Brahmamudi January 24th Episode: కన్నబిడ్డ కోసం కావ్య విలవిల.. ధర్మేంద్ర క్రూరత్వానికి డాక్టర్ చక్రవర్తి బలి
Photo Courtesy: JioHotstar
పాప డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ ఎలా వచ్చాయోనని దుగ్గిరాల ఫ్యామిలీ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఇంతలో రిపోర్ట్స్ రావడంతో దానిని చూడగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ పాప మా బిడ్డేనని రిపోర్ట్స్‌లో వచ్చిందని చెప్పగానే దుగ్గిరాల ఫ్యామిలీ, కావ్యలు షాక్ అవుతారు. కన్నతల్లిని నా మాటను కాదని ఈ చిత్తు కాగితాలను నమ్ముతారా? అని మండిపడుతుంది కావ్య. నా బిడ్డను నేనే వెతికి తెచ్చుకుంటాను.. నాకు ఎవ్వరి సాయం అక్కర్లేదని కావ్య చెప్పడంతో దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్‌ని మార్చేసి కావ్య ప్లాన్ తిప్పికొట్టడంతో ధర్మేంద్ర, రుద్రాణిలు సంబరాలు చేసుకుంటారు. ఇక ఇండియాలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించుకున్నా.. ఒకేలా రిపోర్ట్ వస్తుందని రుద్రాణికి చెబుతాడు మినిస్టర్. మాకు ఎంతో సాయం చేసిన మీకు ఏదో ఒకటి ఇస్తానంటాడు. నాకు కావాల్సింది నేనే అడిగి తీసుకుంటానని రుద్రాణి చెబుతుంది. ఇంట్లో నుంచి బయటకు వస్తున్న రుద్రాణిని చూసి ఆమె ఎవరు అని ధర్మేంద్రను అడుగుతుంది తులసి. డీఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినా కావ్య తన పట్టుదల వదిలిపెట్టకపోవడంతో భార్యపై కోప్పడతాడు రాజ్. దాంతో తన సమస్యకు పరిష్కారం చెప్పాల్సిందిగా కృష్ణుడి విగ్రహం ముందు కావ్య ఏడుస్తుంది. ఇంతలో పాప నోటి వెంట నురగ రావడంతో కావ్య షాక్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 24వ తేదీ ఎపిసోడ్ 938లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పాప నోట్లో నుంచి నురగలు రావడం, శరీరం రంగు మారుతుండటంతో కావ్య కంగారుపడుతుంది. వెంటనే విషయం దుగ్గిరాల ఫ్యామిలీకి చెప్పడంతో అంతా కంగారుపడతారు. కావ్య, రాజ్‌లు పరుగు పరుగున ఆసుపత్రికి వస్తారు. పాపని చూసిన డాక్టర్ చక్రవర్తి .. పాప శరీరం రంగు ఇలా మారకూడదని వెంటనే టెస్టులు చేయాలని చెప్పి ల్యాబ్‌కు తీసుకెళ్తాడు. పాపని నేనేం చేయలేదు.. ఉన్నట్లుండి ఇలా అయిపోయిందని కావ్య అనడంతో రాజ్ ఆమెను ఓదారుస్తాడు. నీకు పాప నచ్చకపోయినా అలాంటి పనులు చేసేదానివి కాదని నాకు తెలుసని అంటాడు రాజ్. పాపకి టెస్టులు చేసిన డాక్టర్ చక్రవర్తి వచ్చి ట్రీట్‌మెంట్ చేశాం.. మరే ప్రాబ్లం లేదని చెబుతాడు.
ఏ తల్లి కన్నబిడ్డో నా చేతుల్లో నీకు ఈ పరిస్ధితి వచ్చింది.. నిన్ను ఎంతో అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన నా మనసు అంటూ పాపని చూడగానే బాధపడుతుంది కావ్య. ఈ పాప తన కన్నతల్లి ఒడిలో ఉండుంటే ఈ పరిస్ధితి వచ్చేది కాదని రాజ్‌తో అంటుంది కావ్య. పాప రిపోర్ట్స్ రావడంతో అది చూసిన డాక్టర్ చక్రవర్తి షాక్ అవుతాడు. ఈ రిపోర్ట్స్ ఆ పాపవేనా? అని అడుగుతాడు. ఇంతలో ధర్మేంద్ర తనతో బిడ్డల్ని మార్చమని అడిగిన మాటలు గుర్తుచేసుకుంటాడు డాక్టర్ చక్రవర్తి. అనారోగ్యంతో ఉన్న మీ పాపని తీసుకెళ్లి మరో తల్లికిస్తే.. ఆ తర్వాత ఆ పాప చనిపోతే ఆ తల్లి పరిస్ధితి ఏంటీ? అని చక్రవర్తి నిలదీశాడు.
