Brahmamudi 4th July episode: కోర్టులోనే తేల్చుకొందాం.. కల్యాణ్‌ను బెదిరించిన అనామిక
కళ్యాణ్ దంపతులను కలిపే ప్రయత్నం చేస్తారు రాజ్ దంపతులు. అయితే అనామిక తల్లిదండ్రులని ఇంటికి పిలిపించి పంచాయతీ పెట్టడంతో తల్లిదండ్రులతో సహా ఆమెని బయటికి పొమ్మంటాడు కళ్యాణ్. తరువాత అనామిక కళ్యాణ్ పై పోలీస్ కేసు పెడుతుంది. అప్పు కళ్యాణ్ దగ్గరికి వెళ్తానంటే కనకం అడ్డుకుంటుంది. కానీ కోర్టులో అప్పుని హాజరపరచమని జడ్జిగారు ఆర్డర్ వేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక జులై 4వ తేదీ ఎపిసోడ్ 453 లో ఏం జరిగిందంటే..
కళ్యాణ్ వాళ్ళ లాయర్ కళ్యాణ్ వాళ్ళతో మాట్లాడుతూ నేను చేయవలసింది అంతా చేశాను అంటూ కళ్యాణ్ అనామికని హింసించలేదని సాక్షాలు ఉంటే కావాలి అని అడుగుతాడు. అలాంటి వాటికి సాక్షాలు ఉంటాయా అంటుంది ధాన్యలక్ష్మి. మీ అబ్బాయి అనామిక ని కొట్టాడు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి కదా అలాగే ఇది కూడా. కోర్ట్ కి కావలసింది సాక్షాలే అంటాడు లాయర్. అలాంటి సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉండవు అంటూ అక్కడికి వస్తుంది అనామిక.

ఆమెను చూసి అసహ్యించుకుంటుంది ధాన్యలక్ష్మి. మీ అబ్బాయి తప్పులు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పి నన్ను ఇంటికి తీసుకువెళ్తారేమో అడగండి, అప్పుడు ఈ కేసుని నేను వెనక్కి తీసుకుంటాను అంటుంది అనామిక. ఒకసారి నిన్ను నమ్మి మోసపోయాను మళ్ళీ మోసపోవటానికి సిద్ధంగా లేను అంటాడు కళ్యాణ్.
సరే అయితే కోర్టులోనే తేల్చుకుందాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక. అప్పుడే రుద్రాణి కొడుకుతో మాట్లాడుతూ నేను చెప్పిన పని చేసావా అని అడుగుతుంది. చేశాను మమ్మీ, ఆడవాళ్ళ గుంపులో ఆల్రెడీ మనవాళ్ళు చేరిపోయారు అంటాడు రాహుల్ . అప్పుడే కళ్యాణ్ ని అక్కడ నుంచి తీసుకు వెళ్తూ ఉంటే మహిళా మండలి లో ఉన్న రాహుల్ తరపు ఆడవాళ్లు కళ్యాణ్ పై టమోటాలు, కోడిగుడ్లు వేసి అవమాన పరుస్తారు. అది చూసే భరించలేక రాజ్ అడ్డుపడతాడు.

