Brahmamudi April 5th Episode : రుద్రాణికి పిచ్చెక్కించిన స్వప్న.. రాజ్ ఊహాల్లో కావ్య , రాహుల్‌కి బడితపూజ
కావ్యపై పిచ్చిదానిలా ముద్ర వేయాలని చూస్తోన్న రుద్రాణికి గట్టిగా బుద్ధి చెప్పాలని అప్పూతో చెబుతుంది స్వప్న. ముందు నా మొగుడిని సైడ్ చేస్తే కానీ ఆవిడను ఆడుకోవడం కుదరదని వేరే నెంబర్ నుంచి రాహుల్‌కు ఫోన్ చేస్తుంది స్వప్న. ఎవరో అమ్మాయి తన కోసం ఫోన్ చేసిందని పొంగిపోయిన రాహుల్ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. కావ్యకు మెసేజ్ చేసి నేనేమైనా తప్పు చేశానా అని అడుగుతాడు రాజ్. మీ తప్పు లేదని నాకు తలనొప్పిగా ఉండటంతో వచ్చేశానని అంటుంది కావ్య.
కావ్య మాటలతో రాజ్ బాధపడుతూ ఉండటంతో యామిని సైలెంట్‌గా వచ్చి వెనుక నిల్చొంటుంది. అలా సడెన్‌గా ఎందుకు వస్తావని యామిని మీద కోప్పడతాడు రాజ్. నీ కోసం గిఫ్ట్ తెచ్చానని కారు తాళాలు అతని చేతిలో పెడుతుంది. ఇక నుంచి నిన్ను ఫాలో అవ్వనని, నీకు నచ్చినట్లుగా ఉండమని చెబుతుంది యామిని. రాజ్ ఫోటో చూసి బాధపడుతున్న కావ్యని సుభాస్ ఓదారుస్తాడు. రుద్రాణికి ఎలాగైనా కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమెను డైనింగ్ టేబుల్ దగ్గరికి రప్పించి బతికున్న చేపలని తన చేతిలో పెడతారు అప్పూ- స్వప్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక ఏప్రిల్ 5వ తేదీ ఎపిసోడ్ 688లో ఏం జరిగిందంటే?

రుద్రాణిని పిచ్చిదాన్ని చేసే ప్లాన్‌లో భాగంగా డైనింగ్ టేబుల్ మీద ఉంచిన పచ్చి మాంసం , చేపలను కర్రీలు అని చెబుతారు అప్పూ- స్వప్నలు. మీ ఇద్దరికీ పిచ్చి పట్టిందా అంటూ వారిపై మండిపడుతుంది రుద్రాణి. నాన్ వెజ్ మాత్రమేనా, వెజ్ కూడా అలాగే కనిపిస్తాయా అని అడుగుతుంది అప్పూ. దాంతో డౌట్ వచ్చి తీసి చూడగా రుద్రాణికి పచ్చి బంగాళాదుంపలు కనిపించడంతో షాక్ అవుతుంది. మీరు కావ్య కంటే తిక్కలోళ్లు లాగా కనిపిస్తున్నారని మండిపడుతుంది రుద్రాణి.
అందరినీ పిచ్చివాళ్లనే చేయ్యాలనే పిచ్చితో మీకు పిచ్చి బాగా ముదిరిందని అంటుంది అప్పూ. మిమ్మల్నివెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి.. మా ఆయన ఎక్కడ అని రాహుల్‌ని పిలుస్తుంది స్వప్న. దాంతో హాల్‌లో కనిపించిన ప్రకాశం, ధాన్యలక్ష్మీలను డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలుస్తుంది రుద్రాణి. వీళ్లిద్దరూ కలిసి నన్ను వెదవని చేయాలని చూస్తున్నారని అప్పూ- స్వప్నలపై ప్రకాశంకు చెబుతుంది. నిన్ను ప్రత్యేకంగా చేయాల్సిన అసవరం లేదని.. 10 నిమిషాలు నీతో ఎవరూ మాట్లాడినా అది అర్ధమైపోతుంది కదా అంటాడు ప్రకాశం.
ఇక్కడ చికెన్, ఫిష్, బంగాళాదుంప చేస్తే మా అత్తగారికి ఇవన్నీ పచ్చిగా కనిపిస్తున్నాయని చెబుతుంది స్వప్న. దాంతో డౌట్ వచ్చిన ప్రకాశం చెక్ చేసి చూడగా చేపల పులుసు, చికెన్ ఫ్రై , ఆలూ కర్రీలు కనిపిస్తాయి. రుద్రాణి కూడా వాటిని చూసి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని షాక్ అవుతుంది. నాకు ఈ కర్రీలు వద్దని మీరే తినండి అంటూ రుద్రాణి వెళ్లిపోతుంది. కావ్య కిచెన్‌లో ఉండగా ఆమెకు తలనొప్పి తగ్గిందో లేదో తెలుసుకుందామని రాజ్ ఫోన్ చేస్తాడు.
ఫోన్ రింగ్ అవుతుండటంతో కావ్యకి చెబుతుంది అపర్ణ. ఫోన్ ఒకసారి ఎవరో చూడమని అత్తగారికి చెబుతుంది కావ్య. అపర్ణ ఫోన్ చూడబోతుండగా కావ్యకి డౌట్ వచ్చి ఫోన్ తీసుకుంటుంది. ఆఫీస్ కాల్ అని నేను తర్వాత మాట్లాడతానని అపర్ణతో చెబుతుంది. అయినప్పటికీ రాజ్ కంటిన్యూగా ఫోన్ చేస్తూనే ఉండటంతో కావ్య గత్యంతరం లేక అత్తగారి ముందే ఎత్తి చెప్పు రమ్య అంటుంది. నా పేరు రమ్య కాదని రామ్ అని అంటాడు రాజ్.