అందరు పేషెంట్స్‌ని సమానంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే.. నేను నా వృత్తికి ద్రోహం చేయలేనని అంటాడు చక్రవర్తి. ఇప్పుడే వెళ్లి మీ వైఫ్‌కి చెప్పాల్సిన విధంగా చెబితే ఆమె వింటారని చెబుతాడు. ఆ ఆసుపత్రిలో ఈ నిజం ఇంకా ఎంత మందికి తెలుసు.. అని ధర్మేంద్ర అడగ్గా నాకు, మన హెడ్ నర్స్ నీలవేణికి మాత్రమే తెలుసు అని చెబుతాడు చక్రవర్తి. ఈ మాటలన్నీ గుర్తురావడంతో డాక్టర్ చక్రవర్తి రగిలిపోతాడు. ఎవ్వరికి చెప్పనని నా దగ్గర మాట తీసుకుని ఎవ్వరికీ తెలియకుండా బిడ్డను మార్చేశాడు.... చాలా పెద్ద తప్పుచేశాడు అని తాడోపేడో తేల్చుకుంటానని ధర్మేంద్ర దగ్గరికి బయల్దేరతాడు డాక్టర్ చక్రవర్తి. ఇంతలో కావ్య, రాజ్ ఎదురుకావడంతో పాపకి ఎలా ఉందని అడుగుతారు. ఇంకా కొన్ని రిపోర్ట్స్ రావాల్సి ఉందని.. అవి రాగానే మీకు వివరంగా చెబుతానని వెళ్లిపోతాడు డాక్టర్ చక్రవర్తి.
ధర్మేంద్ర ఇంటికొచ్చిన రుద్రాణిని మీరు ఎవరు? మీరు మాకు చేసిన సాయం ఏంటీ? అని అడుగుతుంది తులసి. మీ ఆయన ఓ కేసు విషయంలో కోర్టు వరకు వెళ్లాల్సి రావడంతో నేను చిన్న సాయం చేసి దానిని అడ్డుకున్నానని కవర్ చేస్తుంది రుద్రాణి. ఇంతలో డాక్టర్ ఆవేశంగా ఇంటికి రావడం చూసిన ధర్మేంద్ర.. తులసిని లోపలికి పంపించేస్తాడు. కావ్యగారి బిడ్డను ఎందుకు మార్చేశారని చక్రవర్తి మండిపడతాడు. నిజం చెప్పి వాళ్ల పాపని వాళ్లకు అప్పగించండి.. లేదంటే నేనే మీ వైఫ్‌కి నిజం చెప్పేస్తానని బెదిరిస్తాడు చక్రవర్తి. నీకు ఎంత కావాలో చెబితే ఇచ్చేస్తానని ధర్మేంద్ర ఆఫర్ ఇవ్వగా.. నేను డబ్బుకు అమ్ముడుపోను, నా వృత్తికి నేను ద్రోహం చేయనని అంటాడు చక్రవర్తి. నేను ఇప్పుడే వెళ్లి రాజ్, కావ్యలకు జరిగింది మొత్తం చెబుతానని చక్రవర్తి వెళ్తుండగా ధర్మేంద్ర తన మనుషులతో డాక్టర్‌ని కొట్టించి కిడ్నాప్ చేయిస్తాడు.
వీడిని కిడ్నాప్ చేయించి నోరు మూయించావు బాగానే ఉంది.. మరి ఆసుపత్రిలో రాజ్, కావ్యల పరిస్ధితి ఏంటీ? వాళ్లని ఎలా ఆపుతావని అడుగుతుంది రుద్రాణి. మనకు ఆసుపత్రిలో హెల్ప్ చేసిన హెడ్ నర్స్ నీలవేణి చూసుకుంటుందని అంటాడు ధర్మేంద్ర. వెంటనే ఆమెకు ఫోన్ చేసి కొన్నాళ్లు చక్రవర్తి ఆసుపత్రికి రాడు.. నేను చెప్పినట్లు అక్కడివాళ్లని నమ్మించమని చెబుతాడు. రిపోర్ట్స్ రాకపోవడంతో రాజ్, కావ్యలు కంగారుపడతారు. వెంటనే ధర్మేంద్ర చెప్పినట్లు లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్లి డీన్ గారు వేరే పని మీద బయటకు వెళ్లారు.. ఈరోజు పేషెంట్స్‌ని మిమ్మల్ని చూడమన్నారు అని చెప్పి పాప హెల్త్ రిపోర్ట్స్ మరో డాక్టర్‌కి ఇస్తుంది నీలవేణి.
నీ మనసు కాస్త కుదుటపడిందా? అంతా ఓకేనా అని కావ్యని అడుగుతుంది డాక్టర్. రాజ్, కావ్యల పాపకి హెల్త్ బాలేదని తెలుసుకున్న డాక్టర్ అనూరాధ షాక్ అవుతుంది. ముక్కులో నుంచి నోట్లో నుంచి నురగలు వచ్చాయి.. పాప బాడీ మొత్తం వేరే కలర్‌లోకి మారిపోయింది. పాపకి ఎందుకు అలా అయ్యిందని రాజ్ అడుగుతాడు. ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.. కంగారుపడకుండా నేను చెప్పేది కొంచెం ధైర్యం తెచ్చుకుని వినమని అంటుంది డాక్టర్. పాప పుట్టినప్పుడు చాలా హెల్దీగానే ఉంది.. కానీ ఇంతలోనే ఇలా ఎలా జరిగిందో అర్ధం కావడం లేదు అంటుంది డాక్టర్. పాపకి హైపో ప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉందని చెబుతుంది డాక్టర్ అనూరాధ. ఆ మాటలు వినగానే రాజ్, కావ్యలు షాక్ అవుతారు. ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్న పిల్లల గుండెలోని ఎడమ వైపు భాగం చాలా వీక్‌గా ఉంటుంది. బ్లడ్ పంపింగ్ సరిగా జరగదు, ఊపిరి అందదు.. పిల్లలు చాలా ఇబ్బందిపడి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోతారు. దీనికి ట్రీట్‌మెంట్ లేదా అని రాజ్ అడగ్గా.. ఆపరేషన్ చేయాలని చెబుతుంది డాక్టర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