అతని మీద కూడా కోడిగుడ్లు వేస్తారు. వాళ్ళ ఆవేశం చల్లారిన తరువాత రాజ్ మాట్లాడుతూ ఒక ఆడదానికి సపోర్టుగా నిలబడటం మంచిదే కానీ మీరు నమ్మిన ఆడదే సరి అయినది కాదు ఆ విషయం మీకు త్వరలోనే తెలుస్తుంది, అప్పుడు మీరే బాధపడతారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రాజ్ కి కళ్యాణ్ కి అవమానం జరుగుతూ ఉంటే మమ్మల్ని తొక్కేస్తున్నందుకు మీకు ఇది మేము వేస్తున్న శిక్ష అనుకుంటూ ఆనందపడతారు రాహుల్, రుద్రాణి.
మరోవైపు అప్పుని కోర్టుకి పంపించను ఆ భార్యాభర్తలిద్దరూ తగులాడుకొని కోర్టుకెక్కితే నా బిడ్డ ఎందుకు కోర్టుకెళ్లాలి అని ఎమోషనల్ అవుతుంది కనకం. పంపించకపోతే పోలీసులే అప్పు ని తీసుకువెళ్తారు అని కృష్ణమూర్తి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అయినా కనుక వినిపించుకోకపోవడంతో అప్పు ఆమెని కూర్చోబెట్టి తను కోర్ట్ కి ఎందుకు వెళ్లాలో వివరించి చెప్తుంది. నువ్వు ఒక్కదానివే వద్దు మేము కూడా వస్తాము అక్కడ జడ్జిని బ్రతిమిలాడి నీకు వేయవలసిన శిక్ష ఏదో నాకు వెయ్యమంటాను అని కన్నీరు పెట్టుకుంటుంది కనకం.

ఆ మాటలకి ఎమోషనల్ అయిన అప్పు తల్లిని హగ్ చేసుకుంటుంది. మరోవైపు ఇంటి పరువు బజార్లో పడింది అని బాధపడతాడు సీతారామయ్య. మన ఇంట్లో వాళ్లకి కూడా కోపం వచ్చిందంటే అంతలా రెచ్చగొట్టింది ఆ అనామిక అంటుంది ఇందిరా దేవి. మీరందరూ పరువు ప్రతిష్టల గురించి ఆలోచిస్తున్నారు గాని నా కొడుకు గురించి ఆలోచించడం లేదు వాడిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అంటుంది ధాన్యలక్ష్మి.
అసలు ఈ పరిస్థితి అంతటికి కారణం నువ్వే, ఆ పిల్లకి అంత చనువిచ్చి నెత్తిన పెట్టుకున్నది నువ్వే, ఆ పిల్ల ఏది చెప్తే అది నమ్మావు కానీ ఒక్కరోజు కూడా కొడుకుని నమ్మలేదు, ఈరోజు ఎవరూ పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్నావు ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు అని ధాన్యలక్ష్మి పై విరుచుకుపడతాడు ప్రకాష్. కావ్య ధాన్య లక్ష్మికి ధైర్యం చెప్పబోతుంటే అసలు ఇదంతా నీ చెల్లెలు వల్ల, నీ కుటుంబం వల్లే అంటూ కోప్పడుతుంది ధాన్యలక్ష్మి.
మీ కోడల్ని మీరు అదుపులో పెట్టుకోకుండా మమ్మల్ని అంటారు ఏంటి అంటూ ధాన్యలక్ష్మిని కోప్పడుతుంది స్వప్న. సరే మేమందరం వెళ్లి ఆమె కాళ్లు పట్టుకుంటాము కళ్యాణ్ ని వదిలేస్తుందేమో అడగండి అని కావ్య కూడా ధాన్యలక్ష్మిపై ఫైర్ అవుతుంది. మీరు ఈ తల్లి మనసు అర్థం చేసుకోవడం లేదు ఇప్పుడు నా కొడుకు అనామికని హింసించలేదు అని ఒక సాక్ష్యం దొరికితే చాలు నా కొడుకు బయటపడతాడు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది ధాన్యలక్ష్మి.

తరువాయి భాగంలో అనామిక దగ్గరికి వచ్చిన కావ్య నువ్వు 10 లక్షలు చెక్కు దొంగతనంగా నీ పుట్టింటి వారికి ఇవ్వాలనుకున్నావంటే నీ తల్లిదండ్రులు ఎంత అప్పుల్లో ఉన్నారో అర్థమవుతుంది. ఇదంతా నీ తల్లిదండ్రుల కోసమే కదా చేస్తున్నావు అంటుంది. అవును నా తల్లిదండ్రుల అప్పు తీర్చడానికే నాకు ఆస్తి కావాలి అంటుంది అనామిక.


Click it and Unblock the Notifications











