజ తన పీఆర్ టీమ్‌తో డబ్బులిచ్చి కావాలని ఇదంతా చేయిస్తోందని ఆరోపించారు. బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ముగిసి ఇన్నిరోజులు కావొస్తున్నా ఇప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై తనూజ పుట్టస్వామి రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ముందు నన్ను నిందించడం, నిందలు వేయడం ఆపండి. మీలాగే నాకు కూడా ఒక జీవితం ఉంది. నా పని నేను చేసుకుంటున్నాను, నాకున్న బాధ్యతల్ని నెరవేరుస్తున్నాను. నాకు పీఆర్ టీమ్ అనేది లేదు.. కాకపోతే నా సోషల్ మీడియా అకౌంట్స్‌ని ఒక వ్యక్తి చూసుకుంటున్నాడు. ఇప్పటికీ నాపై తీవ్రమైన ద్వేషం కనిపిస్తోంది. నిత్యం అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకరిని టార్గెట్ చేశానని.. వారిపై దుష్ప్రచారం చేయిస్తున్నారని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అవతలి వారంటే మీకు ఇష్టం కావొచ్చు.. కానీ నా పరిస్ధితిని కూడా అర్ధం చేసుకోండి. ప్రతినిత్యం నరకం అనుభవిస్తున్నాను.. దారుణంగా బూతులు తిడుతూ, నన్ను, నా క్యారెక్టర్‌ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు.
బూతులు తిట్టడం మీకు తేలికగా కనిపిస్తుందేమో కానీ ఒక మహిళగా నేను భరించలేకపోతున్నా. నా కుటుంబంపైనా దారుణంగా మాట్లాడుతున్నారు, వాళ్లెంత బాధపడుతున్నారో. ఈ బాధను ఎవరితో పంచుకోవాలో తెలియక మౌనంగా భరిస్తున్నా. నన్నే కాదు.. నాకు అండగా నిలిచిన వారిని కూడా చిత్రవధ చేస్తున్నారు. ఇలా మానసికంగా ద్వేషిస్తే ప్రశాంతంగా ఉంటారా? నేను డ్రామా క్రియేట్ చేయాలని అనుకోవడం లేదు. నన్ను బతకనివ్వండి అంటూ తనూజ పుట్టస్వామి ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా తనూజ అభిమానులు, నెటిజన్లు ఆమెకు మద్ధతుగా పోస్టులు పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











