Brahmamudi January 5th Episode: రుద్రాణి ప్లాన్ పసిగట్టిన కనకం.. అప్పూకి ధాన్యలక్ష్మీ క్షమాపణలు
Photo Courtesy: JioHotstar
కావ్య, అప్పూల కోసం ఏర్పాటు చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమం సరదాగా గడిచిపోతుంది. రాజ్ బావతో కలిసి డ్యాన్స్ చేసిన విషయాన్ని తలచుకుని రేఖ మురిసిపోతుంది. ఇంతలో రాజ్ కారు తాళాలు తీసుకొని రాహుల్ వచ్చి.. వాడి కారులో దొంగ బంగారం పెట్టి జైలుకు పంపిస్తానని చెబుతాడు. ఆ మాటలు విన్న రేఖ షాక్ అవ్వగా.. అలా చేయకపోతే రాజ్ మన కంట్రోల్‌లోకి రాడని చెబుతుంది రుద్రాణి. రాజ్‌ని నేనే జైళ్లో నుంచి బయటకు తీసుకొచ్చి మంచి పేరు కొట్టేస్తానని అంటాడు రాహుల్. ఉదయాన్నే దుగ్గిరాల వారింటికి కనకం వచ్చి కావ్య, అప్పూలను పురిటి కోసం పుట్టింటికి తీసుకెళ్తానని చెప్పగా అపర్ణ, ఇందిరలు బాధపడతారు. పిల్లలు కొన్నిరోజులు ఇక్కడే ఉంటారని చెప్పడంతో వారి మంచి మనసుకు కనకం సరేనని అంటుంది.
శ్రీమంతం ఖర్చుల్లో మీ మావయ్యగారు సంపాదించిన డబ్బు కూడా కలపమని కనకం అడగటంతో రాజ్ సరేనని అంటాడు. అప్పూ కోసం కళ్యాణ్ చీర తీసుకోగా.. అప్పూ తన తల్లి తెచ్చిన చీరను చూసి మురిసిపోతుంది. కళ్యాణ్ చీరను గమనించిన అప్పూ.. ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది. మనిద్దరం జీవితాంతం కలిసే ఉంటాం.. కానీ మీ అమ్మనాన్నల తర్వాతే నేను అని కళ్యాణ్ చెప్పడంతో భర్తని హత్తుకుని అప్పూ ఎమోషనల్ అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జనవరి 5వ తేదీ ఎపిసోడ్ 922లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పసరు మందు తెచ్చేవాడి కోసం వెయిట్ చేస్తుంది రుద్రాణి. ఇంతలో అతను సరాసరి లోపలికి వచ్చేస్తుండటంతో వాడిని బయటకు నెట్టేస్తుంది. ఎవరైనా నిన్ను చూస్తే నీ పని, నా పని అంతేనని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. పసరు మందు చేసిన సంబరంలో మీకు త్వరగా ఇచ్చేయాలని అలా వచ్చానని మందు తీసి ఇస్తాడు. ఇది అనుకున్న విధంగా పనిచేస్తుందా? అని రుద్రాణి అడగ్గా.. రోజంతా కష్టపడి పనిచేశాను, ఇది కానీ కడుపులోకి వెళ్లిందంటే పేగులతో సహా బయటకు వచ్చేస్తుందని అంటాడు. మందు తీసుకుని రుద్రాణి సంబరపడిపోతుండగా.. కనకం ఎదురు రావడంతో ఆమె షాక్ అవుతుంది.
నీ కొంగు చాటున ఏం దాచి పెట్టావు? మర్యాదగా చూపించమని ఫైర్ అవుతుంది కనకం. దాంతో పసరు మందు తీసి చూపిస్తుంది రుద్రాణి. రోజూ అజీర్తితో బాధపడుతున్నాను.. తెలిసినవాళ్లు పసరు మందు పంపించారని కవర్ చేస్తుంది. నువ్వు ఈ ఇంటికి పిల్లనిచ్చిన ఆడపిల్ల తల్లివి.. నీ స్థానంలో నువ్వుంమని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి. అజీర్తికి పసరు మందు కావాలంటే ఉదయం పూట తీసుకుంటారు.. అలాంటిది ఇంత అర్ధరాత్రి పూట దీనికి ఏం పని? ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందేనని అనుకుంటుంది కనకం.
శ్రీమంతానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ రాజ్, కళ్యాణ్‌లు అదరగొట్టేస్తారు. కావ్య, అప్పూలకి బంగారు గాజులు తీసుకురావడంతో మట్టి గాజులు ఏవి? అని అడుగుతుంది కనకం. బంగారు గాజులు అలంకరణ కోసం, కానీ మట్టిగాజులు ఆరోగ్యం కోసం అని చెబుతుంది కనకం. గర్భవతి అయిన ఆడపిల్లలకు వేసే మట్టిగాజులు మన సంప్రదాయాన్ని సూచిస్తుందని అంటుంది. దీని వెనుకున్న పరమార్ధాన్ని కనకం చెప్పడంతో అంత సంతోషిస్తారు. ఏడో నెలలో శ్రీమంతం చేసే గర్భవతికి మట్టిగాజులు వేయడం ఆరోగ్యం, సంప్రదాయమే కాదు.. ఐదోతనం కూడా అని అంటుంది కనకం. ఇంత సైన్స్ ఉంటుందని తెలియక బంగారు గాజులు తీసుకొచ్చానని, మట్టిగాజులు తెప్పిస్తానని అంటాడు రాజ్.
