బిగ్ బాస్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం: ఫస్ట్ సీజన్ కంటే తక్కువే ప్లాన్ చేశారుగా.!
ఉత్తరాది నుంచి వచ్చి దక్షిణాదిలోనూ సూపర్ సక్సెస్ అయిన వాటిలో బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి. ఎన్నో అనుమానాలు.. మరెన్నో వివాదాల నడుమ తెలుగులో ప్రసారం అయిన ఈ షోకు మొదటి సీజన్ నుంచే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అదే సమయంలో దీనిపై ఎన్నో విమర్శలు చెలరేగాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. నాలుగో దానికి సిద్ధం అవుతోంది. ఇలాంటి తరుణంలో సీజన్ -4పై స్టార్ మా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం.!

వివాదాలతో సతమతం.. నిషేదించాలని డిమాండ్
దాదాపు భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో బిగ్ బాస్ ప్రసారం అవుతోంది. హిందీలోనైతే చాలా ఏళ్లుగా ఇది వస్తోంది. దీంతో ఈ షో పట్ల చాలా మందిలో వ్యతిరేకత ఏర్పడింది. హౌస్‌లో కంటెస్టెంట్లు ప్రవర్తించే తీరు.. దాని చుట్టూ అల్లుకునే వివాదాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది. తెలుగులో కాస్టింగ్ కౌచ్ కూడా వెలుగు చూసింది. దీంతో బిగ్ బాస్‌ను నిషేదించాలని డిమాండ్లు వినిపించాయి.

ఇప్పటికి మూడు సీజన్లు.. ముగ్గురు విజేతలు వీళ్లే
మిగిలిన భాషల్లో మాదిరిగానే తెలుగులోనూ బిగ్ బాస్ సూపర్ హిట్ అయింది. అందుకే షో నిర్వహకులు ప్రతి ఏడాది దీన్ని ప్రసారం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షోలో ఇప్పటి వరకు జరిగిన మూడు సీజన్లలో.. మొదటి దానిని శివ బాలాజీ, రెండో దాన్ని కౌశల్ మందా, మూడోది రాహుల్ సిప్లీగంజ్ గెలుచుకున్నారు.

తెలుగులో బిగ్ బాస్ విజయం వెనుక వాళ్ల పాత్ర
తెలుగులో బిగ్ బాస్ షోకు ఇంత పాపులారిటీ రావడానికి వివాదాలు, గొడవలు మాత్రమే కారణం కాదు. దీనికి హోస్టులగా పని చేసిన ముగ్గురు హీరోలూ విశేషమైన కృషి చేశారు. మొదటి సీజన్‌ను హోస్ట్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ బిగ్ బాస్‌ను ప్రేక్షకుల్లోకి వెళ్లేలా చేశాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని, అక్కినేని నాగార్జున దాన్ని కంటిన్యూ చేసి సూపర్ సక్సెస్ చేశారు.

నాలుగోది కూడా వస్తుంది... ప్రేక్షకుల్లో అంచనాలు
ఇప్పటికే మూడు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. నాలుగో దానిని కూడా ప్రారంభించబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షో నిర్వహకులు కంటెస్టెట్లను ఎంపిక చేసే ప్రక్రియను కూడా ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు నుంచి ఈ సీజన్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. దీంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ - 4 హోస్ట్... వాళ్లిద్దరిలో ఒకరు
కొద్ది రోజుల్లో నాలుగో సీజన్ ప్రారంభం కాబోతుందన్న ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలోనే... దానిని ఎవరు హోస్ట్ చేస్తారన్న దానిపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై కొందరు జూనియర్ ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తుండగా... మరికొందరు మాత్రం నాగార్జననే కంటిన్యూ చేస్తారని అంటున్నారు. మొత్తానికి వీళ్లిద్దరిలో ఒకరు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్.

కంటెస్టెంట్ల పేర్లు వచ్చాయి.. ఫైనల్ అవుతారా.?
ఈ సీజన్‌కు సంబంధించిన ప్రకటన కూడా వెలువడక ముందే.. ఇందులో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో హీరో అల్లరి నరేష్, సింగర్ హేమచంద్ర, కమెడియన్ తాగుబోతు రమేష్, యాంకర్ వర్షిణి, సింగర్ మంగ్లీ, యాంకర్ ఝాన్సీ, హీరో నందు సహా ఎంతో మంది పేర్లు వినిపిస్తున్నాయి. మరి వీళ్లే ఫైనల్ అవుతారా అన్నది తెలియాలి.

బిగ్ బాస్ 4పై స్టార్ మా సంచలన నిర్ణయం
అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సీజన్ 4 గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సీజన్‌ను కేవలం 50 రోజులకే పరిమితం చేశారట. కరోనా ప్రభావం కారణంగానే తక్కువ మంది కంటెస్టెంట్లతో ఇలా కానిచ్చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఫస్ట్ సీజన్ 70, రెండు, మూడు సీజన్లు 100 రోజులు ప్రసారం అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











