Brahmamudi January 22nd Episode:పాప డీఎన్ఏ టెస్ట్‌కి కావ్య రెడీ..రాజ్ ప్లాన్ తిప్పికొట్టేలా రుద్రాణి స్కెచ్
Photo Courtesy: JioHotstar
మినిస్టర్ ధర్మేంద్ర అతని భార్య తులసిలు పాపను చూసుకుంటూ మురిసిపోతారు. ఇంతలో రుద్రాణి వచ్చి... కావ్య సామాన్యురాలు కాదని, దానికి అనుమానం మొదలైంది అంటే అంతుచూసే వరకు వదిలిపెట్టదని జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తుంది. దుగ్గిరాల వారింట్లో ఉన్న నా కొడుకు, కూతురి ద్వారా అక్కడ జరిగేది మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తానని రుద్రాణి చెప్పడంతో ధర్మేంద్ర వణికిపోతాడు. పాప గుక్కపట్టి ఏడుస్తుండటంతో ఇందిర, అపర్ణ, ధాన్యలక్ష్మీలు ఎంత సముదాయించాలని చూసినా చిన్నారి ఏడుపు ఆపదు. ఇంతా జరుగుతున్నా కావ్య గదిలో నుంచి బయటకు రాపోవడంతో రాజ్ బాధపడతాడు. ఇంతలో కావ్య వచ్చి పాపకు పాలు పట్టడంతో అంతా సంతోషిస్తారు.
ఇదంతా చూసిన రేఖ.. రాహుల్ దగ్గరికి వెళ్లి పాపకు పాలు పట్టిందంటే, ఆ బిడ్డను కావ్య ఒప్పుకున్నట్లేనని నా కలల కోట కూలిపోయిందని అంటుంది. కావ్య క్యారెక్టర్‌ని నువ్వు తక్కువ అంచనా వేశావు.. ప్రేమ, మమకారం కావ్య బ్లడ్‌లోనే ఉన్నాయి. ఈ పాపే కాదు.. ఏ పాప ఏడ్చినా కావ్య అలాగే పాలు పడుతుందని చెబుతాడు. ఆ బిడ్డను కావ్య ఒప్పుకోదు.. ఇంతలో ఆ పాప హెల్త్ క్షీణించి చనిపోతుంది. ఇంటికి వారసుడిని ఇవ్వలేక.. రాజ్‌ని అలా చూడలేక కావ్య నలిగిపోతుంది. ఖచ్చితంగా రాజ్‌ని నీకు ఇచ్చి పెళ్లి చేయమని పోరాడుతుందని రాహుల్ చెప్పడంతో రేఖ సంతోషిస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 22వ తేదీ ఎపిసోడ్ 936లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బిడ్డను ఆడిస్తూ కావ్య గార్డెన్‌లో ఉండటంతో అంతా షాక్ అవుతారు. మనం మన కోణంలోనే ఆలోచిస్తున్నాం.. కానీ కావ్య ఎందుకు అలా చెబుతుందో ఒకసారి ఆలోచించాలని అపర్ణ, ఇందిరలు రాజ్‌తో చెబుతారు. నా బిడ్డకు ఈ లోకాన్ని చూపించడం కళావతి కల. ఆ ఆనందాన్ని అనుభవించకుండా, అసలు ఆ బిడ్డే నాది కాదు అంటుంది అంటే నేను ఆలోచించకుండా ఉంటానా? నాకు కూడా కళావతి మాటల్లో నిజం ఉందనే అనిపిస్తోంది అని అంటాడు రాజ్. మా బిడ్డను మార్చేశారు.. ఈ పాప మా పాప కాదు అని డాక్టర్‌తో వాదించడానికి సాక్ష్యాధారం ఉండాలి కదా అని అంటాడు రాజ్. ధైర్యం చేసినా అడిగినా డాక్టర్లు ఒప్పుకోరు.. చాలా పెద్ద ఇష్యూ అవుతుందని అంటాడు.