కావ్య రెడీ అవుతుండగా ఆమె జుట్టుకు సాంబ్రాణి వేస్తాడు రాజ్. భర్త తనకు సేవలు చేస్తుండటంతో కావ్య మురిసిసోతుంది. ఒక నెల క్రితం అన్ని డౌట్సే కదా? కళ్లలో అందమైన కల.. కానీ కళ్ల ముందు అది నెరవేరుతుందా? లేదా? అన్న దడ అని అంటుంది. నా ఆరోగ్యానికి, మన వ్యాపారానికి అన్నీ అడ్డంకులే ఉండేవి. కానీ ఇంతలోనే అన్నీ కష్టాలే కనిపించేవి, కానీ ఇప్పుడు ఎటు చూసినా ఆనందమే కనిపిస్తోందని అంటుంది. అయినా నువ్వు మామూలు దానివా? ఆ దేవుడు రెస్ట్ తీసుకోకుండా అప్లికేషన్స్ మీద అప్లికేషన్స్ పెట్టి.. పూజలు, వ్రతాలు అని టార్చర్ పెడితే దేవుడు మాత్రం ఏం చేస్తాడని అంటాడు రాజ్.
అప్పూ రెడీ అవుతుండగా ఆమె తల దువ్వుతాడు కళ్యాణ్. దాంతో శ్రీమంతం రోజున పాపిడి తీయొద్దని చెబుతుంది అప్పూ. ఇందాకే మట్టిగాజులు ఎందుకు వేసుకోవాలో చాలా బాగా చెప్పారు. ఇప్పుడు పాపిడి ఎందుకు దువ్వుకోకూడదో నీకు సెలవిచ్చారా? అని అడుగుతాడు కళ్యాణ్. మొత్తానికి మీ అమ్మ లేడీ ప్రవచనకర్తగా మారిపోయిందని సెటైర్లు వేస్తాడు. ఇంతలో ధాన్యం వచ్చి.. నువ్వు నా కోడలిని రెడీ చేసింది చాలు కానీ అప్పూని నేను రెడీ చేస్తానని అంటుంది. అత్తగారు తనను రెడీ చేస్తుంటే అప్పూ ఎమోషనల్ అవుతుంది. నేనేం ఊహించింది, భయపడింది... అంతా తప్పయిపోయిందని అంటుంది అప్పూ. నేను ఈ ఇంటికి వచ్చినప్పుడు మీ అబ్బాయిని, నేనే మీకు దూరం చేశానని నా మీద కోపం పెంచుకుంటారని, లైఫ్ లాంగ్ ఇక్కడ ఎలా బతకాలోనని భయపడ్డానని అంటుంది ధాన్యలక్ష్మీ. కానీ ఈరోజు మీరు నా మీద చూపిస్తోన్న ప్రేమకు మాటలు రావడం లేదు.. మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నానని క్షమాపణలు అడుగుతుంది అప్పూ.
నిజానికి నేనే నీకు క్షమాపణలు చెప్పాలి. నీ మాటలు చూసి నీకు పొగరు అనుకున్నా.. కానీ నాకు, ఈ ఇంటికి నువ్వు ఇచ్చే విలువ తెలిశాక నా కోడలు బంగారమని అర్ధమైందని అంటుంది ధాన్యలక్ష్మీ. ఆ తర్వాత అప్పూని రెడీ చేసి ఆమె నుదిటి మీద ముద్దు పెట్టడంతో అప్పూ కంటతడి పెడుతుంది. ఆ రోజు మీకు చెప్పకుండా డ్యూటీకి వెళ్లాను.. నా మీదే కాకుండా అక్క, పెద్ద బావ మీద కూడా కోపం వస్తుందని అనుకున్నాను. కానీ మీరు నన్ను పూర్తిగా అర్ధం చేసుకుని ఆశీర్వదించారు. నువ్వు, ఈ ఇంటికి, నాకు గౌరవం తీసుకొచ్చావు.. నా కోడలు అంతటి కేసుని ఛేదించిందని గర్వపడేలా చేశావు. రాజ్, కావ్యలు నీకు సపోర్ట్ చేయబట్టే కదా నువ్వు అంత సాహసం చేశావు... వాళ్లిద్దరూ బాగుంటేనే ఈ ఇంటికి మనుగడ అంటుంది ధాన్యలక్ష్మీ.
మరోవైపు.. పసరు మందుని కావ్యకి ఎలా తాగించాలా? అని రుద్రాణి ఆలోచిస్తుండగా రేఖ వచ్చి ఇంకోసారి ఫెయిల్ కావడానికి వీల్లేదని అంటుంది. కావ్య తాగే కషాయంలో దీనిని కలిపేద్దామని చెబుతుంది రేఖ. ఇలాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదని, ఎవ్వరికీ డౌట్ రాకుండా కలపాలని అంటుంది రుద్రాణి. ఇంటిల్లిపాది శ్రీమంతంలో బిజీగా ఉన్నారు.. మన పని మనం కానిద్దామని చెబుతుంది రేఖ. అయితే కావ్య రూమ్‌లో రెడీ అవుతూనే ఉండటంతో షాక్ అవుతారు. ఇంతలో కనకం వచ్చి కూతురిని చూసి మురిసిపోతుంది. ఒకప్పుడు నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆ అడుగు నిలబడుతుందా? తడబడుతుందా? అన్న అనుమానం వచ్చింది. నీ జీవితం ఏం అవుతుందోనని భయపడేదానిని.. స్టోర్ రూమ్‌లో ఉండేదానివి, ఈ ఇంటి కోడలివి అవుతావా? లేదా? అని అనిపించింది అంటుంది కనకం. ఏ దేవుడు కరుణించాడో కానీ.. అందరి తలలో నాలుకవి అయ్యావు, అందరి ప్రేమను పొందగలిగావు, ఈ ఇంటికి వారసుడిని ఇవ్వబోతున్నావని చెబుతుంది. ఈ ఇంట్లో వాళ్లు చాలా మంచోళ్లని అంటుంది రుద్రాణి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










