Brahmamudi February 7th Episode:రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్.. పాప రహస్యం తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ
Photo Courtesy: JioHotstar
బిడ్డను ఎలా కాపాడుకోవాలి? ధర్మేంద్రపై ఎలా గెలవాలి? అంటూ కావ్య, రాజ్‌లు మాట్లాడుకుంటూ ఉంటారు. భార్య మీద ప్రేమతో ఆ మినిస్టర్ దారుణాలకు తెగబడుతున్నాడని కావ్య అంటుంది. భార్య కోసమే అలా చేస్తే.. పేగు తెంచిన మమకారం కోసం మనం ఇంకెంత చేయాలని అంటాడు రాజ్. పాప కోసం రోజూ తులసిని కావ్యని కలవడం, పాపకు దగ్గరవుతుండటం చూసిన ధర్మేంద్రకు టెన్షన్ మొదలవుతుంది. నిద్రలో కావ్య తన బిడ్డను ఎత్తుకున్నట్లుగా అనిపించడంతో ఉలిక్కిపడతాడు. ఇక తాను ఈ నరకాన్ని అనుభవించలేనని.. తులసికి నిజం చెప్పేయాలని అనుకుంటాడు. భార్య దగ్గరికి వెళ్లి మరోలా తను చేసిన పాపం గురించి చెబుతాడు.
తల్లి నుంచి బిడ్డను వేరు చేసిన ఎవ్వరైనా శిక్ష అనుభించాల్సిందేనని తులసి అంటుంది. ఆ తప్పు చేసింది మీరైనా సరే జైళ్లో వేయిస్తానని తులసి అనడంతో మంత్రి షాక్ అవుతాడు. వెంటనే రాజ్‌కు ఫోన్ చేసి కలవాలని చెబుతాడు. నీ బిడ్డను నీకు ఇవ్వలేను.. నా బాధను అర్ధం చేసుకోమని రాజ్‌ని వేడుకుంటాడు. అయినప్పటికీ రాజ్ ఏమాత్రం పట్టించుకోకుండ 24 గంటలు గడువు ఇస్తాడు. దాంతో ఏం చేయాలో తెలియక రుద్రాణి దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతాడు ధర్మేంద్ర. ఇకపై ఈ విషయాన్ని నేను హ్యాండిల్ చేస్తాను.. మీరు రెస్ట్ తీసుకోండని చెబుతుంది రుద్రాణి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక ఫిబ్రవరి 7వ తేదీ ఎపిసోడ్ 950లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
రాజ్ - కావ్యలను తాను హ్యాండిల్ చేస్తానని చెప్పిన రుద్రాణి నేరుగా ధాన్యలక్ష్మీకి ఫోన్ చేస్తుంది. ఇంకా నా మీద కోపం తగ్గలేదా అని అడుగుతుంది. కోపం తగ్గడానికి నువ్వు చేసిన దరిద్ర్యం అంతా ఇంతా కాదు. నిజానికి నిన్ను జైళ్లో పెట్టించాలని సీరియస్ అవుతుంది ధాన్యం. నీ జీవితానికి ఉపయోగపడే విషయం చెప్పడానికి ఫోన్ చేశానని అంటుంది రుద్రాణి. నాకు నీ సలహాలు, హెచ్చరికలు, జాగ్రత్తలు ఏం అవసరం లేదని ఫైర్ అవుతుంది ధాన్యం. నాకు వినే ఉద్దేశం కూడా లేదని అంటుంది. నీ కోడలి కడుపులో ఉన్న వారసుడి ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా వినిపించుకోవా అని రుద్రాణి అడగ్గా.. ధాన్యం షాక్ అవుతుంది.