అక్క పడుతున్న బాధకంటే అది చాలా చిన్నదని అంటుంది అప్పూ. అక్క వాదనని, మన మాటని డాక్టర్లు నమ్మాలంటే చట్టప్రకారం పాపకి డీఎన్ఏ టెస్ట్ చేయిద్దామని అంటుంది అప్పూ. ఆ మాటలు విన్న రాహుల్, రేఖలు షాక్ అవుతారు. డీఎన్ఏ టెస్ట్ లేకుండా అక్క మీద హాస్పిటల్‌లో కేసు వేయించలేం.. కోర్ట్ కూడా ఖచ్చితంగా సాక్ష్యాధారం అడుగుతుందని చెబుతుంది అప్పూ. మనమే డీఎన్ఏ టెస్ట్‌కి వెళితే మంచిది. మనం కేసు వేయడానికి సాక్ష్యంగా ఉంటుంది, ఒకవేళ శాంపిల్స్ మ్యాచ్ అయితే అక్కే ఈ పాప తన బిడ్డ అని నమ్ముతుందని అంటుంది అప్పూ. వెంటనే డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్లడమే మంచిదని దుగ్గిరాల కుటుంబమంతా చెబుతుంది. ముందు ఈ టెస్ట్ చేయించడానికి కావ్యని ఒప్పంచాలి, ఆ బాధ్యత నీదేనని రాజ్‌కి చెబుతుంది స్వప్న.
కుటుంబ సభ్యుల మాట మేరకు కావ్యను ఒప్పించడానికి వస్తాడు రాజ్. నువ్వు అంటున్న మాటలు నీ మనసులో నుంచి ఊరికే రాలేదు అనిపిస్తోంది అంటాడు. మీ భార్య మాటల మీద నమ్మకం ఉండి మాట్లాడుతున్నారా? లేక ఇంట్లో వాళ్ల బాధ భరించలేక నన్ను ఒప్పించడానికి వచ్చారా? అని అడుగుతుంది కావ్య. ప్రతిమాటను ఎందుకు వేరే కోణంలో ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తాడు రాజ్. మనకి తెలియకుండా పెద్ద నష్టం జరిగింది.. నా బాధ మీకు అనుమానంగా కనిపిస్తోందని అంటుంది కావ్య. నాది అనుమానం కాదు.. అక్షర సత్యం అని చెబుతుంది. దీని వెనుక ఉన్న నిజం నిగ్గు తేల్చడానికి, తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను అంటాడు రాజ్.
ఈ బిడ్డ మన బిడ్డ కాదని నిరూపించడానికి ఏం కావాలన్నా చేస్తానని కావ్య అడగ్గా.. డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అవుతుంది. ఒక కన్నతల్లి నా బిడ్డ నా ఒడిలో లేదు... పరాయిబిడ్డ నా దగ్గర ఉందని చెబితే ఎవరు నమ్మరా? అని అంటుంది కావ్య. నీ మీద మా అందరికీ నమ్మకం ఉంది.. కానీ కోర్టులకు కావాల్సింది సాక్ష్యం.. అందుకే డీఎన్ఏ టెస్ట్ చేయించాలని అంటాడు రాజ్. నా మాటల మీద మీకు నమ్మకం లేదని కావ్య బాధపడుతుంది. ఒకతల్లి గుండెచాటు ఆవేదన అర్ధం కావడం లేదా? అని ప్రశ్నిస్తుంది. డాక్టర్లను నిలదీయాలంటే సాక్ష్యం కావాలి.. అప్పుడే నీ ఆరోపణ నిజమవుతుందని అంటాడు రాజ్. దాంతో కావ్య డీఎన్ఏ టెస్ట్‌కి సరేనని చెబుతుంది.
