Brahmamudi April 12th Episode : రాజ్ దగ్గర కావ్య మౌనం .. స్వరాజ్ ఆఫీస్‌కి యామిని, కావ్యకి షాకిచ్చిన క్లయింట్స్
ఉదయాన్నే కళ్యాణ్ - అప్పూలు కిందకి వచ్చి బయటికి వెళ్తున్నామని ఇందిరకి చెప్పి వెళ్తారు. మిమ్మల్ని చూస్తుంటే నాకు అసూయగా ఉందని, నా మొగుడికి తినడం, పడుకోవడం తప్ప ఏం చేతకాదని అంటుంది స్వప్న. ఇంతలో కావ్య కూడా వచ్చి ఆఫీసుకి వెళ్తున్నానని , తాతయ్యకి వేయాల్సిన టాబ్లెట్స్‌ను ఇస్తుంది. కావాలంటే నన్ను ఫాలో అయి, వీడియో కూడా తీసుకోవచ్చని రుద్రాణికి చెబుతుంది కావ్య. టిఫిన్ చేసేందుకు వెయిట్ చేస్తున్న యామినితో నేను బయటికి వెళ్తున్నానని చెప్పి బయల్దేరతాడు.
అల్లుడుగారిని అలా వదిలేశావ్ ఏంటని యామినిని తల్లిదండ్రులు ప్రశ్నించగా.. కారులో జీపీఎస్ పెట్టానని రామ్ ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసుకుంటానని చెబుతుంది యామిని. రాజ్ కారు స్వరాజ్ గ్రూప్ కంపెనీ దగ్గరి లోకేషన్ చూపించడంతో యామిని షాక్ అవుతుంది. రాజ్ నేరుగా లోపలికి వెళ్లిపోతుండగా కావ్య సీసీ కెమెరాలో భర్తని చూసి పరుగు పరుగున కిందకి తీసుకెళ్తుంది. ఇదంత గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 12వ తేదీ ఎపిసోడ్ 694లో ఏం జరిగిందంటే?

బోకే ఇవ్వడం కోసం ఆఫీస్ వరకు వచ్చారా అని కావ్య ప్రశ్నించడంతో మీతో మాట్లాడటానికే వచ్చానని చెబుతాడు రాజ్. మిమ్మల్ని రోడ్ మీద చూసినప్పుడు మీరు బాగా తెలిసినవాళ్లలా అనిపించారని, చాలా కావాల్సిన వాళ్లలా అనిపించారని చెబుతాడు రాజ్. మీ కళ్లలోకి చూస్తే మన మధ్య ఏదో పరిచయం ఉందని నా మనసు చాలా స్ట్రాంగ్‌గా నమ్ముతోందని అంటాడు. నేనంటే గతం మరిచిపోయానని, మీకన్నీ గుర్తుండే ఉంటాయి కదా అని చెబుతాడు రాజ్. ఇంతకు ముందు మనం ఎక్కడైనా కలిశామా? అని ప్రశ్నిస్తాడు రాజ్. ఈ విషయం తేలకపోతే మిమ్మల్ని కదలనివ్వనని అంటాడు.
మీరు నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారని అనిపిస్తోందని కావ్యతో అంటాడు రాజ్. మనిద్దరికీ పరిచయం ఉన్న మాట నిజమే కదా? మనం ఇంతకుముందు కలిశాం కదా? అని ప్రశ్నిస్తాడు. ఇంతలో కావ్యకి ఫోన్ రావడంతో నేను ఆఫీసులో చెప్పకుండా వచ్చేశానని.. లేదంటే నన్ను జాబ్‌లో నుంచి తీసేస్తారని చెబుతుంది కావ్య. ఆ మాటలతో కావ్యను వెళ్లమని అంటాడు రాజ్. బోకే మరిచిపోయారని చెప్పి ఆమెకు ఇస్తాడు.
