Brahmamudi July 11th Episode: రేఖకి ఆంటోనీ బ్లాక్‌మెయిల్.. లక్కీయే రేఖ కొడుకని తెలుసుకున్న రాజ్
Photo Courtesy: JioHotstar
రాజ్‌ని ఎలాగైనా ఇంటికి తీసుకురమ్మని అపర్ణ చెప్పగా.. ఇందూ మండిపడుతుంది. మేమంటే అక్కాచెల్లెళ్లం.. కానీ రాజ్‌కి ఏం సంబంధం, అతనిని తల్లిదండ్రులకు దూరం చేయలేనని తేల్చేస్తుంది ఇందూ. తను నీ భర్త .. కడదాకా తోడు ఉంటానని ఏడడుగులు వేసిన మనిషి.. మేం పిలిస్తే రాజ్ రాడు అని చెబుతుంది అపర్ణ. అయితే నేను పిలవలేనని చెప్పి వెళ్లిపోతుంది ఇందూ. అయినా నేను వచ్చేశాను కదా ఇకపై అంతా నేను చూసుకుంటానని చెబుతుంది నందూ. రేఖకి రాజ్ ఫోన్ చేసి ఎలా ఉంది పిన్ని మన సర్‌ప్రైజ్ అని సెటైర్లు వేస్తాడు. ఇప్పుడు ఎప్పుడు ఇందూ నా భార్య.. తనకి నేనున్నాని చెబుతాడు.
ఆస్తి రాలేదని బాధపడుతున్న భ్రమరాంబ, రేఖల దగ్గరికి తట్టా బుట్టా సర్దుకుని వస్తాడు శేషం. నందూ వచ్చాక మన పని ఔట్.. మనల్ని బాంబు పెట్టి పేల్చేస్తుందని, కనీసం ప్రాణాలు కాపాడుకోవాలంటే ఇక్కడ ఉండకూడదని చెబుతాడు శేషం. నేను ఉండగా మీకు ఆ పరిస్ధితి రానివ్వనని ధైర్యం చెబుతుంది రేఖ. ఇందూని కాపాడటంతో రాజ్ చాలా సంతోషంగా ఉంటాడు. నీకు ఫ్యామిలీ ఉంది. అద్దె మొగుడు క్యారెక్టర్ కారణంగా ఇందూతో బంధం వచ్చింది. కానీ నాకు ఎవ్వరూ లేరు.. నా తల్లిదండ్రులు ఎవరో? ఎందుకు నన్ను వదులుకున్నారో తెలియదు అని బాధపడతాడు. ఇందూ రూమ్‌లోకి వచ్చిన ఐశ్వర్య.. రాజ్ లేడు కాబట్టి ఈ రూమ్ ఖాళీ చేయమని చెబుతుంది. ఇంతలో నందూ వచ్చి మా అక్క ఖాళీ చేయదు, నేను కూడా ఇదే రూమ్‌లో పడుకుంటానని గొడవ పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 11వ తేదీ ఎపిసోడ్ 1082లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
పీకలదాకా తాగిపడిపోయిన లక్కీని తీసుకొచ్చి ఇంట్లో పడుకోబెడతాడు రాజ్. మీ అమ్మానాన్నల్ని ఏడిపించొద్దు, వాళ్లని బాగా చూసుకోమని చెబుతాడు లక్కీ. నా కన్న తల్లి ఎవరో ఆ ఆంటోనీ గాడికి తెలుసు, వాడిని ఎన్నిసార్లు అడిగినా చెప్పడం లేదు. నేను చచ్చేలోపు మా అమ్మని ఒకే ఒక్కసారి చూడాలని అంటాడు. ఇంతలో రాజ్‌కి ఆంటోనీ కనిపించడంతో వాడిని ఫాలో అవుతూ వెళ్తాడు రాజ్. ఆంటోనీ ఒకచోట ఆగి రేఖని కలవడంతో రాజ్ షాక్ అవుతాడు. పదే పదే నన్ను ఫోన్లు చేసి కలవొద్దని ఆంటోనీకి క్లాస్ పీకుతుంది రేఖ. ఫోన్ చేయొద్దు, కలవొద్దు అంటే ఎలా? నా అవసరాలు నాకుంటాయి కదా? అని అంటాడు ఆంటోనీ.
నీ అవసరాలతో నాకు పనేంటీ? ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేసిన చిన్న తప్పుకి నన్ను ఇంతలా టార్చర్ చేయాలా? అని ప్రశ్నిస్తుంది రేఖ. అది మీ దృష్టిలో చిన్న తప్పేమో, కానీ అది ఇప్పుడు పెరిగి చాలా పెద్దది అయ్యింది, ఆ క్షణం మీరు మీ కడుపున పుట్టిన బిడ్డని నా చేతుల్లో పెట్టి వదిలించుకున్నారని ఆంటోనీ చెప్పడంతో ఈ మాటలు విన్న రాజ్ షాక్ అవుతాడు. మీరు హ్యాపీగా పెళ్లి చేసుకుని బతికేస్తున్నారు, మీ కొడుకు తాటిచెట్టంత పెరిగారు.. వాడిని ఎవరు చూసుకోవాలి అని అడుగుతాడు. అందుకే కదా నీకు ముష్టి పడేసింది అంటుంది రేఖ. కాలం మారింది, ధరలు పెరిగాయి, ఖర్చులు పెరిగాయి.. అందుకే ఇలా ప్రతిసారి మీకు ఫోన్ చేసి విసిగించడం ఎందుకని సింగిల్ టైం సెటిల్‌మెంట్ చేసుకుందామని అనుకుంటున్నానని అంటాడు ఆంటోనీ.