ఆ రాజ్ కావ్యలు మినిస్టర్‌తో ఎందుకు శత్రుత్వం పెంచుకున్నారో కానీ ఆ మినిస్టర్ మాత్రం రాజ్ - కావ్యలు చేసిన తప్పు వల్ల మన కుటుంబం మీదే పగ పెంచుకున్నాడు. ఎప్పుడు ఎవరి మీద విరుచుకుపడతాడో? ఎవరి ప్రాణాలను తీస్తాడో ఎవ్వరికీ తెలియదు. మొన్న యాక్సిడెంట్ కూడా ఆ మినిస్టర్ చేయించాడని నా అనుమానం. మళ్లీ అలాంటి ప్రమాదం నీ కొడుక్కి, కోడలికి వచ్చిందనుకో.. నీ పరిస్ధితి ఏంటీ? ఆ రాజ్- కావ్యలు ఆ మినిస్టర్‌తో గొడవ పెట్టుకోకుండా నువ్వే ఆపలగవని చెప్పడంతో ధాన్యలక్ష్మీ షాక్ అవుతుంది. వెంటనే తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటుంది.
పాపను రేపు ఆసుపత్రికి తీసుకెళ్లాలని.. రేపే పాపకి ఆపరేషన్ చేస్తామన్నారని ఫ్యామిలీకి చెబుతాడు రాజ్. అంతా మంచే జరుగుతుందని దుగ్గిరాల ఫ్యామిలీ ధైర్యం చెబుతుంది. పాప ఈ ప్రమాదం నుంచి బయటపడుతుందో లేదోనని భయంగా ఉందని అంటుంది కావ్య. నువ్వు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ బిడ్డకు జన్మనిచ్చావు.. అలాంటి నీకు బిడ్డను దూరం చేయడని అంటుంది అపర్ణ. ఇంతలో ధాన్యలక్ష్మీ వచ్చి .. వీళ్లు చేసిన నిర్వాకం వల్లే భయపడుతున్నారు తప్పించి, పాపకు చేసే ఆపరేషన్ వల్ల కాదని అంటుంది ధాన్యలక్ష్మీ. దాంతో ఏం జరిగిందని కావ్య అడుగుతుంది.
చేసిన తప్పుని ఇద్దరూ కలిసి దాచారు.. ఇంట్లో మూడు యాక్సిడెంట్స్ తృటిలో తప్పిపోయాయి. వీళ్లిద్దరూ కలిసి వాడితో శత్రుత్వం పెట్టుకున్నారు. దాంతో వాడు మనింట్లో వాళ్లని చంపాలని అనుకున్నాడు. మళ్లీ వాడి జోలికెళ్తే ఈ కుటుంబాన్ని నాశనం చేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్లాడని అంటుంది ధాన్యం. అది వ్యాపార శత్రుత్వం కాదు.. ఇంకెదో ఉంది, అందుకే వాడు కక్ష కట్టాడని అంటుంది ధాన్యలక్ష్మీ. మాకు క్షమాపణలు చెప్పి ఈ ఇంటికి ఎలాంటి ప్రమాదం రానివ్వనని కావ్య చెప్పిందని గుర్తుచేస్తుంది.
ఈ కుటుంబం, నా కొడుకు- కోడలు ఏమైపోతారోనని భయంగా ఉందని అంటుంది ధాన్యలక్ష్మీ. వీళ్లు మనకి చెప్పిందొకటి, చేస్తోందొకటి.. వీళ్లు పదే పదే ఆ మినిస్టర్‌తో గొడవ పడుతూనే ఉన్నారు. ఇప్పుడు వాడు మనందరి మీద కక్షకట్టి తిరుగుతున్నాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనల్ని చంపాలని చూస్తున్నాడని చెబుతుంది ధాన్యలక్ష్మీ. వాళ్ల వల్ల ఈ కుటుంబానికి ప్రమాదం పొంచి లేదని రాజ్, కావ్యలను చెప్పమనండి అని నిలదీస్తుంది. వాడు నట్టింట్లో నిలబడి బెదిరిస్తుంటే మీరిద్దరూ ఏం చేశారు? ఈ ఇంట్లో ఏదైనా జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అని నిలదీస్తుంది. వాడి గురించి తెలిసి కూడా ఎందుకు పెట్టుకున్నారు? మా అందరికీ ఎందుకు అబద్ధం చెప్పారు? అని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. అందరూ చచ్చిపోతే మీరు, మీ బిడ్డ హాయిగా ఉందామని అనుకుంటున్నారా అనడంతో .. అసలు ఆ బిడ్డంటూ ఉంటే కదా మేం హాయిగా బతకడానికి అని రాజ్ నోరుజారడంతో అంతా షాక్ అవుతారు.
