Brahmamudi February 27th Episode: అపర్ణపై రుద్రాణి కూతురి పగ.. బాయ్‌ఫ్రెండ్‌తో రేఖ పెళ్లి, కథలోకి కొత్త విలన్

Photo Courtesy: JioHotstar

రాహుల్‌ని రాజ్ చంపేయడంతో రుద్రాణి పట్టరాని కోపంతో ఊగిపోతూ రాజ్‌ని కొట్టి కొట్టి చంపుతుంది. రాజ్ చనిపోతూ.. కావ్యని స్పృహలోకి వచ్చేలా చేసి నీ బిడ్డల్ని నువ్వే కాపాడుకునేలా చేయమని అంటాడు. పిల్లల్ని రుద్రాణి కాల్చేయబోతుండగా కావ్య లేచి అడ్డుకుంటుంది. నిన్ను పెంచి పెద్ద చేసిన కుటుంబాన్ని పొట్టనపెట్టుకున్నావని రుద్రాణిపై మండిపడుతుంది కావ్య. అసలు నువ్వు వచ్చినప్పటి నుంచే నా ప్లాన్ ఏది వర్కవుట్ కావడం లేదని లేదంటే నా బిడ్డ మహారాజులా ఉండేవాడని అంటుంది రుద్రాణి.

బిడ్డల్ని కాపాడే ప్రయత్నంలో కావ్య కిందపడిపోయి.. పక్కనే అమ్మవారి దగ్గరున్న త్రిశూలంతో రుద్రాణిని పొడిచి చంపేస్తుంది. ఇక బిడ్డల బాధ్యత నీదే, ఎప్పటికీ వాళ్లని విడిచి పెట్టొద్దని అపర్ణ చేతిలో చెయ్యేసి కన్నుమూస్తుంది కావ్య. యాక్సిడెంట్ నుంచి బయటపడి ఆసుపత్రికి చేరుకుంటుంది అపర్ణ. సుభాష్ వెన్నెముక విరిగిపోయిందని ఆయన జీవితాంతం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో అపర్ణ కంటతడి పెడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 27వ తేదీ ఎపిసోడ్ 967లో ఇంకా ఏం జరిగిందంటే?

Brahmamudi Serial February 27th 2026 Episode 967 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

సుభాష్ గారి వెన్నెముక దెబ్బతిందని, ఆయనకి ఆపరేషన్ చేసినా తిరిగి నడుస్తారన్న నమ్మకం లేదని తేల్చిచెబుతాడు డాక్టర్. ఆ మాటలతో అపర్ణ షాక్ అవుతుంది. దాంతో ఎదురుగా ఉన్న దేవుడి దగ్గరికి వెళ్లి.. అసలు మేం ఏం తప్పుచేశామని ఇంత పెద్ద శిక్ష వేశావు, మా కుటుంబంలో ఏ ఒక్కరు కూడా ఎవరికి ద్రోహం చేయలేదు. ఉన్న ఆస్తిని కూడా పేదవాళ్లకు పంచేయాలని అనుకున్నాం. అలాంటిది ఇంత అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? ఒక ఆడది నవమాసాలు మోయడాన్ని కాదు, బిడ్డకు జన్మనివ్వడాన్ని కానీ ఏమాత్రం కష్టం అనుకోదు. కానీ కడుపు కోతను మాత్రం భరించలేదు. అలాంటిది కన్నకొడుక్కి కొరివి పెట్టే దురదృష్టం నాకెందుకు ఇచ్చావు అని ప్రశ్నిస్తుంది. ఈ భారాన్ని చచ్చే వరకు ఎలా మోయగలను అని బాధపడుతుంది.

ఇంతలో రేఖ వచ్చి అన్యాయం చేసింది మా అమ్మ, మా అన్నయ్య అని అంటుంది. పైకి మంచి వాళ్లలా నటిస్తూ ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు, ఆస్తి కోసం ఇంత అన్యాయం చేస్తారని అనుకోలేదు. తన కడుపున పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందని చెబుతుంది. మిమ్మల్ని నమ్ముకుని ఇద్దరు పిల్లలున్నారు.. నడవలేని స్థితిలో మావయ్య ఉన్నారు, వాళ్లందరికీ మీరే తోడుగా ఉండాలని చెబుతుంది. మీకు అండగా నేనుంటాను, మీ కూతురిలా ఉంటానని చెబుతుంది రేఖ. ఆ మాటలతో కోప్పడిన అపర్ణ.. ఇప్పటి వరకు మీ అమ్మ, మీ అన్నయ్య చేసిన ద్రోహం చాలు. ఇకపై నేను ఎవరినీ నమ్మను.. ఈ ఆవేశంలో నిన్ను చంపేస్తానని అంటుంది అపర్ణ.

