Bigg Boss Telugu 9: బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా పవన్ కళ్యాణ్.. ఓటమిపై తనూజ ఫస్ట్ పోస్ట్
దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన బిగ్‌బాస్ తెలుగు 9 మెగా రియాలిటీ షోకు డిసెంబర్ 21తో ఎండ్ కార్డ్ పడిన సంగతి తెలిసిందే. ఆదివారం హోరాహోరీగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో పడాల పవన్ కళ్యాణ్ విజేతగా నిలిచాడు. తద్వారా బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన మరో సామాన్యుడిగా చరిత్ర సృష్టించాడు. సామాన్యుడు తలచుకుంటే ఏమైనా సాధించగలడని నిరూపించాడు కళ్యాణ్. అయితే అతనికి అదే స్థాయిలో టఫ్ ఫైట్ ఇచ్చింది కన్నడ నటి తనూజ పుట్టస్వామి. చివరి నిమిషంలో టైటిల్ కళ్యాణ్‌ను వరించడంతో తనూజ బాగా ఎమోషనల్ అయ్యింది. అయితే బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన ఫస్ట్ పోస్ట్ పెట్టింది. ఈ వివరాల్లోకి వెళితే..
వెండితెర నుంచి బుల్లితెరకు
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన తనూజ ... బెంగళూరు యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ చేసి నటన వైపు ఆసక్తితో సినిమాలు, సీరియల్స్ వైపు అడుగులు వేసింది. కన్నడంలో పలు సినిమాలు చేసిన అనంతరం తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. తొలుత అందాల రాక్షసిలో నటించిన తనూజకు ముద్ద మందారం సీరియల్ బ్రేక్ ఇచ్చింది. తెలుగుతో పాటు తమిళంలోనూ కొన్ని సీరియల్స్, షోలలో నటించింది. ఈ క్రమంలోనే తెలుగు బిగ్‌బాస్ 9లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కించుకుంది.

ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్
బిగ్‌బాస్ తెలుగు 9లో తొలివారంలోనే నామినేషన్స్‌లో ఈ ముద్దుగుమ్మ.. అనూహ్యంగా ఓటింగ్‌లో టాప్‌లో నిలవడంతో విశ్లేషకులు ఆశ్చర్యపోయారు. గేమ్స్, టాస్క్‌లు, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ తన సత్తా చాటింది. అందంతో పాటు తెలివైన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకున్న తనూజ... ఎవరి ట్రాప్‌లోనూ చిక్కకుండా, ఎవరితోనూ బాండింగ్ లేకుండా తనదైన ఆట ఆడి గెలిచింది. తెలుగు ప్రేక్షకుల వల్లే తను ఇక్కడ ఉన్నానంటూ కన్నడ అమ్మాయిని అనే ఫీలింగ్ రాకుండా జాగ్రత్త తీసుకుని ఓట్లు కొట్టేసింది. ఈ తరం అమ్మాయిల్లా మోడ్రన్ డ్రెస్‌లో కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చేలా సాంప్రదాయ బద్ధమైన దుస్తుల్లో, అశ్లీలతకు దూరంగా నిలిచింది. ఇది ఆమెకు కుటుంబ ప్రేక్షకులు ముఖ్యంగా ఆడవాళ్ల మద్ధతు దొరికేలా చేసింది.
షోను భుజాలపై నడిపిన తనూజ
బిగ్‌బాస్ షో డల్ అవుతుంది అన్నప్పుడల్లా తన స్ట్రాటజీతో షో మొత్తాన్ని తనవైపుకు తిప్పుకుని.. ఈ సీజన్ విజయవంతం కావడంతో ప్రధాన భూమిక పోషించింది. ఆమె దూకుడుతో ఖచ్చితంగా తనూజనే బిగ్‌బాస్ తెలుగు 9 విజేత అని ఫిక్స్ అయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా దూసుకురావడంతో టఫ్ ఫైట్ ఎదురైంది. ఫినాలే ఓటింగ్‌లోనూ వీరిద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. చివరికి నాగార్జున బ్రీఫ్ కేస్‌తో వచ్చి 20 లక్షల రూపాయలు ఆఫర్ చేసినా నో చెప్పి.. తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిన ప్రేక్షకుల నమ్మకాన్ని వొమ్ము చేయలేనని చెప్పి మంచి మార్కులు వేయించుకుంది. అయితే అనూహ్య పరిణామాల మధ్య బిగ్‌బాస్ షో తెలుగు 9 విజేతగా కళ్యాణ్ నిలిచినప్పటికీ తన్నుకొస్తున్న ఎమోషన్, ఒత్తిడిని అధిగమించి సంయమనంతో వ్యవహరించింది. అయితే బిగ్‌బాస్ తెలుగు 9 చరిత్రలో టైటిల్ విన్నర్‌గా నిలిచిన ఘనత తనూజ సొంతం చేసుకుంటుందని అనుకున్న లక్షలాది ప్రేక్షకులు మాత్రం నిరాశపడ్డారు.
మీ ప్రేమకు ధన్యవాదాలు
తాజాగా బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనూజ సోషల్ మీడియాలో ఫస్ట్ పోస్ట్ పెట్టారు. బిగ్‌బాస్‌కు థ్యాంక్స్.. ఇక్కడ ప్రయాణం అంత సులభం కాదు. కానీ హౌస్‌లో నేను ఎన్నోసార్లు నవ్వాను, ఏడ్చాను.. కింద పడిపోయాను.. అయినప్పటికీ ధైర్యంగా లేచి నిలబడ్డాను. ప్రతి టాస్క్‌ను నిజాయితీతో ఆడాను.. ప్రతి ఛాలెంజ్‌ను ఎదుర్కొన్నా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాలాగే ఉన్నాను.. మీ ఓట్లే నా వాయిస్‌గా మారాయి. బిగ్‌బాస్‌ను వీడినా మీతో ఏర్పడిన బంధాన్ని జీవితాంతం ఇలాగే కొనసాగిస్తాను. ఇదే నా ముగింపు కాదు.. కొత్త ఛాప్టర్‌కి ప్రారంభం. ఈ జర్నీలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాను.. ఎన్నో జ్ఞాపకాలు దాచుకున్నాను. మీ ప్రేమ, ఓటు, అభిమానం, నా గెలుపు కోసం చేసిన ప్రార్థనలకు విలువ కట్టలేను. మీ అందరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటానని తనూజ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమె అభిమానులు నువ్వు ఫైటర్ అంటూ తనూజపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











