Brahmamudi April 1st Episode: ఇందూ ఆస్తిని కొట్టేసేలా రేఖ ప్లాన్.. డ్రగ్స్ మాఫియా పగ, స్వరాజ్ మెడపై కత్తి
Photo Courtesy: JioHotstar
రోజాని, వెంకీని కలపడానికి నందూ సాయం చేస్తుంది. చెవిలో బ్లూటూత్ పెట్టుకుని ఆమె చెబుతున్న మాటలను రోజా చెబుతాడు వెంకీ. ఇంతలో ఓ డ్రగ్స్ స్మగ్లర్ కనిపించడంతో అతనిని నందూ వెంటాడుతుంది. నందూ లేకపోవడంతో ఏదేదో మాట్లాడటంతో వెంకీకి ఛీ కొట్టి వెళ్లిపోతుంది రోజా. మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కుని తిరిగి వస్తుండగా ఇందూని స్వరాజ్ బైక్‌తో ఢీకొట్టడంతో ఇందూ- స్వరాజ్‌కు పెద్ద గొడవ జరుగుతుంది. లక్కీ జోక్యం చేసుకుని కూరగాయలు కొనిపెట్టి ఇందూని పంపించేస్తాడు.
నందూ బారి నుంచి తప్పించుకునే క్రమంలో హార్ట్ పేషెంట్‌లా నాటకమాడతాడు స్మగ్లర్. అతని పరిస్ధితి చూసి రాజ్- లక్కీలు బైక్ ఆపి ఆసుపత్రికి తీసుకెళ్తామని చెబుతారు. ఆసుపత్రి పక్కనే ఉంది, నేను వెళ్లిపోతాను .. కానీ ఈ మందులు అర్జెంట్‌గా నా తండ్రికి అప్పగించాలని చెబుతాడు స్మగ్లర్. మీకు 10 వేల రూపాయలు ఇస్తానని ఆశపెట్టడంతో రాజ్- లక్కీలు డ్రగ్స్ ఉన్న బ్యాగ్‌ని తీసుకుని బయల్దేరతారు. రాజ్ ఫోన్ నెంబర్, ఫోటోని వాళ్ల బాస్‌కి మెసేజ్ చేస్తాడు స్మగ్లర్. ఇంతలో నందూ, పోలీసులు అతనిని పట్టుకుని బ్యాగ్ ఏమైందని నిలదీస్తాడు. దూరంగా స్వరాజ్- లక్కీలు బైక్‌పై వెళ్తూ కనిపించడంతో వారిని వెంబడిస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 1వ తేదీ ఎపిసోడ్ 995లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ ఆస్తిని కొట్టేయడానికి లాయర్‌ని కలుస్తుంది రేఖ. కొన్నేళ్లు ఎదురుచూస్తున్న కల ఇది.. ఎలాంటి చిన్న తప్పు కూడా జరగడానికి వీల్లేదు.. ఆ ఆస్తి నా చేతికి దక్కితీరాలని చెబుతుంది రేఖ. ఇందూ వేసే ఒక్క వేలు ముద్రతో ఎలాంటి లిటిగేషన్ లేకుండా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌తో పాటు దుగ్గిరాల కుటుంబానికి చెందిన మొత్తం ఆస్తులు మీ పేరు మీదకి వచ్చేస్తాయి. ఆ తర్వాత స్వయంగా ఇందూనే కోర్టులో కేసు వేసినా సరే మీ నుంచి తీసుకోలేరు, అంత కట్టుదిట్టంగా డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశానని చెబుతాడు లాయర్. ఆస్తి నా చేతుల్లోకి రాగానే డబుల్‌గా నీకు క్రెడిట్ అవుతుందని చెబుతుంది రేఖ.
స్వరాజ్- లక్కీలను వెంటాడుతూ వెళ్తుంది నందూ. అంతలా వెంటపడటానికి అసలు ఈ బ్యాగ్‌లో ఏముందో చూడమని చెబుతాడు లక్కీ. స్వరాజ్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా ఏదో ప్యాకెట్ కనిపిస్తుంది. ఈ పౌడర్ మన బస్తీలో కొట్లో దొరుకుతుంది కదా.. దాని కోసం పోలీసులు ఎందుకు వెంటపడుతున్నారని అంటాడు లక్కీ. ఇది మత్తు పదార్ధమని ఈ ప్యాకెట్‌తో కనుక దొరికితే అరెస్ట్ చేసి బెయిల్ కూడా రాకుండా జైళ్లో పడేస్తారని స్వరాజ్ చెప్పడంతో లక్కీ షాక్ అవుతాడు. ఇక్కడి నుంచి సైలెంట్‌గా ఎస్కేప్ అవుదామని చెబుతాడు రాజ్.