ఒంటరి ఆడదానిని, నేను ఎక్కడికి వెళ్లగలను కొంచెం జాలి చూపించమని బతిమలాడుతుంది రేఖ. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఇలాగే మీ అమ్మ కూడా మా మావయ్య కాళ్ల దగ్గరికి వచ్చి జాలి చూపించమని బతిమలాడి, మా ఇంట్లో అడుగుపెట్టింది. ఈ రోజు ఆ కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేసింది. ఇప్పుడు నువ్వు మళ్లీ వచ్చి జాలి చూపించమంటున్నావా? ఇంక మా దగ్గర ఏం మిగిలింది? ఆ పసిపిల్లల ప్రాణాలు కూడా తీద్దామని అనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తుంది అపర్ణ.

రేవతి కొడుకు స్వరాజ్‌ దొరికిన విషయాన్ని తన ఫ్రెండ్‌కు చెబుతాడు ఆ వ్యక్తి. మళ్లీ పోలీసులు, కేసులు అంటారేమోనని అతని భార్య భయపడుతుంది. బాబు షాక్‌లో ఉన్నాడు.. కనీసం తన పేరు కూడా చెప్పలేకపోతున్నాడని చెబుతాడు డాక్టర్. బాబుకు గతం గుర్తుకురావాలంటే ఏం చేయాలని అడుగుతుంది ఆ తల్లి. నేను ఇచ్చే మెడిసిన్స్ వాడుతూ... గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం చేయమని చెబుతాడు డాక్టర్. వారం తర్వాత బాబును తీసుకొస్తే అన్నీ గుర్తొస్తాయని అంటాడు. డాక్టర్ మాటలతో బాబును ఇంటికి తీసుకెళ్లలేమని చెబుతాడు భర్త. వాడిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, ఎవరి కన్నబిడ్డో ఇంత కష్టం వచ్చిందని అంటుంది భార్య. ఈ బాబు కన్నవాళ్లు వీడు కనిపించడం లేదని ఎంత కంగారు పడుతున్నారో ఏంటో అని అంటాడు. అవన్నీ మీరు చూసుకోండి.. మీ ఫ్రెండ్ సాయం తీసుకుని వివరాలు కనుక్కోమని చెబుతుంది. అప్పటి వరకు ఈ బాబు నా దగ్గరే ఉంటాడని అంటుంది.

కుటుంబం మొత్తాన్ని కోల్పోవడంతో అపర్ణ వెక్కివెక్కి ఏడుస్తుంది. మరోవైపు.. ఇంత జరిగినా సరే ఆ అపర్ణలో అహంకారం తగ్గలేదు. మా అమ్మ, అన్నయ్య చనిపోయినా సరే ఇంకా ఎందుకు బతికున్నానా? అని అనుకున్నాను. మా అమ్మ కన్న కలల్ని నేను నిజం చేయడానికే బతికున్నాను. ఈ దుగ్గిరాల వంశాన్ని నాశనం చేసి, మిగిలిన వారందరినీ నా కళ్ల కింద చెప్పుల్లా పెట్టుకుంటానని పగతో రగిలిపోతుంది. ఆ వెంటనే తన బాయ్‌ఫ్రెండ్‌ని పిలిచి.. ఇన్నేళ్లుగా నువ్వు నా వెంట పడుతున్నావు, పెళ్లి చేసుకోమని ఎన్నోసార్లు అడిగావు, అప్పుడున్న పరిస్ధితుల్లో నిన్ను రిజెక్ట్ చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని అంటుంది రేఖ.

కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి మా తమ్ముడు సిద్ధంగా లేడని అంటుంది అతని అక్క. ఒకప్పుడంటే నీ వెనుక నీ మమ్మీ ఉండేది.. ఆ దుగ్గిరాల ఇంట్లో మీ అన్నయ్య ఉండేవాడు. మీ మమ్మీ ఏదో ఒకటి చేసి ఆ ఆస్తి మొత్తం నీకొచ్చేలా చేస్తుందని అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ దగ్గర ఏముంది? చచ్చిపోయిన నీ వాళ్ల జ్ఞాపకాలు, మిగిలిపోయిన ఈ బిడ్డ తప్పా అని ప్రశ్నిస్తుంది. నా తమ్ముడిది ఒక చిన్న కంపెనీ. మీ మమ్మీ హెల్ప్ తీసుకుని దుగ్గిరాల కంపెనీతో పార్ట్‌నర్‌షిప్ చేస్తే మా వాడు గొప్పవాడు అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు అది జరగదని తెలిసిపోయింది. ఒకప్పడు నువ్వు బంగారు గుడ్లు పెట్టే ఒక అందమైన రామచిలుకవి. కానీ ఇప్పుడు ఎటు వెళ్లాలో కాకి పిల్లవి, నిన్ను పెళ్లి చేసుకుంటే మాకేం వస్తుంది? అని ప్రశ్నిస్తుంది.

