Brahmamudi July 2nd Episode: ఇందూ కోసం రాజ్ త్యాగం.. కొడుకు నిర్ణయంతో చలపతి గుండె ముక్కలు
Photo Courtesy: JioHotstar
స్వీట్ పెట్టడానికి వస్తోన్న ఇందూని చూసి కలగంటున్నానని అనుకుంటాడు రాజ్. అయితే ఇందూ గట్టిగా గిల్లడంతో కేకలు పెడతాడు. నీ వల్లే ఈరోజు డీల్ ఫినిష్ చేశామని రాజ్‌కి స్వీట్ తినిపించి అదే స్వీట్‌ని ఇందూ తినడంతో రాజ్ షాక్ అవుతాడు. నేను ఇంత ఆనందంగా ఉండటానికి, ఆఫీస్‌లో అడుగుపెట్టడానికి, ఎంప్లాయిస్‌కి శాలరీ విషయంలో హెల్ప్ చేశావు. ఇలాగే నా చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా ఉంటావా అని ఎమోషనల్ అవుతుంది. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చిన పని పూర్తయ్యే వరకు నేను నిన్ను వదిలిపెట్టనని మాట ఇస్తాడు రాజ్.
ఒంటరిగా గదిలో కూర్చొని ఏడుస్తున్న రేఖ దగ్గరికి ఐశ్వర్య వచ్చి క్లాస్ పీకుతుంది. ఆ రాజ్- ఇందూ ఇద్దరూ తోడు దొంగలే. పార్టీలో మిమ్మల్ని వాళ్లిద్దరూ ఫూల్స్‌ని చేశారు. ఇప్పటి వరకు ఆ రాజ్‌గాడు వాళ్ల అమ్మనాన్నల్ని ఎందుకు తీసుకురాలేదు. వాళ్ల దగ్గరికి మనల్ని ఎందుకు తీసుకెళ్లలేదు. వాళ్లిద్దరి పెళ్లి వెనుక ఏదో ఉంది. అందుకే రాజ్ దాస్తున్నాడని ఐశ్వర్య చెప్పడంతో రేఖ స్కెచ్ గీస్తుంది. ఓ వ్యక్తిని చలపతి ఇంటికి పంపుతుంది రేఖ. మీ అబ్బాయి దుగ్గిరాల వారింటికి అల్లుడు అని చెప్పడంతో చలపతి, లక్ష్మీలు షాక్ అవుతారు. వాడిని తిరిగి తీసుకొచ్చేయాలని, లేదంటే రాజ్ ప్రాణాలకే ప్రమాదమని అనుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూలై 2వ తేదీ ఎపిసోడ్ 1074లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఇందూ ఐరన్ చేస్తుండగా తన షర్ట్ కూడా ఐరన్ చేయమని అడుగుతాడు రాజ్. ఇందూ చేయను అని చెప్పడంతో అయితే అమ్మమ్మతో చేయించుకుంటానని వెళ్తుండగా భయపడి చేస్తానని అంటుంది ఇందూ. ఆ మాటలతో మండిపడిన ఇందూ.. ఆ షర్ట్‌ని కాల్చేస్తుంది. నన్నే బ్లాక్‌మెయిల్ చేస్తే అలాగే ఉంటుందని అంటుంది. దాంతో రగిలిపోయిన రాజ్.. ఇందూకి వాతలు పెడతానని ఇళ్లంతా పరుగులు పెట్టిస్తాడు. ఇంతలో రేఖ వచ్చి.. చాలా ఆనంద పడుతున్నారు కదా? కాసేపట్లో ఇంతకుమించి బాధపడతారని భ్రమరాంబతో అంటుంది రేఖ.
అక్క నీకు సారీ చెప్పే వరకు అస్సలు వదలొద్దని స్వాతి అంటుంది. సారీ చెబుతావా? లేదా అని రాజ్ అడగ్గా నేను చెప్పనని అంటుంది ఇందూ. ఇంతలో దుగ్గిరాల నిలయానికి వచ్చిన చలపతి- లక్ష్మీలు కొడుకుని ఇందూతో చూసి షాక్ అవుతారు. నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? లాస్ట్ టైం వచ్చినప్పుడు మేమిద్దరం బిజినెస్ చేస్తున్నామని చెప్పావు కదా? మీరిద్దరూ బిజినెస్ చేస్తే ఇలా ఆడుతూ పాడుతూ కేరింతలు కొడుతూ ఉండరు కదా అని చలపతి నిలదీస్తాడు. ఈ అమ్మాయి నీ బిజినెస్ పార్ట్‌నరా? లైఫ్ పార్ట్‌నరా అని అడగటంతో రాజ్- ఇందూలు షాక్ అవుతారు. నేను చెబుతానని ఇందూ అంటుండగా.. ఇదొక తండ్రికి, కొడుక్కి సంబంధించిన విషయం. నువ్వు మధ్యలో రావొద్దని అంటాడు చలపతి.
నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా? లేదా? అని అడుగుతాడు చలపతి. పెళ్లి చేసుకున్నానని రాజ్ చెప్పడంతో కొడుకుని లాగిపెట్టి కొడతాడు చలపతి. దాంతో అంతా షాక్ అవుతారు. మీ అమ్మనాన్నలు చనిపోయారు అనుకున్నావా? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావంటే అంత గొప్పోడివి అయిపోయావా? అంటూ ఫైర్ అవుతాడు. మేం ఏదైతే జరగకూడదని అనుకున్నామో అదే జరిగింది. ఇలాంటి గొప్పింటి వైపు నువ్వు అడుగు కూడా పెట్టకూడదని అనుకున్నాను, కానీ నువ్వు వెతుక్కుంటూ వచ్చి గొప్పింటి అల్లుడివి అయిపోయావు. మేం ఏం చెబితే అది చేస్తావా అని ప్రశ్నిస్తాడు చలపతి. ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు, ఈ గొప్పింటి సంబంధం మనకి వద్దు, నువ్వు అల్లుడిగా ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని అంటాడు. ఈ అమ్మాయితో నీకున్న బంధాన్ని తెంచేసుకో, తనకి విడాకులు ఇచ్చేయమని చెబుతాడు చలపతి. ఆ మాటలతో ఇందూ, అపర్ణలు షాక్ అవుతారు.
అమ్మాయి, అబ్బాయి ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు. మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నారని మూడు ముళ్ల బంధాన్ని తెంచేస్తారా? అని అపర్ణ నిలదీస్తుంది. పెద్దవాళ్లుగా వాళ్ల ప్రేమను అర్ధం చేసుకుని దగ్గరికి తీసుకోవాల్సింది పోయి.. ఆవేశంతో బంధాన్ని తెంపేస్తారా అని సుభాష్ ప్రశ్నిస్తాడు. నిండు నూరేళ్లు కలిసుండమని అక్షింతలు వేసి ఆశీర్వదించమంటారా? అది ఎప్పటికీ నిజం కాదని మీకు తెలుసు, మాకు తెలుసు అని అంటాడు చలపతి. 20 ఏళ్ల క్రితం మీ జీవితాల్లో ఏం జరిగిందో అప్పుడే మరిచిపోయారా? మీ కుటుంబం మొత్తం ఒక ప్రమాదంలో చనిపోయింది. అదంతా యాక్సిడెంట్ అని మీరు అంటున్నారు, కానీ బయటివాళ్లు మాత్రం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు అని చెబుతాడు చలపతి.
మీ డబ్బున్న వాళ్లు మొదట్లో బాగానే చూసుకుంటారు... అదే కోపమొస్తే ఎంత దూరమైనా వెళ్తారు, చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. ఖరీదైన ఆస్తులు, బంగ్లాలు కంటే ముందు మనిషి అన్నవాడు బతికుండాలి కదా? పచ్చడి మెతుకులైనా మా వాడు హాయిగా ఉంటాడు, నా కొడుకు ప్రాణాలతో ఉండాలంటే ఈ ఇంట్లో ఉండకూడదని రాజ్‌ని తీసుకుని వెళ్లిపోతాడు చలపతి. దాంతో ఐశ్వర్య, రేఖలు సంతోషిస్తారు. గుమ్మం దాటుతుండగా ఇందూకి ఇచ్చిన మాట గుర్తొచ్చి అక్కడే ఆగిపోతాడు రాజ్. నేను రాలేను.. ఇప్పుడు మీ కొడుకుని కాదు, నేను ఇందూ భర్తని. జీవితాంతం తోడుగా ఉంటానని తన మెడలో తాళి కట్టిన నన్ను ఇలా మధ్యలో వదిలేసి రమ్మంటారా? అని ప్రశ్నిస్తాడు రాజ్.
నీ జీవితంలో ఏది ఉండాలో? ఏది ఉండకూడదో నిర్ణయించే హక్కు మాకుందని అంటాడు చలపతి. నా భార్యని, ఈ ఇంటిని వదిలేసి నేను ఎక్కడికి రాను అంటాడు రాజ్. విషయం అక్కడి వరకు వచ్చిందా? ఇది ఇప్పుడే ఇక్కడే తేలిపోవాలి? నీకు మేం కావాలో? ఆ అమ్మాయి కావాలో తేల్చుకోమని చలపతి చెబుతాడు. కన్నవాళ్లని ఎలా కాదంటాడు? కట్టుకున్న దానిని ఎలా కాదంటాడు? అని అపర్ణ ప్రశ్నిస్తుంది. ఈ విషయం మీకు అనవసరం నా కొడుక్కి మేం కావాలో వద్దో అని అడుగుతున్నామని చలపతి ప్రశ్నిస్తాడు. అందరి ముందు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ఏ తండ్రికైనా ఉంటుంది కదా? కానీ రాజ్ ఇలా చేసేసరికి వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. మనం యాక్సెప్ట్ చేసి ఇంట్లోకి తీసకొచ్చాం కానీ, లోకంలో ఉన్న అందరూ అలా ఉండాలని లేదు కదా అంటుంది రేఖ.
దాంతో రేఖని నోరు మూసుకుని ఉండమని వార్నింగ్ ఇస్తుంది అపర్ణ. రేఖ అనే పేరు వినగానే.. చలపతికి గతంలో శృతి చెప్పిన మాటలు గుర్తొచ్చి టెన్షన్ పడతాడు. వీడి మీదనే మా బతుకులు ఆధారపడి ఉన్నాయి, మీరెవరూ మాట్లాడొద్దని అంటాడు చలపతి. నీకు మేం కావాలా? ఆ అమ్మాయి కావాలా? రెండూ కావాలని తెలివిగా సమాధానం చెప్పొద్దని అంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications