Brahmamudi January 15th Episode: బిడ్డను చూసుకుని మురిసిపోయిన కావ్య.. రాజ్‌ని నిర్దోషిగా నిరూపించిన అప్పూ
Photo Courtesy: JioHotstar
పోలీస్ స్టేషన్‌లో ఓ కానిస్టేబుల్ నుంచి ఫోన్ అడుగుతాడు రాజ్. నా భార్య ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉంది.. ఆమెకు ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని అందుకే ఫోన్ అడిగినట్లు చెబుతాడు రాజ్. అతని పరిస్ధితి చూసి జాలీపడ్డ కానిస్టేబుల్ వెంటనే రాజ్‌కి ఫోన్ ఇస్తాడు. ఆసుపత్రిలో ఆపరేషన్ టైంకి కావ్య పక్కన ఉండాలంటే ఇప్పటి వరకు నేను నమ్ముకున్న నీతి, నిజాయితీలను వదిలేయాలని కళ్యాణ్‌తో చెబుతాడు రాజ్. తాను తప్పించుకోవాలని అనుకుంటున్నానని, నేను చెప్పినట్లు చేయమని ప్లాన్ చెబుతాడు రాజ్. అన్నయ్య చెప్పినట్లే వాళ్ల ఫ్రెండ్‌కి ఫోన్ చేసి ఓ కానిస్టేబుల్‌కు క్యారియర్ పంపిస్తాడు. ఆ వెంటనే కానిస్టేబుల్ క్యారియర్‌లో బాంబు ఉందని, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని పోలీసులకు ఫోన్ చేసి చెబుతాడు కళ్యాణ్. దాంతో పోలీసులు, ఖైదీలు భయంతో బయటకు పరుగులు తీస్తారు. ఇదే అదనుగా కళ్యాణ్ బైక్ మీద రాజ్ తప్పించుకుని హాస్పిటల్‌కు బయల్దేరతాడు.
పోలీస్ స్టేషన్‌లో బాంబు లేదని తేలడంతో పాటు రాజ్ తప్పించుకున్నట్లు తెలుసుకున్న ఎస్ఐ వెంటనే అప్పూకి ఫోన్ చేసి విషయం చెప్పి రాజ్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఆర్డర్స్ వేస్తాడు. నేను ఈ పని చేయలేనని, మీరే వచ్చి అరెస్ట్ చేయమని అప్పూ ఎంత బతిమలాడుతున్నా ఎస్ఐ వినిపించుకోడు. కావ్య కోసం రాజ్ లోపలికి వెళ్తుండగా అప్పూ వచ్చి వెంటనే లొంగిపోవాలని చెబుతుంది. దాంతో దుగ్గిరాల ఫ్యామిలీ అంతా అప్పూపై మండిపడి రాజ్‌కు రక్షణగా అడ్డుగా నిలుస్తుంది. ఇచ్చిన మాట ప్రకారం రాజ్ తన కోసం రావడంతో కావ్య సంతోషిస్తుంది. వెంటనే ఆపరేషన్ చేసుకోవడానికి ఓకే చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 15వ తేదీ ఎపిసోడ్ 930లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
కావ్య, రాజ్‌లు మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ రావడంతో మిమ్మల్ని ఒక నేరస్తుడిగా రమ్మనలేదని అంటుంది. నా భర్త నేరస్తుడు కాదు.. ఆయన ఏ తప్పూ చేయలేదని చెబుతుంది కావ్య. నీ భర్తను ఇక్కడ పెట్టుకుని ఆపరేషన్ చేయలేను, తప్పు చేసి తప్పించుకుని వచ్చిన ఓ క్రిమినల్ ఇలా ఆపరేషన్ థియేటర్‌లో ఉంటే మా హాస్పిటల్‌కు నాకు చెడ్డ పేరు వస్తుందని అంటుంది డాక్టర్. నా భర్త నన్ను వదిలిపెట్టి వెళ్లిపోతే నేను తట్టుకోలేనని కావ్య బాధపడుతుంది. ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉంటే మా వృత్తికే ద్రోహం చేసినట్లు అవుతుందని మండిపడుతుంది డాక్టర్. దాంతో నా భార్య ప్రాణాల్ని నిలబెట్టండి.. నా భార్య పరిస్థితి ఏంటో మీకు తప్పించి ఎవరికీ తెలియదు. నా బిడ్డను బతికించమని రాజ్ బతిమలాడతాడు.
