కొత్త అవతారంలో బిగ్‌బాస్ 9 విన్నర్.. ఆ దిశగా కళ్యాణ్ పడాల తొలి అడుగు..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల (Kalyan Padala)గురించి పరిచయం అవసరం లేదు. ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆయన.. జీవితంలో ఎదగాలనే సంకల్పంతో ముందుకు సాగి దేశ సేవ కోసం ఇండియన్ ఆర్మీలో చేరారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, పట్టుదలతో సైన్యంలో సేవలందించిన కళ్యాణ్.. మరోవైపు చిన్ననాటి నుంచే సినిమాలపై ప్రత్యేక ఆసక్తి పెంచుకున్నారు. ఎప్పటికైనా తెరపై కనిపించాలనే కోరికతో బిగ్ బాస్ లో అడుగుపెట్టి విజేతగా నిలిచాడు. కళ్యాణ్ తన కలను నిజం చేసుకునే దిశగా తొలి అడుగులు వేశారు. తాజాగా ఓ కొత్త అవతారంలో బిగ్ బాస్ విన్నర్ కనిపించారు.
బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొన్న కళ్యాణ్ పడాల.. తన వ్యక్తిత్వంతో జడ్జిలను ఆకట్టుకుని కామనర్ కేటగిరీలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రారంభంలో కెమెరాల ముందు, సెలబ్రిటీల మధ్య కొంత తడబడ్డప్పటికీ.. చాలా త్వరగా పరిస్థితులకు అలవాటు పడ్డారు. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ఉప్పెనలా ఎగసిపడ్డారు. వారం వారంగా తన గ్రాఫ్ పెంచుకున్న కళ్యాణ్.. బీబీ ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. ఓటింగ్‌లో వరుసగా టాప్‌లో నిలుస్తూ తనకంటూ భారీ ఫ్యాన్‌బేస్ ఏర్పరుచుకున్నారు. చివరి వరకూ కొనసాగి బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

బిగ్ బాస్ తర్వాత కళ్యాణ్ పడాలకు మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడంతో పాటు.. పలు ఈవెంట్స్, షోలు, ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అందాయి. అయితే కేవలం రియాలిటీ షో స్టార్‌గా కాకుండా నటుడిగా నిలవాలని భావించిన కళ్యాణ్.. ఇప్పుడు తన కెరీర్‌లో తొలి అడుగు వేశారు. తాజాగా ఆయన హీరోగా నటించిన ఓ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. ఈ వీడియోతో ఆయన నటుడిగా ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం.
ఈ ప్రాజెక్ట్ గురించి మేకర్స్ సోషల్ మీడియాలో అధికారిక ప్రకటన చేస్తూ.. "ఇది మా మొదటి అనౌన్స్‌మెంట్. ఒక అందమైన ఇండిపెండెంట్ సాంగ్‌ను మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా నిజాయితీ ప్రయత్నాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ కేవలం మొదటి అడుగు మాత్రమే. పూర్తి పాట త్వరలో విడుదల కానుంది. ఈ ప్రాజెక్ట్ కోసం మా టీమ్ హృదయపూర్వకంగా పనిచేసింది" అని తెలిపారు.
ఈ మ్యూజిక్ వీడియోలో కళ్యాణ్ పడాలతో పాటు బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9లో గుర్తింపు తెచ్చుకున్న మోడల్ వియానా ఆర్ ఆర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరిద్దరి జోడీ తెరపై ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. కళ్యాణ్ కొత్త లుక్, స్క్రీన్ ప్రెజెన్స్, రొమాంటిక్ షేడ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఈ ప్రాజెక్ట్‌కు కథ, దర్శకత్వం, సినిమాటోగ్రఫీ బాధ్యతలను కె. ప్రకాష్ రెడ్డి నిర్వహించారు. నిర్మాతగా జయమ్మ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మంచి విజువల్స్, భావోద్వేగాలు, సంగీతం కలయికగా ఈ సాంగ్ రూపొందినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ద్వారా స్టార్‌డమ్ సంపాదించిన కళ్యాణ్ పడాల.. ఈ మ్యూజిక్ వీడియోతో నటుడిగా కూడా విజయాన్ని అందుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పూర్తి పాట విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications