Brahmamudi February 13th Episode:ట్రస్ట్ కోసం కావ్య-రాజ్ త్యాగం..తల్లికి కళ్యాణ్ క్లాస్,రుద్రాణిపై అప్పూ నిఘా
Photo Courtesy: JioHotstar
నేను మా ఇంట్లో తిరిగి అడుగుపెట్టాలి.. బిడ్డల్ని మార్చడం వెనుక నేను ఉన్నానని రాజ్, కావ్యలకు చెప్పొద్దని ధర్మేంద్రను బతిమలాడుతుంది రుద్రాణి. ఇంతలో మినిస్టర్ ఇంటికి కళ్యాణ్ - అప్పూ రావడంతో రుద్రాణి తలుపు చాటున దాక్కొంటుంది. హాస్పిటల్‌లో అంతమంది బిడ్డలు ఉండగా.. మా అక్కకు పుట్టిన పాపనే ఎందుకు మార్చారు? ఇది మీ ఆలోచనేనా? మీ వెనుక ఎవరైనా ఉన్నారా అని అప్పూ ప్రశ్నించడంతో ధర్మేంద్ర, రుద్రాణిలు షాక్ అవుతారు. నా భార్యను కాపాడుకోవడానికి నాకు ఆరోజున అంతకుమించిన ఆలోచన రాలేదని చెబుతాడు ధర్మేంద్ర.
బిడ్డల్ని మార్చిన ఆలోచన నాదేనని.. దీని వెనుక ఎవరూ లేరని చెప్పడంతో అప్పూ, కళ్యాణ్‌లు వెళ్లిపోతారు. ఆ వెంటనే రుద్రాణి వచ్చి మినిస్టర్‌కు థ్యాంక్స్ చెప్పి బయటకు వెళ్లిపోతుండగా.. కారులో వెళ్తున్న అప్పూ అద్దంలోంచి చూస్తుంది. మినిస్టర్ ఇంట్లో రుద్రాణికి పనేంటీ? ఆమెకు ధర్మేంద్రకు సంబంధం ఏంటీ? అని కళ్యాణ్‌తో అంటుంది. పేదలకు సాయం చేయడానికి దుగ్గిరాల వారి ఛారిటబుల్ ట్రస్ట్ పెడదామని కావ్య చెప్పగా అందరూ సంతోషిస్తారు. కానీ ధాన్యలక్ష్మీ మాత్రం మన ఆస్తుల్లో నుంచి డబ్బులు ఖర్చుపెట్టి ఇవ్వడానికి ఒప్పుకోను అంటుంది. ఆ మాటలతో రాజ్, కావ్య, దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్ 955లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రేపు పుట్టబోయే బిడ్డలు మనలా కలిసిమెలిసి ఉంటారన్న గ్యారంటీ లేదు. అందుకే నా కొడుకు భవిష్యత్తుకు సమస్య రాకుండా ఉండాలంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదని అంటుంది ధాన్యలక్ష్మీ. ఈ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా బయటకు వెళ్లకూడదని తేల్చేస్తుంది. ఇన్నాళ్లు మన కోసం శ్రమిస్తున్న వారికి చేస్తున్న చిన్న సాయం ఇది. వాళ్ల కష్టాన్ని తీర్చాలని అనుకుంటున్నామని చెబుతుంది కావ్య. మీరేం చెప్పినా నేను వినను, నాకు ఈ ఆలోచన నచ్చలేదు.. అంతగా మీకు సమాజసేవ చేయాలని ఉంటే మాకు రావాల్సిన ఆస్తిని మాకు పంచిపెట్టి మిగతా సగం మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి అని ధాన్యలక్ష్మీ చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
కలిసున్న మనసుల్ని ముక్కలు చేయమంటున్నావా అని సీతారామయ్య ప్రశ్నిస్తాడు. నా పిల్లల భవిష్యత్ కోసమే ఆలోచిస్తున్నాను అంటుంది ధాన్యం. జీవితాంతం ఎన్ని తరాలు మారినా ఒకే చెట్టు కింద కలిసి బతకాలన్నది తాతయ్య ఆశ.. ఇప్పుడు ఆస్తిని పంచడం అంటే మనమంతా విడిపోవడమని అంటాడు రాజ్. కలిసి ఉందామని అంటూనే కళ్లలో పొడిస్తే నేను సహించలేను, ఆస్తిని పంచను అంటారు, తేరగా దాన ధర్మాలు చేసి ఎవరి జీవితాలు నాశనం చేద్దామని అనుకుంటున్నారని ప్రశ్నిస్తుంది ధాన్యం. దాంతో అపర్ణ సీరియస్ అవుతుంది. వాళ్లు ఈ కుటుంబం బాగుండాలని కోరుకునేవాళ్లే కానీ, అయినవాళ్లను బజారున పెట్టే వాళ్లు కాదని చెబుతుంది. ఆస్తిలో రాజ్‌కి ఎంత హక్కు ఉందో, కళ్యాణ్‌కి కూడా అంతే హక్కుంది. కాబట్టి ఆస్తిని పంచుతారో? ట్రస్ట్‌ని ఆపుతారో తేల్చుకోండి అంటుంది ధాన్యలక్ష్మీ. ఆమె దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అవుతుంది.