ఆ వెంటనే బెడ్‌రూంలోకి వెళ్లి నేను వేరే అబ్బాయితో మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్లు ఏం అనుకుంటారో అర్ధం చేసుకోండి అని చెబుతుంది కావ్య. నేను అబ్బాయినే కావొచ్చు.. చెబితే అమ్మాయిల ప్రాబ్లమ్స్ నేను కూడా అర్ధం చేసుకుంటానని అంటాడు రాజ్. మీకు తలనొప్పి అన్నారు కదా ఎలా ఉందో కనుక్కుందామని ఫోన్ చేశానని చెబుతాడు. నాకేమీ హార్ట్ ఎటాక్ రాలేదని జస్ట్ తలనొప్పి మాత్రమేనని సెటైర్లు వేస్తుంది కావ్య.
నా దగ్గర మంచి చిట్కా ఉంది, అది ఫాలో అయితే మీ తలనొప్పి ఇట్టే తగ్గిపోతుందని చెబుతాడు రాజ్. కొబ్బరి నూనెని వేడి చేసుకుని తలకు రాసుకుంటే తగ్గిపోతుందని అంటాడు. కావ్య అలాగే చేస్తుండగా రాజ్ వచ్చి ఆమెకు మసాజ్ చేసినట్లుగా ఊహాల్లో తేలిపోతుంది. ఇంతలో రాజ్ గొంతు వినిపించడంతో షాకై ఉలిక్కిపడుతుంది. మీరు చెప్పినట్లుగానే మసాజ్ చేశానని.. తలనొప్పి తగ్గిందని చెబుతుంది కావ్య. రాజ్ ఫోన్ పెట్టేశాక హాయిగా అనిపిస్తుంది.
తనకు పొద్దున ఫోన్ చేసిన టీనా కోసం ఆమె చెప్పిన ఏరియాకు వస్తాడు రాహుల్. కానీ అక్కడెవరూ లేకపోవడంతో ఆమెకు ఫోన్ చేస్తాడు. సిటీ అంతా తిప్పుతున్నావ్ ఇంతకీ నువ్వెక్కడ ఉన్నావో చెప్పు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న స్వప్న కోపంతో రగిలిపోతుంది. అంత సులువుగా చెబితే నీ తిక్క ఎలా కుదురుతుంది చెప్పు అంటూ మనసులో అనుకుంటుంది స్వప్న. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను, సారీ డియర్ అంటుంది. మనకి మనకి సారీలు ఎందుకులే కానీ నువ్వు ఒక్కసారి దర్శనమిస్తే చాలు నీ ఒళ్లో వాలిపోతానని అంటాడు రాహుల్.
నువ్వు నా దగ్గరికి వచ్చిన తర్వాత చిలిపి వేషాలు వేయవు కదా అంటుంది స్వప్న. లేదు లేదు అలా దూరం నుంచి చూసుకుంటూ నన్ను నేను మరిచిపోతానని అంటాడు రాహుల్. నీకు లొకేషన్ షేర్ చేయడానికి నా దగ్గర సిగ్నల్ సరిగా లేదని, నేను ఫోన్‌లో డైరెక్షన్ ఇస్తుంటాను వచ్చేయ్ అంటుంది స్వప్న. టీనా చెప్పిన డైరెక్షన్‌ను బట్టి ఓ ప్లేస్‌కు వస్తాడు రాహుల్. తీరా కారు దిగి చూస్తే అది దుగ్గిరాల నిలయం కావడంతో షాక్ అవుతాడు. ఇంతలో స్వప్న చీపురు కట్ట తీసుకుని కనిపించడంతో రాహుల్ భయపడతాడు.
చెప్పిన రూట్‌కి చాలా కరెక్ట్‌గా వచ్చావ్ రాహుల్ అంటుంది స్వప్న. ఇంతసేపు ఫోన్‌లో మాట్లాడిన టీనాను నేనే అని చెప్పడంతో రాహుల్ షాక్ అవుతాడు. నువ్వు మూడు రోజులుగా ఛాటింగ్ చేస్తూ రొమాంటిక్‌గా మాట్లాడింది నాతోనే అని అంటుంది స్వప్న. నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ రాహుల్ మండిపడతాడు. ఎవరిని ఎవరు మోసం చేశారో ఈ రోజు తేలిపోతుందని చెప్పి చీపురుకట్టతో రాహుల్‌ని చితకబాదుతుంది. పెళ్లాం పిల్లలు ఉన్నా కూడా పెళ్లి కాలేదని ఇలా పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే పడేసి కొట్టడం కాదు నెక్ట్స్ టైం పాడె మీద పడేసి కొడతానని వార్నింగ్ ఇస్తుంది స్వప్న.
దెబ్బలకు మూలుగుతూ వస్తున్న రాహుల్‌కి రుద్రాణి ఎదురొస్తుంది. ఊరు మీద పడి తిరిగొస్తున్నావా అంటూ మండిపడుతుంది. నీ పెళ్లాంతో వేడి వేడిగా కాపడం పెట్టించుకో నొప్పులన్నీ తగ్గిపోతాయ్ అని చెబుతుంది రుద్రాణి. ఇంతసేను నన్ను ఉతికి ఆరేసింది అదేనని చెప్పడంతో ఆమె షాక్ అవుతుంది. నాకే ఈ ఇంట్లో అంతా కొత్త కొత్తగా ఉందని రుద్రాణి చెప్పడంతో నీకేమైందని అడుగుతాడు రాహుల్. ఇంట్లో అంతా నన్ను పిచ్చిదానిలా చూస్తున్నారని చెబుతుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