బయట పోలీసులు, లోపల మీరు.. మీకు విషయం అర్ధమవుతుందా? అని కార్తీక్‌పై మండిపడుతుంది డాక్టర్. వాళ్లు లోపలికి రాలేరు.. నా భార్యకు డెలివరీ అయి, బిడ్డను చూసుకుని వెళ్లిపోతానని బతిమలాడతాడు రాజ్. కావ్య కూడా అడగటంతో డాక్టర్ కాదనలేకపోతుంది. ఆమె మాటను కాదనలేక డాక్టర్ కూడా సరేనని ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు.. దుగ్గిరాల ఫ్యామిలీని ఒప్పించి రాజ్‌ను అరెస్ట్ చేయాలని అనుకుంటుంది అప్పూ. నీకు డ్యూటీ పిచ్చి పట్టింది.. సొంత కుటుంబానికి ద్రోహం చేస్తావా? అని మండిపడుతుంది ఇందిర. డ్యూటీ అంటే పిచ్చి కాదు.. మా అక్క అంటే ప్రేమ, బావంటే అభిమానం.. బావ ఇప్పటికే చేయని తప్పుకు దోషిలా మారాడు, ఇప్పుడు ఇంకో తప్పుకి బావ ఇరుక్కుపోవద్దని అరెస్ట్ చేసి స్టేషన్‌లో అప్పగించాలని అనుకుంటున్నానని చెబుతుంది అప్పూ
నా కొడుకుని అరెస్ట్ చేసి ఆదర్శ పోలీస్ అనిపించుకోవాలని చూస్తున్నావా? మరి చావు బతుకుల మధ్య ఉన్న కావ్య పరిస్ధితి ఏంటీ? అని అపర్ణ నిలదీస్తుంది. అప్పూ ఎలాంటిదో మీకు తెలుసు.. అయినా అడ్డుపడుతోంది అంటే అప్పూకి ఎంత ప్రెజర్ ఉంటుందో అర్ధం చేసుకోండి అని కళ్యాణ్ నచ్చచెప్పాలని చూస్తాడు. రాజ్ కోసం కావ్య కళ్లలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తుంటే.. రాజ్‌ని అరెస్ట్ చేస్తానని చెబుతుందా అంటూ ధాన్యలక్ష్మీ సీరియస్ అవుతుంది. ఒక్కసారి నా వైపు నుంచి కూడా ఆలోచించండి.. నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నా కూడా నాకు ఆర్డర్స్ వచ్చాయంటే పరిస్ధితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోమని చెబుతుంది అప్పూ. బావను అడ్డుకున్నప్పుడు నేను ఎంత బాధపడుతున్నానో మీకు తెలియదని అంటుంది.
నీకు రాజ్ మీద అంత అభిమానం ఉంటే.. వాడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి, నువ్వు పోలీస్ కావడానికి ముందే ఈ ఇంటి కోడలివి, కావ్యకి చెల్లెలివి. రాజ్ గురించి తెలిసి కూడా వాడిని అడ్డుకోవాలని చూస్తున్నావని అప్పూని దుగ్గిరాల ఫ్యామిలీ నానామాటలు అంటుంది. ఇంతలో కానిస్టేబుల్స్ వచ్చి మీ ఆలోచన ఏంటో? మీ నిర్ణయం ఏంటో? తెలియడం లేదని.. రాజ్ గారు బయటకు రాగానే అరెస్ట్ చేసి తీసుకెళ్తామని చెబుతారు కానిస్టేబుల్స్. నా కుటుంబం ముందు నేను దోషిని అయ్యాను. కానీ నా డ్యూటీ నేను చేయాల్సిందేనని అందుకే మా బావగారు బయటకు రాగానే అరెస్ట్ చేయమని చెబుతుంది అప్పూ. ఆ మాటలతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. బావ శాశ్వతంగా మన ఇంట్లో ఉండాలంటే ఆయన ఈరోజు స్టేషన్‌లో ఉండాలని చెబుతుంది అప్పూ.