ఇంట్లో జరిగిన దానికి సీతారామయ్య బాధపడతుండగా ఇందిర వచ్చి ఓదారుస్తుంది. ధాన్యలక్ష్మీ ఆవేశపడలేదు.. అడ్డు పడుతోంది. నా కలను వాళ్ల కళ్లతో చూసిన నా మనవడు, మనవరాలి ఆలోచనను అర్ధం చేసుకోలేకపోయింది. జీవితాంతం నేను డబ్బు వెంటే పరిగెత్తాను.. నా కుటుంబం, నా కోసం పనిచేసిన వాళ్లు సంతోషంగా ఉండాలనే గొడవలో పడి నా ఆశయాన్నే మరిచిపోయాను. ఆ రోజు నేను అనుకున్నది చేసుంటే ఈరోజు ఈ పరిస్ధితి ఉండేది కాదని సీతారామయ్య అంటాడు. మా నాన్న నాకు వ్యాపారాన్ని అప్పగిస్తూనే.. మనం సంపాదించే డబ్బులో ఒక్క రూపాయి పేదల కోసం కేటాయించగలిగితే పేదలు ఉండరని చెప్పాడు. ఆరోజే ఒక ట్రస్ట్ పెట్టాలని అనుకున్నాను.. ఆ ట్రస్ట్ ద్వారానే ఎందరికో సాయం అందించాలని అనుకున్నాను, కానీ నా ఆశయం ఆవిరి అయిపోయిందని బాధపడతాడు సీతారామయ్య.
ఆరోజు జరగనిది, ఈరోజు జరిపించడానికి రాజ్, కావ్యలకు దేవుడు అలాంటి ఆలోచన వచ్చేలా చేశాడేమో అంటుంది ఇందిర. అందుకే నేను చాలా సంతోషించాను, కానీ ఇలా అయినవాళ్లే అడ్డుకుంటారని అనుకోలేదని అంటాడు. రాజ్ - కావ్యలకు ఒక ఆలోచన వచ్చిందంటే నీ కల నెరవేర్చకుండా వదిలిపెట్టరని అంటుంది ఇందిర. ధాన్యలక్ష్మీని వాళ్లే ఒప్పిస్తారని చెబుతుంది. కళ్యాణ్ - అప్పూలు ఇంటికొచ్చేసరికి ప్రకాశం బాధపడుతూ కనిపించడంతో ఏం జరిగిందని అడుగుతారు. ఈ ఇంటి ఆస్తి, డబ్బు చిల్లిగవ్వ కూడా బయటకు వెళ్లకూడదని రాద్ధాంతం చేసిందని ప్రకాశం చెప్పడంతో కళ్యాణ్ షాక్ అవుతారు. రాజ్- కావ్యలు ఒక ట్రస్ట్ పెడదామనుకున్నారు.. దానిని రన్ చేయాలంటే ఆస్తిలో సగభాగం ట్రస్ట్‌కు రాసివ్వాలని అనుకున్నారు.. వాళ్లు ఆ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టాలని, ఈ ఇంటి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని అనుకున్నారు. కానీ మీ అమ్మ మాత్రం ఒప్పుకోలేదు.. ఆస్తిని పంచమని అడిగిందని చెప్పడంతో కళ్యాణ్ - అప్పూలు షాక్ అవుతారు.