మా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ నా చేతుల్లో లేకపోవడం వల్లే ఆ మినిస్టర్‌తో శత్రుత్వం పెంచుకోవాల్సి వచ్చిందని కావ్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా నిజం చెబుతాడు రాజ్. ఆ మినిస్టర్ హాస్పిటల్‌లో నా బిడ్డను ఎత్తుకెళ్లిపోయాడు.. పుట్టగానే బిడ్డల్ని మార్చేశాడు. కళావతి ఇది నా బిడ్డ కాదని ముందు నుంచి చెబుతూనే ఉందని జరిగినదంతా చెబుతాడు రాజ్. వాడిని ఎదురించాలన్నా, చట్టప్రకారం వెళ్లాలన్నా వాడికి బలం ఉంది, పలుకుబడి ఉంది. మన దగ్గర వాడు పాపని మార్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అంటాడు రాజ్. అందరూ నన్ను కాదన్నా మీ అబ్బాయి నన్ను అర్ధం చేసుకున్నాడు. చట్టప్రకారం వెళ్లలేం కాబట్టి.. ఆ మినిస్టర్ భార్యకు మేం దగ్గరయ్యాం, తన భార్యకి నిజం తెలుస్తుందన్న భయంతో మనకి ప్రమాదం తలపెట్టాడని చెబుతుంది కావ్య. ఇదంతా తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకు ఈ నిజం చెప్పలేరని అంటుంది.
ఆ మినిస్టర్ ఏదో ఒకరోజు పాపని తీసుకొచ్చి ఇస్తాడని రాజ్ అంటాడు. తులసిగారి బిడ్డను ఆరోగ్యంగా ఆమెకు అప్పగిస్తానని చెబుతుంది కావ్య. దాంతో కావ్య గొప్పతనంపై దుగ్గిరాల ఫ్యామిలీ ప్రశంసలు కురిపిస్తుంది. కావ్యకు ధాన్యలక్ష్మీ కూడా క్షమాపణలు చెబుతుంది. అందరి మంచి కోసం మీరు అలా చేశారు ఇందులో మీ తప్పు లేదని అంటుంది కావ్య. ముందు పాపకి ఆపరేషన్ జరగాలి. ఇంట్లో జరిగిన విషయాన్ని వెంటనే రుద్రాణికి ఫోన్ చేసి చెబుతుంది రేఖ. నువ్వు ఒకటి ప్లాన్ చేస్తే ఇక్కడ ఇంకోకటి జరుగుతోందని మండిపడుతుంది. ఆ రాజ్- కావ్యలు నిజం చెప్పేశారని చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. గొడవ చేసిన ధాన్యం కూడా కావ్యకి క్షమాపణలు చెబుతుంది.
పాపను వెనక్కి తెచ్చుకున్నాకా.. అందరూ కలిసిపోతారు, హ్యాపీగా ఉంటారని రేఖ అంటుంది. ఇదంతా జరగాలంటే కావ్య దగ్గరున్న పాపకి ఆపరేషన్ జరగాలి, మినిస్టర్ దగ్గరున్న పాపని కావ్య వెనక్కి తెచ్చుకోవాలి.. ఇదంతా జరగడం అంత ఈజీ కాదని నేను చూసుకుంటానని అంటుంది రుద్రాణి. ఉదయాన్నే పాపను తీసుకుని ఆసుపత్రికి వస్తారు. పాపకి ఏం కాదు కదా? క్షేమంగా తిరిగొస్తుంది కదా? దీని ప్రాణం ఎంత? ఇంత చిన్నవయసులో తట్టుకుంటుందా? అని బాధపడుతుంది కావ్య. ఇంతలో డాక్టర్ వచ్చి పాపని ఇవ్వమని చెబుతుంది. ఈ పాపకు ఏం కాదు.. ఈ పరీక్ష పెట్టింది ఆ దేవుడే కాబట్టి, కావ్యని గెలిపించేది కూడా ఆయనే అని అంటుంది డాక్టర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