ఏం చేయాలని అనుకుంటున్నావ్... ఎలా అన్నయ్యని బయటకు తీసుకొస్తావని అప్పూని అడుగుతాడు కళ్యాణ్. మనం బెయిల్ కోసం కాకుండా అసలు సమస్య ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి మొదలుపెట్టాలని చెబుతుంది అప్పూ. మరోవైపు.. ఆసుపత్రిలో కావ్యకి, మినిస్టర్ భార్య తులసి డెలివరీలకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు డాక్టర్స్. అప్పూ నేరుగా స్టేషన్‌కి వెళ్లి.. రాజ్ గారి కేసుకు సంబంధించిన ఫైల్ ఎక్కడుందని అడుగుతుంది. అలాగే వెంటనే శాండీ సెల్‌లోకి వెళ్లి... రాజ్ గారికి నువ్వు నిజంగానే దొంగ బంగారం అమ్మావా? అని చితకబాదుతుంది అప్పూ. ఇంతలో ఎస్ఐ వచ్చి అప్పూపై సీరియస్ అవుతాడు. మీ బావ తప్పు చేశాడని సాక్ష్యాధారాలు బలంగా ఉన్నాయి.. అధికారం ఉంది కదా అని దానిని దుర్వినియోగం చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. నువ్వు ఆఫ్ డ్యూటీలో ఉన్నాడని ఎస్ఐ చెప్పగా.. అప్పూ సీరియస్ అవుతుంది.
మా బావని అరెస్ట్ చేయమని చెప్పినప్పుడు కూడా నేను ఆఫ్ డ్యూటీలోనే ఉన్నానని చెబుతుంది అప్పూ. నువ్వు దోషిని కొట్టి వాడితో అబద్ధం చెప్పించి మీ బావని కాపాడుకోవాలని చూస్తున్నావని మండిపడతాడు ఎస్ఐ. సాక్ష్యాలతోనే నేను నిజం బయటపెడతానని చెప్పి ఎఫ్ఐఆర్ చదివి వినిపిస్తుంది అప్పూ. ఈ శాండీగాడు మా బావని కలిసింది జనవరి 6న.. మా బావకి దొంగ బంగారం అమ్మింది జనవరి 10న అని చెప్పాడు కదా అని అడుగుతుంది. ఆ రోజు మా బావ అసలు ఆఫీస్‌కే వెళ్లలేదని అప్పూ చెప్పడంతో ఎస్ఐ, శాండీ షాక్ అవుతారు. నాకు, మా అక్కకి శ్రీమంతం జరిగింది.. మరుసటి రోజు వరకు మా బావ ఇంట్లోనే ఉన్నాడని అంటుంది అప్పూ. అలాగే శ్రీమంతం వీడియోలు, ఫోటోలను కళ్యాణ్ చూపించడంతో ఎస్ఐ రగిలిపోతాడు. నిజం వీడి నోటితోనే చెప్పించమని అప్పూకి పర్మిషన్ ఇస్తాడు.
దాంతో రాహుల్ తనకు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటాడు శాండీ. రాహుల్ పేరు బయటకు రాకుండా జాగ్రత్తపడతాడు. కావాలనే తప్పుడు కేసులో రాజ్ గారిని ఇరికించాలని అనుకున్నాను. రాజ్‌గారిని ఒప్పించి దొంగ బంగారం సప్లయ్ చేసి బాగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాను, కానీ రాజ్‌గారు నా ప్రపోజల్‌కు ఒప్పుకోకుండా నాపై చేయి చేసుకున్నాడు. దాంతో రాజ్‌గారిని, ఆయన కంపెనీ పరువు తీయాలని ఇదంతా చేశానని అంటాడు. మరి మా బావగారి కారులో దొంగ బంగారం పెట్టింది ఎవరు? అని అప్పూ అడగ్గా.. అది కూడా నేనే చేశానని అంటాడు శాండీ. ముందు వీడిని జడ్జిగారి ముందుకు తీసుకెళ్లి లెటర్ తీసుకుంటే రాజ్ గారు సమస్యల నుంచి బయటపడినట్లేనని చెబుతాడు ఎస్ఐ.
కావ్యకు డెలివరీ అయి ఆడపిల్ల పుట్టడంతో రాజ్ సంతోషిస్తాడు. పాప బరువు తక్కువగా పుట్టడంతో కొన్నిరోజులు ఇంక్యూబెటర్‌లో పెట్టాలని డాక్టర్ చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. ఏం పర్లేదని డాక్టర్ చెబుతుంది. నా బిడ్డను ముట్టుకోవాలని ఉందని కావ్య అడగ్గా.. పాపకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తుంది డాక్టర్. అయితే రాజ్ బతిమలాడటంతో కావ్యకి బిడ్డను ఇస్తుంది డాక్టర్. పాపను ముట్టుకోగానే కావ్య మురిసిపోతుంది. కావ్య గారికి పాప పుట్టిందని తెలుసుకున్న దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషిస్తుంది. మరోవైపు... మినిస్టర్ భార్యకు డెలివరీ అయి పాప పుట్టినా ఆమె కళ్లు తెరవకపోవడంతో డాక్టర్లు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