దాంతో ధాన్యంపై సీరియస్ అవుతాడు కళ్యాణ్. ఈ ఇంటిపేరు తరతరాలు నిలిచిపోవాలని అన్నయ్య - వదిన చేస్తున్నారని అలాంటి మంచిపనిని ఎందుకు అడ్డుకున్నావని మండిపడతాడు. సగం ఆస్తి రాసిస్తే నువ్వు, నీ పిల్లలు ఎలా బతుకుతారని ప్రశ్నిస్తుంది ధాన్యం. అప్పూకి జాబ్ ఉంది, నా చేతిలో విద్య ఉంది... కానీ అన్నయ్య, వదినలకు మనసుంది. వాళ్లు గొప్పవాళ్లే కావొచ్చు.. కానీ మన సగం ఆస్తిని మనకి ఇచ్చేసి, వాళ్ల సగభాగంతో ఏమైనా చేసుకోమనండి అంటుంది ధాన్యం. అసలు పెరిగిన ఆస్తిలో, పెరిగిన వ్యాపారంలో నా శ్రమ అనేది ఎక్కడైనా ఉందా? తాతయ్య సంపాదించిన ఆస్తిని నాన్న, పెదనాన్నలకి అప్పగిస్తే అన్నయ్య వీళ్లకు తోడై రూపాయిని పది రూపాయలు చేశాడు.. అన్నయ్య, వదినలు కష్టపడి మన ఫ్యామిలీని ఈ స్థాయిలో నిలబెట్టారని చెబుతాడు కళ్యాణ్.
నాకు ఎవ్వరి మీదా ద్వేషం లేదు.. ఎవ్వరి మీద కోపం లేదు.. అందరూ నావల్లే. కానీ నా పిల్లల కడుపుకొట్టి ఆస్తిని పంచుతానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోనని తేల్చేస్తుంది ధాన్యలక్ష్మీ. ఇంట్లో జరిగిన గొడవపై కావ్య బాధపడుతుండగా రాజ్ ఓదారుస్తాడు. చిన్నత్తయ్య కఠినంగా కనిపించే అమాయకురాలు.. తన మనసు చెప్పింది నమ్మే ఒక తల్లి. సగం ఆస్తి ట్రస్ట్‌కు వెళ్లిపోతే తన బిడ్డల పరిస్ధితి ఏమైపోతుందోనని భయపడుతోందని అంటుంది కావ్య. ఎలాగైనా ట్రస్ట్ ప్రారంభించాలి.. అది ఆగకూడదు అంటుంది. సగం ఆస్తిని ట్రస్ట్‌కి కేటాయించి.. మన వాటా కూడా కళ్యాణ్‌కి రాసేస్తే ఎలా ఉంటుందని అడుగుతుంది కావ్య. మన పరిస్ధితి ఏంటీ అని రాజ్ అడగ్గా... మనకి వ్యాపారం ఉంది, తిరిగి సంపాదించుకునే టాలెంట్ ఉందని చెబుతుంది కావ్య. భార్య మంచి మనిషిని చూసి రాజ్ ఎమోషనల్ అవుతాడు. గొప్ప పని కోసం ఉన్న ఆస్తినంతా తృణప్రాయంగా ఇచ్చేద్దామనే గుణం ఎంతమందికి ఉంటుందని అంటాడు.
కావ్య పాప మీద అటాక్ చేయించింది మినిస్టర్ మనుషులు కాదని.. వేరే మనుషులని నాకు అనిపిస్తోందని, దాని వెనుక ఎవరున్నారో తెలుసుకోవాలని ఓ ఆఫీసర్‌కు చెబుతుంది అప్పూ. మీరు హాస్పిటల్‌లో సీసీ కెమెరా ఫుటేజ్ చెక్ చేసి వాళ్లని పట్టుకోవాలని చెబుతుంది అప్పూ. ఈ పనిని అఫీషియల్‌గా డీల్ చేయొద్దని.. టాస్క్‌ఫోర్స్ వాళ్ల హెల్ప్ తీసుకోమని చెబుతుంది అప్పూ. ఇంతలో కళ్యాణ్ ఇదంతా వింటాడు. మినిస్టర్ గారే ఆ పని నేనే చేయించానని చెప్పాక నీ డౌట్ క్లారిఫై కాలేదా అని మండిపడతాడు. మినిస్టర్ ఇంట్లో రుద్రాణి దాక్కోవడం నేను చూశాను అని అప్పూ చెప్పగా కళ్యాణ్ షాక్ అవుతాడు. హాస్పిటల్‌లో అంతమంది ఆడపిల్లలు ఉండగా... కావ్య అక్క కూతురినే మినిస్టర్ మార్చడానికి ఎందుకు ప్రయత్నించాడు? ఒకవేళ ఆ రుద్రాణియే ఆ ఐడియా ఇచ్చిందేమో అంటుంది అప్పూ. మనింట్లో మనిషే మన శత్రువు అయితే ఎంతో ప్రమాదమని భయపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