మీరు కోరుకున్నది మొత్తం వస్తుంది, కోట్ల ఆస్తితో పాటు మీరు కోరుకుంటున్న పరువు, పేరు అన్ని వస్తాయని చెబుతుంది రేఖ. మా అమ్మ చనిపోయినా తన ఆశయం మాత్రం చనిపోలేదు. మేం వేసిన ప్లాన్ ప్రకారం ఆ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తాన్ని అంతం చేశామని అంటుంది రేఖ. ఇంక కొంతమంది మిగిలే ఉన్నారని అంటాడు బాయ్‌ఫ్రెండ్. కొడుకు చచ్చి ఏడుస్తున్న తల్లి.. నడవలేక మంచానపడ్డ ఒక తండ్రి.. వాళ్ల చేతుల్లో నుంచి ఆస్తిని లాక్కుని, వాళ్లను కూడా పైకి పంపించేస్తే.. ఇక దుగ్గిరాల ఆస్తి మొత్తం నాదే అవుతుందని అంటుంది రేఖ. ఇదంతా చేయడానికి నాకొక బలం కావాలి అందుకే నీ దగ్గరికి వచ్చాను. నా పగకి సాయం చేస్తే నిన్ను అందనంత ఎత్తుకు తీసుకెళ్తానని అంటుంది రేఖ.

నేను, నా తమ్ముడు ఇన్నేళ్లు కలిసే ఉన్నాం.. వీడికి పెళ్లయితే వాడి భార్యతో పాటు కలిసే ఉండాలని అనుకున్నామని అంటుంది బాయ్‌ఫ్రెండ్ అక్క. నువ్వు మా ఇంటికి రావాలి? లేదా మేం మీ ఇంటికి రావాలి? నాకు పెళ్లయి భర్త కూడా ఉన్నాడు, రేపు పిల్లలు కూడా పుట్టొచ్చు మేమంతా మీ ఇంటికి రావడం బాగోదని చెబుతుంది. నాకెలాంటి అభ్యంతరం లేదు.. మీ తమ్ముడితో పెళ్లయని మరుక్షణం మీరంతా నా ఫ్యామిలీ అవుతారు. అక్కడ మీకు ఏ లోటు రానివ్వనని చెబుతుంది. కోట్ల ఆస్తితో పాటు నా తమ్ముడు నాతోనే ఉంటాడంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెబుంది బాయ్‌ఫ్రెండ్ అక్క. అయితే మీ అన్నకూతురిని ఏం చేస్తావని అడుగుతుంది. ఇది మా అన్నకి ప్రతిరూపం.. నాతో పాటు నా ఇంట్లోనే మహారాణిలా పెరుగుతుందని అంటుంది రేఖ. ఇప్పుడే, ఈ క్షణంలోనే పెళ్లి అయిపోవాలి.. అన్ని అక్కడ రెడీగా ఉన్నాయని చెబుతుంది రేఖ.

సుభాష్, అపర్ణలు ఇంట్లో కూర్చొని ఏడుస్తుంటారు. మొన్నటి వరకు ఇల్లు బృందావనంలా ఉండేది. కానీ ఇప్పుడు నాకు ఇది ఒక పాడుబడ్డ ఇల్లులా కనిపిస్తోంది, గొడవ పడటానికి ధాన్యలక్ష్మీ లేదు. తప్పు చేస్తే నిలదీయడానికి అత్తయ్య లేదు. కష్టం వస్తే చెప్పుకోవడానికి కోడలు లేదు, మనం చస్తే తలకొరివి పెట్టడానికి కొడుకు కూడా లేడు. అసలు మనం ఎందుకు బతికున్నాం, మనకంటూ ఎవరున్నారు? అని అపర్ణ అంటుండగా రేఖ తన భర్తతో కలిసి అడుగుపెడుతుంది. రేఖ ఆ ఇంట్లో అడుగుపెడుతుండగా ఆగమని కోప్పడుతుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X