చీర సరిగా ఇస్త్రీ చేయలేదని ఇందూపై మండిపడుతుంది భ్రమరాంబ. ఇంతలో రేఖ వచ్చి .. ఏం చేస్తున్నావని మండిపడుతుంది. ఐరన్ చేయమని చీర ఇస్తున్నాను, ఇందులో తప్పేముందని అంటుంది భ్రమరాంబ. తను ఈ ఇంటి పనిమనిషి ఇందూనే కదా అని అంటుంది. తను ఇందిరా దేవి.. ఈ కోటకి రుద్రమదేవి, దుగ్గిరాల కుటుంబానికి ఏకైక వారసురాలు, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కి ఛైర్మన్. కుబేరుడికే అప్పు ఇచ్చేంత కోటీశ్వరరాలు, అలాంటి సెలబ్రిటీ చేత ఇలాంటి చీప్ పనులు చేయిస్తావా? ఇక ఈ ఇంట్లో ఇలాంటివి నడవటానికి వీల్లేదని చెబుతుంది రేఖ. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇందూనే ఈ ఇంటికి మహారాణి.. ఇకపై తనకు ఎవరూ పనులు చెప్పొద్దని సీరియస్ అవుతుంది రేఖ.
ఇక నుంచి బెడ్ కాఫీ.. బెడ్ కాఫీ అంటూ బెడ్ మీదే బ్రేక్‌ఫాస్ట్ చేస్తానంటూ ఇందూకి ఎవరూ ఆర్డర్స్ వేయొద్దని ఐశ్వర్యని చూస్తూ చెబుతుంది రేఖ. ఇందూకి ఆకలి వేస్తే అన్నం పెట్టాలి.. నిద్ర వస్తుందంటే బెడ్ సర్దాలి, బోర్ కొడుతుందంటే ఇందూని ఎంటర్‌టైన్ చేయండని చెబుతుంది రేఖ. ఏమైంది మీకు.. నేను ఏమైనా తప్పు చేశానా? అని అడుగుతుంది ఇందూ. నువ్వేం చేయలేదు.. మేమే చేశాం, ఇకపై ఇంట్లో అందరూ నీ మాటకు విలువనిస్తారు. ఇకపై నిన్ను ఎవ్వరూ ఆపరని చెబుతుంది రేఖ. నీ కోసం స్పెషల్‌గా బట్టలు డిజైన్ చేయించానని చెప్పి ఇస్తుంది రేఖ. ఆమె ప్రవర్తనతో అంతా షాక్ అవుతారు.
స్వరాజ్‌ని వెతుక్కుంటూ స్మగ్లర్ తాలూకా మనుషులు రావడంతో లక్కీ కంగారు పడతాడు. వాళ్ల ప్యాకెట్ వాళ్లకి ఇచ్చేసి మనం వెళ్లిపోదామని చెబుతాడు లక్కీ. ఇలాంటి మత్తు పదార్దాలు మార్కెట్‌లోకి వెళితే.. ఎంతోమంది జీవితాలు నాశనమైపోతాయని అంటాడు లక్కీ. సడెన్‌గా ఇంత దేశభక్తి ఏంటీ? అని లక్కీ అడగ్గా.. మనం బతకడానికి చిన్న చిన్న మోసాలు మాత్రమే చేశాం తప్పించి, ఎవరినీ మోసం చేయలేదు. ఈ ప్యాకెట్ మాత్రం వాళ్లకి దక్కనివ్వనని అంటాడు రాజ్. వాళ్లు చూస్తుండగానే ప్యాకెట్‌ని చించి డ్రమ్ములో పోస్తాడు. ఇదంతా చూసిన రౌడీలు రాజ్‌ని పట్టుకుని కొడుతుండగా.. వాళ్ల బాస్ ఎంట్రీ ఇచ్చి నీలాంటి చీప్ వ్యక్తులకు దాని విలువ తెలియదని అంటాడు.
