త్వరలో పెళ్లిపీటలెక్కనున్న బిగ్‌బాస్ కళ్యాణ్ పడాల.. కాబోయే భార్యపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఈ యువకుడు తన కష్టంతో, పట్టుదలతో జీవితంలో ఎదగాలని నిశ్చయించుకుని ముందుకు సాగాడు. దేశ సేవే తన లక్ష్యంగా భావించి ఇండియన్ ఆర్మీలో చేరి క్రమశిక్షణతో సేవలు అందించిన కళ్యాణ్, చిన్ననాటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకుని ఒకరోజు తెరపై కనిపించాలనే కలను గుండెల్లో పెట్టుకున్నాడు. ఆ కలనే నిజం చేసుకోవడానికి బిగ్ బాస్ వేదికను ఎంచుకుని, అక్కడ తన వ్యక్తిత్వం, నిజాయితీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుని విజేతగా నిలిచాడు. ఈ విజయంతో అతనికి అపారమైన ఫాలోయింగ్ వచ్చింది.
బిగ్ బాస్ హౌస్‌లో కామనర్ కేటగిరీలో అడుగుపెట్టిన కళ్యాణ్, తన స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, డిసిప్లిన్‌తో జడ్జిలను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విజేతగా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించి, అనేక ఈవెంట్స్, ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ బిజీగా మారాడు. కేవలం రియాలిటీ షో స్టార్‌గా కాకుండా నటుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని భావించిన కళ్యాణ్, ఇటీవల ఓ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోలో నటించి తన టాలెంట్‌ను మరోసారి నిరూపించాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కళ్యాణ్ పడాల తన వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా తనకు కాబోయే భార్య గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఎంతో కూల్‌గా, కానీ ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చాడు. "ఒక రోజు ఈ ప్రపంచం నుంచి దూరంగా ఉండాల్సి వస్తే ఎవరితో గడపాలని అనుకుంటారు?" అని అడిగితే, "నా క్లోజెస్ట్ పర్సన్‌తో... అది కూడా ఫోన్ లేకుండా గడపాలని అనుకుంటా" అని చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరో చెప్పమంటే, "ఇప్పుడు చెప్పలేను... ఫ్యూచర్‌లో చెప్తా" అని సస్పెన్స్ క్రియేట్ చేశాడు.
ఇంకా కాబోయే భార్య గురించి అడిగినప్పుడు కళ్యాణ్ ఇచ్చిన సమాధానం మరింత ఆసక్తికరంగా మారింది. "ఎవరికి కళ్యాణ్ పడాల లొంగుతాడో, ఎవరి మాట వింటాడో, ఎవరి ముందు కంగారు పడతాడో అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటా" అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాదు, "అమ్మాయికి నేను భయపడాలి... చెక్కేస్తుంది భయ్యా అనేటట్లు ఉండాలి" అంటూ ఫన్నీగా చెప్పడం హైలైట్ అయింది. మరో ప్రశ్నలో "మిడ్‌నైట్‌లో మీకు కాల్ చేసే వ్యక్తి ఎవరు?" అని అడిగితే, కళ్యాణ్ తన సింపుల్ లైఫ్‌స్టైల్‌ను బయటపెట్టాడు. "నేను రాత్రి తొమ్మిది గంటలకు పడుకుంటా... కాబట్టి ఎవరికీ ఆ అవకాశం ఇవ్వలేదు" అని చెప్పేశాడు.
మనీ, ఫేమ్ గురించి అడిగినప్పుడు కూడా కళ్యాణ్ తన విలువలను స్పష్టంగా వెల్లడించాడు. "మనీ, ఫేమ్ అన్నీ టెంపరరీ... అవి ఎక్కువ కాలం ఉండవు. టాలెంట్ మాత్రమే శాశ్వతం" అని చెప్పి తన మేచ్యూరిటీని చూపించాడు. ఇప్పటికే ఒకసారి తనను తాను నిరూపించుకున్నానని, ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నానని తెలిపాడు. సెలబ్రిటీగా మారకపోతే ఏమి చేసేవాడివి అనే ప్రశ్నకు, "కచ్చితంగా ఆర్మీ సర్వీస్‌లోనే కొనసాగేవాడిని" అని చెప్పడం ద్వారా తన దేశభక్తిని మరోసారి చాటుకున్నాడు.
ప్రస్తుతం ఆర్మీ నుంచి బయటకు వచ్చి పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేస్తున్నానని, మంచి నటుడిగా గుర్తింపు పొందడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. ఇలా కళ్యాణ్ పడాల తన పెళ్లి గురించి చెబుతుంటే.. భవిష్యత్తులో ఆయన లవ్ స్టోరీ కూడా ఆసక్తికరంగానే ఉండబోతుందని అనిపిస్తోంది. ఇప్పుడు అభిమానులు ఒక్కటే ఎదురు చూస్తున్నారు ఆ "సీక్రెట్ పర్సన్" ఎవరు? అని.


Click it and Unblock the Notifications