స్వరాజ్ గ్రూప్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన యామిని.. రామ్ ఖచ్చితంగా లోపలికి వెళ్లి ఉంటాడని, ఈపాటికి అందరూ గుర్తుపట్టేసి ఉంటారని భయపడుతుంది. ఏదో ఒకటి చేసి రామ్‌ను బయటికి తీసుకొచ్చేయాలని అనుకుంటుంది. యామిని లోపలికి వెళ్లబోతుండగా శృతి ఆపి ఎవరు కావాలి? ఎందుకొచ్చారని అడుగుతుంది. రామ్ కోసం వచ్చానని చెప్పడంతో ఆ పేరుతో ఈ ఆఫీసులో ఎవ్వరూ లేరని అంటుంది. రామ్ అంటే రాజ్ అని చెబుతుంది యామిని. దీంతో మీరు రాజ్ సార్ ఫ్రెండా? కావ్య మేడంని ఓదార్చడానికి వచ్చారా? అని అడుగుతుంది శృతి.
ఇంతలో కారు దగ్గరికి వచ్చిన రాజ్.. తన కారు వెనుక యామిని కారు ఉండటంతో షాక్ అవుతాడు. నా కోసం వచ్చిందా? నేను ఇక్కడ ఉన్నట్లు తనకు ఎలా తెలిసిందని అనుకుని వెంటనే ఆమెకు ఫోన్ చేయడంతో యామిని కిందకి వస్తుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్.. నాకు తెలియకుండా నన్ను ఫాలో అవుతున్నావా? అని నిలదీస్తాడు. నేను నా ఫ్రెండ్‌ని కలవడానికి వెళ్తుంటే దారిలో నీ కారు కనిపించిందని, నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని అనుకుని వెతికానని చెబుతుంది యామిని.
అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతుంది యామిని. తెలిసిన ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడదామని పక్కనే ఉన్న కేఫేకి వచ్చానని చెబుతాడు రాజ్. అయితే రామ్ తన ఆఫీస్‌కి వెళ్లలేదని అనుకుని ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పుడు ఏదో ఒకటి మేనేజ్ చేసి వెళ్లిపోవాలని , లేదంటే రామ్‌కి అనుమానం వస్తుందని అనుకుంటుంది. నా కోసం వచ్చిన దానికి నాకు ఫోన్ చేయకుండా ఎక్కడికి వెళ్లావని అడుగుతాడు రాజ్ . నీకు ఫోన్ చేద్దామని అనుకునేలోపు నా ఫ్రెండ్ ఫోన్ చేసిందని చెబుతుంది యామిని. నీ పని అయిపోయింది కదా? నాతో కలిసి నా ఫ్రెండ్ ఇంటికి వస్తావా అని అడుగుతుంది యామిని. నేను ఇంటికెళ్లి రెస్ట్ తీసుకుంటానని చెప్పి వెళ్లిపోతాడు రాజ్.
మరోవైపు రాజ్ ఇచ్చిన బోకే చూసుకుంటూ మురిసిపోతుంది కావ్య. మీరు గుర్తుపట్టకపోయినా మీ మనసు నన్ను గుర్తు పట్టిందని అనుకుంటుంది. అసలు ఎవరు కళావతి నువ్వు? మన మధ్య ఉన్న ఈ పరిచయం ఎప్పటిదని అనుకుంటాడు రాజ్. నిజంగా మన మధ్య పరిచయం లేదా? లేకపోతే లేనట్లు దాచడానికి ప్రయత్నిస్తున్నావా? అని మనసులో అనుకుంటాడు. మీతో చెప్పాలని ఉందని, ఆ రోజు కోసమే నేను ఎదురుచూస్తున్నానని అనుకుంటుంది. కానీ అది నేను చెప్పలేనని మీరే తెలుసుకోవాలని అనుకుంటుంది. మనం దూరమైనా తిరిగి ఇలా ప్రేమించుకోవడం నాకు బాగా నచ్చిందని మురిసిపోతుంది కావ్య.
దుగ్గిరాల కుటుంబమంతా సమావేశమవుతుంది. రేపు వదిన పుట్టినరోజు కదా? దాని గురించి ఏం ఆలోచించావని అడుగుతాడు ప్రకాశం. ఆ విషయం అందరికీ గుర్తుందని, నువ్వు ప్రత్యేకంగా గుర్తుచేయాల్సిన అవసరం లేదని అంటుంది రుద్రాణి. రాజ్ దూరమైన బాధలో ఎవరూ దాని గురించి ఆలోచించలేదని చెబుతుంది. రాజ్ బతికున్నప్పుడు గుడిలో ప్రతి సంవత్సరం అన్నదానం చేయించేవాడని, అందరికీ పట్టుబట్టలు పెట్టేవాడని అంటుంది. ఇప్పుడు వదినకు వాడితో పాటు ఆ ఆనందం కూడా దూరమైపోయిందని చెబుతుంది రుద్రాణి.