అయితే రేపు ఒక లక్ష రూపాయలు ఇస్తా, లైఫ్‌లో నాకు కనిపించొద్దని చెబుతుంది రేఖ. లక్ష రూపాయలు చాలవు... నాకు 50 లక్షలు కావాలని తేల్చేస్తాడు ఆంటోనీ. ఆ మాటలతో రేఖ, రాజ్‌లు షాక్ అవుతారు. నేను ఇవ్వను ఏం చేస్తావని రేఖ బెదిరిస్తుంది. మీరు నా చేతిలో పెట్టిన ప్రాణం.. ప్రతిక్షణం మా అమ్మ ఎవరు? మా అమ్మ ఎలా ఉంటుందని నా ప్రాణం తీస్తున్నాడు. వాడు పేరుకే లక్కీ కానీ, వాడి జీవితంలో లక్కే లేదని ఆంటోనీ అనడంతో రాజ్ షాక్ అవుతాడు. ఆ లక్కీగాడికి వాళ్ల అమ్మ అంటే చాలా ప్రాణం.. కానీ మీరే వాడికి తల్లి అని తెలియదు కదా? 10 లక్షల రూపాయలు ఇస్తే వాడి తల తాకట్టు పెట్టయినా సరే 10 లక్షలు తీసుకొస్తాడని చెబుతాడు ఆంటోనీ. నాకు 50 లక్షలు ఇచ్చి నన్ను వదిలించుకుంటారా? వాడికి నిజం చెప్పమంటారా అని బెదిరిస్తాడు ఆంటోనీ. దాంతో ఇస్తాను కానీ నాకు వారం రోజులు గడువు కావాలని అడుగుతుంది రేఖ. ఆ డబ్బు తీసుకుని ఈ రాష్ట్రం కాదు, ఈ దేశమే దాటి వెళ్లిపోతానని అంటాడు ఆంటోనీ.
ఇంతలో రాజ్ వచ్చి మీకు పెళ్లికి ముందు ఇంత హిస్టరీ ఉందా? ఆంటోనీ గాడు నీ కొడుకు గురించి చెప్పినదంతా విన్నాను అంటాడు. ఇంతకీ నీ కొడుకు ఎవరో తెలుసా? నా కొడుకు లక్కీ ఉన్నాడు కదా వాడే అని రాజ్ చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది. వాడు మీ కోసం పరితపించపోతున్నాడు. ఇంతకుముందు వరకు మీ గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆ ఆంటోనీ గాడికి 50 లక్షలు ఇస్తే ఎలాంటి ఉపయోగం లేదు.. వాడు మిమ్మల్ని మళ్లీ మళ్లీ బ్లాక్‌మెయిల్ చేస్తూనే ఉంటాడు. మీరు ఇంట్లో వాళ్లకి ఈ విషయం చెప్పి క్షమాపణలు అడగండి, అందరిముందు లక్కీ మీ కొడుకని ఒప్పుకోండి. రేపు కనుక మీరు ఆ నిజాన్ని ఒప్పుకోకపోతే నేనే ఆ నిజాన్ని బయటపెడతాను, ఎందుకంటే వాడు అమ్మ గురించి పడే బాధను చూడలేను. చిన్నప్పటి నుంచి వాడు పడ్డ నరకం చాలు, రేపటి వరకు మీకు టైం ఇస్తున్నానని రాజ్ వెళ్లిపోతాడు.
ఉదయాన్నే ఇందూకి పనులు చెప్పడంతో రేఖ, భ్రమరాంబలపై నందూ మండిపడుతుంది. మా ఐషు మీదే చేయిచేసుకుంటావా అని భ్రమరాంబ అడుగుతుంది. ఐషు మీదే కాదు నీ మీద కూడా చేయి చేసుకుంటానని నందూ తేల్చస్తుంది. ఈరోజు నుంచి మీ పనులు మీరే చేసుకోవాలి, మా అక్క ఈ ఇంటి వారసురాలు, తను ఈ ఆస్తికి అధిపతి. ఇక నుంచి అలాగే ఉంటుందని చెబుతుంది నందూ. నీ సంగతి రేఖ వచ్చాక చెబుతానని అంటుంది భ్రమరాంబ. ఇంతలో రేఖ .. రాజ్ గురించే ఆలోచిస్తూ వాళ్ల మాటలు పట్టించుకోదు. మీరు నందూని ఏం అనోద్దు క్షమించమని ఇందూ బతిమలాడుతుంది. కానీ రేఖ సైలెంట్‌గా వెళ్లిపోవడంతో అంతా షాక్ అవుతారు.
నన్నేమీ అనలేక మీ రేఖ ఆంటీయే సైలెంట్‌గా వెళ్లిపోయింది. మా అక్కకి ఎవరు పనిచెప్పినా వాళ్ల టాప్ లేచిపోద్దని వార్నింగ్ ఇస్తుంది నందూ. ఉదయాన్నే లక్కీ దగ్గరికి వెళ్లిన రాజ్.. నీకు గుడ్‌న్యూస్ మీ అమ్మ గురించి తెలుసుకునే అవకాశం దొరికిందని అంటాడు. నువ్వు నా ఎమోషన్స్‌తో ఆడుకోవద్దని మండిపడతాడు లక్కీ. మీ అమ్మ, నీ ఫ్యామిలీ నీకు ఈరోజు పక్కగా తెలిసిపోతుందని రాజ్ చెప్పడంతో లక్కీ చాలా సంతోషిస్తాడు. మా అమ్మ ఎవరు? ఎక్కడుంది? అని అడుగుతాడు లక్కీ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications