Brahmamudi July 1st Episode: కావ్య మాస్టర్ ప్లాన్.. కంపెనీ ఎండీగా రాజ్.. అప్పూ ఉద్యోగంపై కొట్టిన యామిని
Photo Courtesy: JioHotstar
దుగ్గిరాల ఫ్యామిలీ అంతా మాట్లాడుకుంటూ ఉండగా రాజ్ వస్తాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదని కావ్యకి ఇందిర తేల్చిచెబుతుంది. కావ్యకి రాజ్ ఐ లవ్ యూ చెబుతుండగా సుభాష్‌కి కంపెనీ మేనేజర్ ఫోన్ చేస్తాడు. సిద్ధార్ధ్ గారు బోర్డ్ మీటింగ్ ఏర్పాటు చేశారని అర్జెంట్‌గా రావాలని చెబుతాడు. ఈ విషయం కావ్యకి చెప్పగా ఆమె కంగారు పడుతుంది. కుటుంబం మొత్తం వద్దు అంటున్నా.. కావ్యను కంపెనీకి వెళ్లడానికి ఒప్పుకుంటాడు రాజ్.
కావ్య వెళ్లేసరికి డైరెక్టర్లంతా మీటింగ్‌లో ఉంటారు. కంపెనీ లాభాల్లో లేదని ఇలాగే కొనసాగితే టాప్ 10లో కాదు కదా టాప్ 100లో కూడా ఉండదని అంటాడు సిద్ధార్ధ్. ఫారిన్‌లో రూ.500 కోట్ల ప్రాజెక్ట్ వచ్చిందని ఇది బాగా చేస్తే మరో 1000 కోట్ల ప్రాజెక్ట్ మన కంపెనీకి వస్తుందని చెబుతాడు. కానీ కావ్య ఈ ప్రాజెక్ట్ డీల్ చేయలేదని ఆమె ఎండీగా ఉండటానికి వీల్లేదని, తనకు కుర్చి అప్పగించాలని అంటాడు. రెండ్రోజుల్లోగా నాకంటే బెస్ట్ అని నిరూపించుకోవాలని కావ్యకి డెడ్‌లైన్ పెడతాడు సిద్ధార్ధ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 1వ తేదీ ఎపిసోడ్ 762లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
బోర్డ్ మీటింగ్ అయిపోయిన తర్వాత కావ్యకి యామిని ఫోన్ చేసి నా రెండో బహుమతి ఎలా ఉందని సెటైర్లు వేస్తుంది. ఆ సిద్దార్ధ్‌ని పంపించింది నేనే అని చెప్పడంతో కావ్య షాక్ అవుతుంది. అతని చేత ఈ ఎమర్జెన్సీ బోర్డ్ మీటింగ్ పెట్టేలా చేసింది కూడా నేనే అంటుంది. ఇక నుంచి నీకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంటానని వార్నింగ్ ఇస్తుంది. అన్ని సక్రంగా జరిగిఉంటే ఈ పాటికి నేను రాజ్ కలిసి ఏ ఊటీకో, కోడైకెనాల్‌కో వెళ్లి హనీమూన్ చేసుకునే వాళ్లమని చెబుతుంది యామిని. కేవలం నీ వల్ల నా ఆశలన్నీ మంటగలిసిపోయాయి.. నా కలలన్నీ కన్నీళ్లు అయిపోయాయని అంటుంది. కళ్ల ముందే కావాల్సింది కనిపిస్తూనే ఉన్నా దానిని సొంతం చేసుకోలేకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలియాలి కదా అని చెబుతుంది.
మీ అక్కని కాపాడుకోవడానికి సతీ సావిత్రిలా పోరాడుతాను అన్నావ్ కదా? ఇప్పడు నీ కంపెనీ బాధ్యతలు నీ చేజారిపోకుండా ఎలా కాపాడుకుంటావని అడుగుతుంది. రెండ్రోజుల్లో ఏం చేయగలవని ప్రశ్నిస్తుంది యామిని. నువ్వు తనకంటే బెస్ట్ అని ఎలా ప్రూవ్ చేసుకోగలవని అడుగుతుంది యామిని. రన్నింగ్‌లో ముందు పరిగెత్తినంత మాత్రాన గెలిచినట్లు కాదని.. ఫైనల్ లైన్ క్రాస్ చేసినప్పుడే గెలిచినట్లు అంటుంది కావ్య. నువ్వు ఈ పోటీలో గెలివాలి అంటే గతం మరిచిపోయిన రాజ్‌కి తను ఉన్నాడు అని ఈ ప్రపంచానికి చూపించాలని చెబుతుంది యామిని. రాజ్‌కి గతం గుర్తుచేసినప్పుడే అది సాధ్యమని.. కానీ అది ఇంపాజిబుల్ అని అంటుంది. కంపెనీ భవిష్యత్తు కోసం రిస్క్ తీసుకుని రాజ్‌కి నిజం చెప్పేస్తానని అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు తెలుసని చెబుతుంది. ఈ దెబ్బతో కుటుంబంలో నీ స్థానం పోతుందని వార్నింగ్ ఇస్తుంది.