రుద్రాణి నిజమే చెప్పిందని, వాడే లేనప్పుడు నాకీ పుట్టినరోజులు ఎందుకు? ఈ అన్నదానాలు ఎందుకు? ఇక నుంచి అలాంటివి జరిపించొద్దని అంటుంది అపర్ణ. రాజ్‌కు నీ పేరు మీద అన్నదానం చేయించడం ఇష్టం కదా? కనీసం వాడి కోసమైనా ఒప్పుకోమని చెబుతాడు ప్రకాశం. జరిగినది తలచుకుంటూ ఇంట్లో అంతా ఎన్నాళ్లు ఉంటామని ఇందిర కూడా అంటుంది. వదినకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదని పదే పదే అడిగి ఆమెను బాధపెట్టొద్దని చెబుతుంది రుద్రాణి. భోజనం చేద్దామని పిలవగా అపర్ణ వెళ్లిపోతుంది.
నీలో కొంచెం కూడా మానవత్వం లేదా? అని మండిపడుతుంది ధాన్యలక్ష్మీ. నువ్వేంటీ ఉత్తమురాలిలా మాట్లాడుతున్నావ్? ఇన్ని రోజులు ఆస్తుల కోసం గొడవ పడినప్పుడు ఈ ప్రేమ ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కొడుకు కోసం ఆస్తులు కావాలని అనుకున్నాను కానీ, దాని కోసం మనుషుల్ని దూరం చేసుకోవాలని అనుకోలేదని చెబుతుంది ధాన్యలక్ష్మీ. నా కొడుకు కోసం నాలుగు మాటలు కలిసి మాట్లాడితే నువ్వే, నేను ఒకటేనా అని ప్రశ్నిస్తుంది. సాటి మనిషికి కష్టం వస్తే అస్సలు చూస్తూ ఉండలేనని.. నువ్వు రుద్రాణిలా మారిపోయావని బాధపడ్డానని, ఇంకా నువ్వు నా భార్యవేనని ప్రూవ్ చేసుకున్నావని అంటాడు ప్రకాశం.
వారి మాటలు విన్న అప్పూ బాధపడుతుంది. బావ ఆ యామిని ఇంట్లో ఉన్నాడు.. ఇక్కడ అపర్ణ ఆంటీ తను లేడు అనుకుని బాధపడుతోందని అనుకుంటుంది. అక్కకి ఈ విషయం చెప్పి వెంటనే నిజం బయటపెట్టాలని అనుకుంటుంది. కావ్య ఆఫీసు నుంచి ఇంటికి బయల్దేరబోతుండగా కొంతమంది క్లయింట్స్ ఆమెకు ఎదురుపడతారు. ఎప్పుడూ ఫోన్‌లో మాట్లాడతారు? ఈసారి డైరెక్ట్‌గా వచ్చారేంటీ? అని ప్రశ్నిస్తుంది కావ్య. రాజ్ సార్‌కి అలా జరిగేసరికి ఫోన్ మాట్లాడలేక నేరుగా వచ్చి కలుస్తున్నామని చెబుతారు క్లయింట్స్.
కంపెనీ మీద ఆధారపడి చాలా మంది ఉన్నారని.. వాళ్ల కోసం వెంటనే ఛార్జ్ తీసుకున్నానని అంటుంది కావ్య. రాజ్ సార్ లేకపోవడం వల్ల మాకు 2 కోట్లు బిల్స్ పెండింగ్‌లో పడ్డాయని క్లయింట్స్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. మనకి రావాల్సిన పేమెంట్స్ ఆగిపోవడం వల్ల బిల్స్ క్లియర్ చేయలేదని మేనేజర్ చెప్పడంతో కావ్య మండిపడుతుంది. 24 గంటల్లో బిల్స్ క్లియర్ చేయిస్తానని క్లయింట్స్‌కి మాట ఇస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