కావ్య డీఎన్ఏ టెస్ట్‌కి వెళ్తున్నట్లు రుద్రాణి చెప్పగానే మినిస్టర్ ధర్మేంద్ర షాక్ అవుతాడు. బిడ్డల్ని మార్చాం కానీ, ఆ ఫ్యామిలీని మాత్రం నమ్మించలేకపోతున్నామని అంటాడు ధర్మేంద్ర. ఆ కావ్య లాగా ఈ బిడ్డ నా పాప కాదని మీ ఆవిడ కనుక గుర్తుపట్టుంటే కథ వేరేలా ఉండేదని రుద్రాణి అంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమ్ చాలు... మళ్లీ కొత్త టెన్షన్ వద్దు అంటాడు ధర్మేంద్ర. డీఎన్ఏ టెస్ట్ కారణంగా కావ్యకు తన దగ్గర ఉన్న బిడ్డ.. తన కన్నకూతురు కాదని తెలిసిపోతుంది. మీ హాస్పిటల్‌లోనే ఏదో తప్పు జరిగిందని తెలుస్తుంది. నిజం తెలిస్తే మీ భార్య తట్టుకోగలదా? తనకు పుట్టిన పాప త్వరలోనే చనిపోతుందని తెలిస్తే తను తట్టుకోగలదా? అని రుద్రాణి నిలదీస్తుంది. నేను ఇదంతా చేసింది నా భార్య కోసమే.. తన కోసం ఏమైనా చేస్తానని చెబుతాడు మినిస్టర్. మీ భార్య మీద మీకున్న ప్రేమ.. ఈ కుటుంబాన్ని నాశనం చేయాలనే నా పగ గెలవాలంటే, మీరు వాళ్లని ఆపి తీరాలని చెబుతుంది రుద్రాణి.
ఉదయాన్నే డాక్టర్ వచ్చి కావ్య దగ్గర బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటాడు. డీఎన్ఏ టెస్ట్‌కి ఒప్పుకుంది మీ కోసం, మన కుటుంబం కోసం అని రాజ్‌తో కావ్య అంటుంది. రిపోర్ట్స్ వచ్చాకైనా నా మాటల్ని నమ్మితే చాలు. డీఎన్ఏ టెస్ట్ ఎలా వచ్చినా సరే కట్టుబడి ఉంటావా? అని రాజ్ అడగ్గా... ఖచ్చితంగా ఆ పాపకి, నాకు ఏ సంబంధం లేదని తేలిపోతుంది అని అంటుంది కావ్య. ఈ పాప మన పాప కాదని రుజువైతే, నీతో పాటే నేను కూడా మన బిడ్డ కోసం పోరాడతాను అని చెబుతాడు రాజ్. డీఎన్ఏ టెస్ట్ కనుక మ్యాచ్ అయితే నీలో అనుమానం వదిలేయాలి, అన్నింటినీ మరిచిపోవాలని అంటాడు రాజ్. రిపోర్ట్స్ అన్నీ నేను అనుకున్నట్లుగానే వస్తాయని కావ్య బలంగా చెబుతుంది.
కావ్య పరిస్ధితి తలచుకుని అపర్ణ, సుభాష్‌లు బాధపడతారు. ఒకప్పుడు దానిని మనం అర్ధం చేసుకోలేదు, ఎన్నో రకాలుగా బాధలు పెట్టాం.. కానీ ఎంతో ఓపికతో అన్ని భరించి మన ప్రేమను సాధించింది. బిడ్డ నిలుస్తుందా? లేదా అన్న పరిస్ధితులను దాటుకుని వారసురాలిని ఇచ్చిందని మనమంతా పొంగిపోయే లోపు ఇలా జరిగిందని బాధపడుతుంది అపర్ణ. బిడ్డ పుట్టే వరకు ఒక బాధ.. ఆ బిడ్డ తన బిడ్డ కాదని కావ్య బలంగా చెప్పడం ఏంటీ అని ప్రశ్నిస్తుంది. కావ్య బాధ కొట్టేసేలా లేదని, అన్ని కష్టాలు తొలగిపోయి మంచి రోజులు వస్తాయని అంటాడు సుభాష్. మనందరీ సంతోషం ఆ డీఎన్ఏ టెస్ట్ మీదే ఆధారపడి ఉంది. డీఎన్ఏ టెస్ట్‌లో ఆ పాప.. కావ్య కూతురేనని వస్తే పర్లేదని చెబుతుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