అప్పూ పోలీస్ స్టేషన్‌లో ఉండగా ఇద్దరు కుర్రాళ్లు గొడవ పడతారు. వాళ్లిద్దరిని లోపలికి పిలిపించి ఏం జరిగిందని అడగ్గా.. డబ్బుల బాకీ కోసం చర్చించుకుంటున్నామని చెబుతారు. రెండ్రోజుల్లో ఆ డబ్బులు ఇచ్చేస్తామని దానికి మీరే మధ్యవర్తిగా ఉండాలని వాళ్లు చెప్పడంతో అప్పూ సరేనని అంటుంది. బయటికి వచ్చిన వారిద్దరూ తమ ప్లాన్ సక్సెస్ అయినట్లుగా యామినికి ఫోన్ చేసి చెబుతారు. ఆ అప్పూ మేడం మా బుట్టలో పడిపోయిందని, ఆ డబ్బు రెండ్రోజుల్లో కట్టేస్తామని చెప్పామని ఆ కుర్రాళ్లు చెబుతారు. డబ్బు నేను పంపిస్తాను, అప్పూ మాత్రం మన ఉచ్చులో జారిపోకుండా చూడమని చెబుతుంది. ఒంటి మీద ఖాకీ డ్రెస్ ఉందని నన్నే చెంపదెబ్బ కొడతావా? ఈసారి నేను కొట్టబోయే దెబ్బ ఎలా ఉంటుందో చూడు అని అప్పూపై రగిలిపోతుంది యామిని.
కావ్యకి ఐ లవ్ యూ చెప్పకుండా టీవీ చూస్తూ కూర్చొన్న రాజ్‌పై అపర్ణ, ఇందిరలు మండిపడతారు. నువ్వు ప్రపోజ్ చేస్తుండగా కావ్య వెళ్లిపోయింది కదా? దాని మీద నీకు కోపం రాలేదా అని రాజ్‌ని ప్రశ్నిస్తుంది ఇందిర. కళావతి ఆఫీసుకే కదా వెళ్లింది.. రాగానే తన మనసులోని మాటను చెప్పేస్తానని అంటాడు రాజ్. ఇంతలో రాజ్‌కి కావ్య ఫోన్ చేస్తుంది. మీ గురించి అనుకున్నానో లేదో మీరే ఫోన్ చేశారని అంటాడు రాజ్. మీతో అర్జెంట్‌గా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని కావ్య చెబుతుంది. ఈ విషయాన్ని ఇందిర, అపర్ణలకు చెబుతాడు రాజ్. నేను అందరి ముందు ప్రపోజ్ చేయడం తనకు ఇబ్బందిగా ఉందేమో అందుకే పర్సనల్‌గా కలవాలని అడిగిందని అంటాడు.
వెంటనే కావ్య దగ్గరికి వచ్చిన రాజ్.. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని అన్నారు ఏంటది అని అడుగుతాడు. గతంలో ఒకసారి మా బాస్ గురించి చెప్పాను కదా అని గుర్తుచేస్తుంది కావ్య. కంపెనీ ఏమైనా మూసేస్తున్నారా? మీకు వేరే కంపెనీలో ఉద్యోగం నేను వెతికి పెడతానని అంటాడు రాజ్. మా కంపెనీలో సిద్ధార్ధ్ అనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉన్నాడని.. ఆయనకు 40 శాతం షేర్స్ ఉన్నాయని, మా బాస్ లేని టైం చూసుకుని మా కంపెనీని కొట్టేయాలని చూస్తున్నాడని చెబుతుంది కావ్య. మీరు వెంటనే మీ బాస్‌కి ఫోన్ చేసి ఇండియా వచ్చేయమని చెప్పామంటాడు రాజ్. ఆయన వచ్చే పరిస్ధితుల్లో లేరని చెబుతుంది కావ్య.
ఆ కంపెనీని నమ్ముకుని ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని కావ్య అంటుంది. అయితే నేనేం చేయగలను.. నేనేమీ మీ బాస్‌ను కాదు కదా? అని చెబుతాడు రాజ్. మీరు మా బాస్‌లా నటిస్తే చాలని అంటుంది కావ్య. ఆ మాటలతో రాజ్ షాక్ అవుతాడు. అప్పుడేదో మీ బాస్‌లా సంతకం పెట్టినంత మాత్రాన, ఈసారి ఏకంగా మీ బాస్‌లా యాక్ట్ చేస్తానంటే నా వల్ల కాదని అంటాడు రాజ్. మీరు మా లాంటి వాళ్ల కోసం ఎందుకు హెల్ప్ చేస్తారు? అదే యామిని పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటే చాలు మీకు ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటారని అంటుంది కావ్య. కంపెనీని నమ్ముకుని బతుకుతున్న చాలా కుటుంబాలు అన్యాయం అయిపోతాయంటే మాత్రం ఒప్పుకోరని ఏడుస్తుంది.
ఆ సిద్ధార్ధ్ చేతికి కంపెనీ వెళ్లిందంటే ఎవరో ఒకరికి అమ్మేస్తాడని.. ఇన్నేళ్ల నుంచి కంపెనీనే నమ్ముకుని బతుకుతున్న ఉద్యోగుల జీవితాలు రోడ్డున పడతాయని చెబుతుంది కావ్య. నేను మీ బాస్‌లా నటిస్తున్నానని ఎవరికైనా తెలిస్తే నన్ను తీసుకెళ్లి లోపల వేస్తారని భయపడతాడు రాజ్. చివరికి బాస్‌లా నటించడానికి రాజ్ ఒప్పుకోవడంతో కావ్య అతనిని హగ్ చేసుకుంటుంది. వెంటనే మీకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి రాజ్‌ను ఇంటికి తీసుకెళ్తుంది. దారిలో మీ బాస్ ఎలాంటి వాడని రాజ్ అడుగుతాడు. తప్పు చేసింది తన వారే అయినా ఆలోచించకుండా శిక్ష వేస్తాడని.. మంచి చేసింది పరాయి వాళ్లే అయినా నెత్తిన పెట్టుకుంటాడని చెబుతుంది. భార్యను టార్చర్ చేస్తాడు.. తల్లిని ప్రేమగా చూసుకుంటాడని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










