Brahmamudi April 6th Episode: కష్టంలో ఇందూని నడిపించిన కావ్య... రేఖకి ఊహించని షాక్
Photo Courtesy: JioHotstar
సాహూకి రాజ్ గురించి చలపతి చెబుతుండగా దెబ్బలతో ఇంటికొస్తాడు వెంకీ. తమ్ముడిని చూడగానే ఏం జరిగిందని కంగారుపడతాడు రాజ్. ఓ కారు వేగంగా వచ్చి నన్ను గుద్ధిందని కొద్దిలో మిస్ అయిపోయిందని చెబుతాడు వెంకీ. ఇదంతా ఎవరో కావాలని చేసినట్లుగా ఉందని అంటాడు. రాజ్‌ను బయటకు తీసుకెళ్లిన సాహూ.. మీ తమ్ముడి మీదకి వెళ్లిన కారు మాదే, గడువులోగా 10 లక్షలు ఇవ్వకపోతే ఈసారి మీ ఇంటి మీదకి బుల్డోజర్ వస్తుందని వార్నింగ్ ఇస్తాడు సాహూ. దాంతో లక్కీ చేత ఐశ్వర్యకి ఫోన్ చేయించి కిడ్నాప్ డీల్‌కి ఒప్పుకుంటాడు.
మేం కిడ్నాప్ ఎవరినీ చేయాలని స్వరాజ్ అడగ్గా.. ఇందూ ఫోటో చూపిస్తుంది ఐశ్వర్య. అది చూడగానే రాజ్, లక్కీలు షాక్ అవుతారు. ఈమె సంతకం పెడితే కోట్ల ఆస్తి మా ఆంటీకి వస్తుంది, ఇందూని కిడ్నాప్ చేస్తే ఎంత కావాలంటే అంత డబ్బు వస్తుందని చెబుతుంది ఐశ్వర్య. ఇందూని పిలిచి కాఫీ పెట్టమని అడుగుతుంది ఐశ్వర్య. ఇంతలో రేఖ వచ్చి.. నీతో ఎవరూ పనులు చేయించొద్దని చెప్పాను కదా? ఎవరు పనిచెప్పారు? అని మండిపడుతుంది. రేఖకి బట్టలు ఇచ్చి.. రేపు ఫాంహౌస్‌లో నీ బర్త్ డే పార్టీ చేస్తున్నామని చెబుతుంది. ఇదంతా చూసిన అపర్ణ, స్వాతిలు ఇందూ ఏం చేయబోతుందా అని టెన్షన్ పడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఏప్రిల్ 6వ తేదీ ఎపిసోడ్ 999లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇన్నేళ్లుగా మనిద్దరం ఇందూకి దక్కాల్సిన ఆస్తి కోసం ఆ రేఖతో యుద్దాం చేస్తూనే ఉన్నామని సుభాష్‌తో అంటుంది అపర్ణ. ఇప్పుడు అదే పని ఇందూ చేస్తోంది.. మన కోసం ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతోందని చెబుతుంది. మనం దాని బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదని అంటుంది అపర్ణ. ఒకప్పుడు కావ్య కూడా ఇలాగే ఉండేది, ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మనం ఎంత చెప్పినా సరే వినేది కాదు. ఇప్పుడు తన కూతురిని మాత్రం ఎలా ఒప్పిస్తావని అడుగుతాడు సుభాష్. మనం ఒప్పించలేకపోవచ్చు.. కానీ వాళ్ల అమ్మ ఒప్పించగలదు కదా అని అపర్ణ చెప్పడంతో సుభాష్ షాక్ అవుతాడు. కావ్య ప్రాణాలతో లేకపోవచ్చు.. తన జ్ఞాపకం ఉంది కదా అని కళ్యాణ్ రాసిన పుస్తకం చూపిస్తుంది అపర్ణ. దాంతో సుభాష్ గతంలోకి వెళ్తాడు.
నీకో దండం తల్లి.. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ చేతి కాఫీ, నీ చేతి వంట తప్పించి మీ మావయ్య గారు ఏం తినడం లేదని కావ్యతో అంటుంది అపర్ణ. ఈ ఇంట్లో అందరికీ నువ్వే కావాలి.. అందరూ నన్ను మరిచిపోయేలా ఉన్నారని చెబుతుంది. నా కోడలే నాకు ఎక్కువ అని అంటుంది. ఇంతలో కళ్యాణ్ వచ్చి నీకో సర్‌ప్రైజ్ అంటాడు. ఎవరిదో బయోగ్రఫిలా ఉంది.. మీరే రాశారా అని అడుగుతుంది కావ్య. ఒక బయోగ్రిఫియే.. ఒక గొప్ప వ్యక్తిది, నేనే రాశాను, పుస్తకం చదవితే తెలుస్తుందని అంటాడు కళ్యాణ్. ఆ పుస్తకంపై కావ్య ఫోటో ఉండటంతో అపర్ణ, సుభాష్‌లు షాక్ అవుతారు. నువ్వు కావ్య జీవితాన్ని పుస్తకంలా రాశావా అని అపర్ణ పొంగిపోతుంది.
నా కోసం మీ అక్షరాల్ని వృథా చేశారని మండిపడుతుంది కావ్య. మధ్యతరగతి ఇంట్లో పుట్టి.. దుగ్గిరాల కుటుంబంలో అడుగుపెట్టి కోడలిగా ఒక యుద్ధాన్ని చేశారు. ఈరోజు ఈ కుటుంబం ఆనందంగా ఉండటం కోసం చేసిన త్యాగం అందరికీ తెలియాలని చెబుతాడు కళ్యాణ్. వదిన వల్లే నా పుస్తకానికి గుర్తింపు వచ్చింది.. ఈ పుస్తకం మన కుటుంబంలో రాబోయే తరాలకు ఆదర్శం కావాలి. కష్టం వస్తే దానిని ఎదిరించి నిలబడే ధైర్యం ఈ పుస్తకం అవ్వాలి. డబ్బుకు ఎంత విలువ ఇవ్వాలి, బంధానికి ఎంత విలువ ఇవ్వాలి అనేది నిన్ను చూసి తెలుసుకుంటారు. ఇది రాబోయే తరానికి భవిష్యత్తు అంటాడు కళ్యాణ్. ఇదంతా గుర్తుచేసుకుని సుభాష్ ఎమోషనల్ అవుతాడు.
ఇందూ దగ్గరికి వెళ్లి నీ కోసం మిగిలివున్న మీ అమ్మ జ్ఞాపకం ఇదే, దీనిని చాలా కష్టపడి దాస్తూ వచ్చానని చెబుతుంది అపర్ణ. మీ అమ్మ ధైర్యం, కలలు, కన్నీళ్లు, ఆవేశం, ఆశయాలు అన్ని ఉన్నాయి. మీ బాబాయ్ మీ అమ్మ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని రాసి మీ అమ్మకి అంకితం చేశాడు అని చెబుతుంది అపర్ణ. మీ అమ్మ గురించి చదివి ఆలోచించి అప్పుడైనా నీ నిర్ణయం మార్చుకోమని అంటుంది. పుస్తకంపై తల్లి ఫోటో చూసి ఎమోషనల్ అవుతుంది ఇందూ.
రుద్రాణి, రాహుల్ ఫోటోలను చూస్తూ నువ్వు ఏదైతే సాధించాలని తపన పడ్డావో, దేని కోసమైతే నీ జీవితాన్ని త్యాగం చేశావో అది రేపటికి నిజం కాబోతోందని రేఖ అంటుంది. రుద్రాణి గారు ఎక్కడున్నా నిన్ను చూసి సంతోషిస్తారు, ఆస్తి పేపర్లు నీ చేతిలో పడ్డ మరుక్షణం తన ఆత్మకి తప్పకుండా శాంతి లభిస్తుందని అంటుంది భ్రమరాంబ. నాకు ఎక్కడో కొంచెం అనుమానంగా, కొంచెం భయంగా ఉందని చెబుతుంది. ఇందూ చేతిలో ఏం లేదని అంటుంది రేఖ. మూడో కంటికి తెలియకుండా ముచ్చటగా ఆ సంతకాలు పెట్టిస్తే అయిపోయే దానికి, బర్త్ డే పార్టీ అని అందరినీ పిలుస్తున్నావు. అంతమంది జనాన్ని చూసి ఇందూలో ధైర్యం పుట్టుకొచ్చి నేను సంతకం పెట్టను, ఇది నా ఆస్తి అంటే అని అడుగుతుంది భ్రమరాంబ.
ఆస్తి మనకు రాకూడదని ఇందూకి అపర్ణ నూరిపోసింది.. అయినప్పటికీ మనకి సంతకం పెడతానని ఆ ఇందూ చెబుతోంది. ఆ ఇందూకి అన్ని వాళ్లమ్మ పోలికలే వచ్చాయి.. ఆస్తులు, అంతస్తుల కంటే బంధాలు, బంధుత్వాలకే ఎక్కువ విలువ ఇస్తుంది. ఆ ఇద్దరి ముసలి ప్రాణాలు మన చేతుల్లో ఉన్నంత వరకు అది ఎప్పటికీ తోక జాడించదని చెబుతుంది రేఖ. తన స్థానంలో కావ్య ఉంటే నువ్వు అన్నట్లుగానే భయపడాల్సి వచ్చేది. ఇందూలో అంత ధైర్యం రావాలంటే మళ్లీ ఆ కావ్య తిరిగి రావాలని అంటుంది రేఖ.
అపర్ణ ఇచ్చిన పుస్తకాన్ని చదువుతూ తన తల్లి గురించి తెలుసుకుంటుంది ఇందూ. అందులో కావ్య పుట్టినప్పటి నుంచి దుగ్గిరాల వారింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి రాజ్‌తో పరిచయం పెళ్లి, దుగ్గిరాల వారింట్లో అవమానాలు, తిరిగి అందరి ప్రేమను ఎలా సాధించింది, రుద్రాణి ఎత్తులు, ఇంట్లో ఆస్తి గొడవలు, సీతారామయ్య నిర్ణయం, తనకు రాజ్ దగ్గరవ్వడం, బిడ్డ పుట్టడం, బిడ్డ మళ్లీ దూరం కావడం సహా అన్ని వివరాలు ఉంటాయి. తన పేరు ఇందిరా దేవి అని.. రెండు తరాలను కలిపే వారధి నువ్వు అని కావ్య చెప్పడం గురించి తెలుసుకుంటుంది ఇందూ. కుటుంబం మొత్తం కలిసి శ్రీశైలం వెళ్లే వరకు ప్రతి విషయాన్ని తెలుసుకుని బాధపడుతుంది ఇందూ. తల్లి గురించి తలచుకుంటూ నిద్రపోగానే... పక్కనే కావ్య ప్రత్యక్షమవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











