బిగ్‌బాస్ 9 విజేత పవన్ కళ్యాణ్ నెక్ట్స్ ప్లాన్ ఏంటీ... సినిమాల్లోకా? ఆర్మీలోకా?
దాదాపు 105 రోజుల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచిన బిగ్‌బాస్ తెలుగు 9 గత ఆదివారంతో ముగిసిన సంగతి తెలిసిందే. ఆదివారం చివరి వరకు ఉత్కంఠగా సాగిన బిగ్‌బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో పడాల పవన్ కళ్యాణ్ అలియాస్ సోల్జర్ కళ్యాణ్ విజేతగా నిలిచాడు. అతనికి టఫ్ ఫైట్ ఇచ్చిన కన్నడ నటి తనూజ పుట్టస్వామి రన్నరప్‌గా నిలిచారు. సామాన్యుడిగా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్.. సెలబ్రిటీలను దాటుకుని విజేతగా నిలిచాడు. సీఆర్‌పీఎఫ్‌లో విధులు నిర్వర్తిస్తూ.. ఉద్యోగానికి సెలవు పెట్టి బిగ్‌బాస్‌లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సెలబ్రిటీగా మారిపోయాడు. మరి అతను సినిమాలలో నటిస్తాడా? లేక తిరిగి దేశసేవలో నిమగ్నమవుతాడా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివాదానికి కళ్యాణ్ తెరదించే ప్రయత్నం చేశాడు. ఈ వివరాల్లోకి వెళితే..
తనూజ నుంచి గట్టి పోటీ
బిగ్‌బాస్ తెలుగు 9లో సామాన్యుడి కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ తొలుత కొన్ని తప్పులు చేసినా తర్వాత తన పొరపాట్లు గ్రహించి ఫాంలోకి వచ్చాడు. టాస్క్‌లు, గేమ్స్, డిస్కషన్స్ ఇలా అన్నింటిలోనూ దూకుడైన ఆటతో చెమటలు పట్టించడంతో పాటు లెక్కలన్నీ మార్చేశాడు. అప్పటి వరకు తనూజ వన్‌మెన్ షోతో బిగ్‌బాస్ తెలుగు 9ని ఏలుతుండగా.. కళ్యాణ్ ఎంట్రీతో ఆమెకు గట్టి పోటీ ఎదురై.. కళ్యాణ్ vs తనూజగా పరిస్థితి మారింది. ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చిన వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగేది.

కళ్యాణ్‌కు అండగా నిలిచిన ప్రజలు
ఇదే సమయంలో కళ్యాణ్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. కళ్యాణ్ అసలు సైన్యంలో లేడంటూ ఆరోపణలు వచ్చాయి. దాంతో అతని సహోద్యుగులు, మిత్రులు అండగా నిలిచిచారు. కలుపుగోలుతనం, ఇంట్లో కుర్రాడిలా కనిపించడంతో పవన్ కళ్యాణ్‌కు కుటుంబ ప్రేక్షకుల మద్ధతు కూడా గట్టిగానే లభించింది. సోషల్ మీడియాలోనూ అతనికి ఓట్లు వేయాలని పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిచింది. టికెట్ టూ ఫినాలే టాస్క్‌లో గెలిచి బిగ్‌బాస్ తెలుగు 9 ఫైనల్‌లో అడుగుపెట్టిన తొలి కంటెస్టెంట్‌గా నిలిచాడు. టాప్ 5లో తనూజ నుంచి గట్టి పోటీ ఎదురవ్వగా.. బలమైన ఓటింగ్‌తో చివరికి విజయం కళ్యాణ్‌నే వరించింది.
స్వగ్రామంలో కళ్యాణ్‌కి ఘన స్వాగతం
మరోవైపు.. బిగ్‌బాస్ తెలుగు 9 విజేతగా గెలిచి విజయనగరం జిల్లాలోని తన స్వగ్రామం సుందరపేటకు చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు గ్రామస్తులు, బంధుమిత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులంతా అతనిని సన్మానించారు. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ.. అగ్నిపరీక్ష షో నుంచే నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం మీరే.. మీరు లేకపోతే కళ్యాణ్ లేడు. మీరు ఓటు వేయకపోతే కళ్యాణ్ లేడు.. మీరు మిస్డ్ కాల్ ఇవ్వకపోతే కళ్యాణ్ లేడు. మీరు నన్ను కోరుకోకపోతే కళ్యాణ్ లేడు... కళ్యాణ్‌తో పాటు ఈ కప్ కూడా లేదు అని కళ్యాణ్ అన్నాడు.
ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి
అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క ఆడియన్‌కి హృదయ పూర్వక ధన్యవాదాలు.. నన్ను మెచ్చి ఇంత చేస్తారని అస్సలు ఊహించలేదు. మీ అందరి సపోర్ట్ లేకుండా బయటకు ఖచ్చితంగా రాలేను అని కళ్యాణ్ తెలిపాడు. నెక్ట్స్ మీరు సినీ రంగం వైపు వెళ్తారా? లేక ఆర్మీ వైపు వెళ్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. కొన్ని ఫార్మాలిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. వాటిని ఫినిష్ చేసుకుని ఐ విల్ బ్యాక్ అంటూ ఒక్కమాటలో తన ప్రయాణం సినీరంగం వైపేనని ఒక్కమాటలో తేల్చేశాడు. అయితే తాను ఎప్పుడు వస్తానని మాత్రం ఆయన చెప్పలేదు.
నా లక్ష్యం అదే
అంతకుముందు హీరో శివాజీకి ఇచ్చిన బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూలోనూ తన తర్వాత ప్రయాణం సినీరంగం వైపేనని పడాల పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నానని.. అయితే స్టార్, హీరో వంటిది కాకుండా గొప్ప యాక్టర్ కావాలని, మంచి పేరు తెచ్చుకోవాలనేది తన లక్ష్యమని కళ్యాణ్ వెల్లడించాడు. మొత్తానికి సినిమాలపై తన ఇష్టాన్ని బయటపెట్టిన కళ్యాణ్.. ఈ రంగంలో ఎలా అవకాశాలు దక్కించుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