నేను అలా చేయకపోతే నువ్వు ఆ ప్యాకెట్‌ని మార్కెట్‌లోకి తీసుకెళ్లి చాలామంది జీవితాలు నాశనం చేసేవాడివి అని చెబుతాడు రాజ్. మత్తు పదార్ధాల గురించి బాగానే తెలుసుకున్నావు.. నా గురించి కూడా తెలుసుకుని ఉండాల్సింది, నాకు జరిగిన నష్టం గురించి మాట్లాడుకుందామని అంటాడు వాళ్ల బాస్. డబ్బులిస్తే వదిలేస్తారా అని లక్కీ అడగ్గా.. తప్పకుండా వదిలేస్తాను కాకపోతే 10 లక్షలు కట్టండి అని చెబుతాడు. ఆ మాటలతో లక్కీ, స్వరాజ్‌లు షాక్ అవుతారు. అదేమైనా పబ్లిక్‌గా దొరికే వస్తువా? కష్టపడి ప్రాణాలకు తెగించి.. సముద్రాలు, అడవులు దాటుకుని ఎవరి కంటా పడకుండా తీసుకురావాలి, ఒక్కోసారి ప్రాణాలతో వస్తారో రారో కూడా చెప్పలేమని అంటాడు బాస్. ఇప్పటికిప్పుడు 10 లక్షలు కష్టమని చెబుతాడు లక్కీ. నువ్వొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని తెలుసు.. మీ నాన్న పేరు చలపతి, మీ అమ్మ పేరు లక్ష్మీ, నీ తమ్ముడు వెంకీ అని తెలుసు అని చెప్పడంతో రాజ్ షాక్ అవుతాడు. నా ప్యాకెట్ నీ చేతుల్లో పడగానే, నీ జీవితం నా చేతుల్లో పడింది. డబ్బు కట్టకుండా మీరు తప్పించుకోలేరు. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను.. నా డబ్బు నా చేతికి రాకపోతే నేను ఎక్కడిదాకా వస్తానో అస్సలు ఊహించలేవని రాజ్‌కి వార్నింగ్ ఇస్తాడు.
డైనింగ్ టేబుల్ మీద వంటకాలు చూసి భ్రమరాంబ- శేషం షాక్ అవుతారు. ఇకపై రోజూ ఇలాగే ఉంటుందని చెబుతుంది రేఖ. ఇందూని భోజనానికి పిలిచి కుర్చీలో కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తుంది రేఖ. ఇన్నిరోజు నువ్వు మాకు చేసిన సేవలు చాలు.. ఇకపై మేమే సేవలు చేస్తామని అంటుంది. వంటకాలు చూసి భ్రమరాంబకు నోరూరిపోతుంది. కూర్చొని తినబోతుండగా భ్రమరాంబను ఆగమని చెబుతుంది. ఈరోజు నుంచి ఇందూ తిన్న తర్వాతే తినాలని చెబుతుంది రేఖ. దాని ఎంగిలి కూడు తినాలా అని భ్రమరాంబ సీరియస్ అవ్వగా.. ఇన్నిరోజులు పాపం ఇందూ కూడా అలాగే తిన్నది కదా అంటుంది. ఈరోజు నుంచి ఆ పని మీరు చేయాలని చెబుతుంది రేఖ.
ఉదయం నుంచి చూస్తున్నాను, అసలు దీనికి ఇంత మర్యాద ఎందుకు ఇస్తున్నారు? ఇది ఆఫ్ట్రాల్ పనిమనిషి అంటుంది ఐశ్వర్య. ఆ మాటలతో రేఖ సీరియస్ అవుతుంది. ఈ ఇంటికి తనే నిజమైన యజమాని అని చెబుతుంది. అయితే దానికి సేవలు చేయడం నా వల్ల కాదని కోపంగా వెళ్లిపోతుంది ఐశ్వర్య. నాకు చాలా ఇబ్బందిగా ఉంది.. అందరం కలిసి భోజనం చేద్దామని చెబుతుంది ఇందూ. ఇకపై నువ్వు పెట్టిన హద్దుల్లోనే మేమంతా ఉంటామని చెబుతుంది రేఖ. అక్క స్వేచ్ఛగా ఉండాలని కోరుకున్నాను కానీ, మరి ఇంత ఫ్రీడమ్ దొరుకుతుందని నేను ఊహించలేదు.. సడెన్‌గా రేఖ ఆంటీలో ఇంత మార్పు ఏంటీ అని అపర్ణని అడుగుతుంది స్వాతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











