Brahmamudi June 13th Episode: అపర్ణ పక్కా ప్లాన్.. యామిని పెళ్లిలో అపశకునాలు.. కనకం ఎంట్రీతో సీన్ రివర్స్

Photo Courtesy: JioHotstar

రాజ్ పెళ్లి ఆపకుండా రుద్రాణి అడ్డుపడుతుందని ఇందిర చెప్పడంతో వాళ్ల సంగతి నేను చూసుకుంటానని చెబుతుంది స్వప్న. పెళ్లికి లేట్ అవుతుందని కొడుకుతో గొడవ పడుతున్న రుద్రాణిని, రాహుల్‌ని రూమ్‌లో పెట్టి తాళం వేస్తుంది. డోర్ రాకపోవడంతో బయటి నుంచి ఎవరో లాక్ చేశారని రాహుల్‌కు డౌట్ వస్తుంది. కావ్యకి తాను పెళ్లి చేసుకోబోతున్న విషయం చెప్పాలని రాజ్ అనుకుని బయల్దేరుతుండగా యామిని అడ్డుపడుతుంది.

కావ్యతో సహా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా యామిని ఇంటికి రావడంతో రాజ్ షాక్ అవుతాడు. మీరంతా నా పెళ్లి రావడం సంతోషంగా ఉందని కావ్యని తీసుకుని పక్కకి వెళ్తుంది యామిని. అపర్ణ, ఇందిరలు రాజ్‌ను పక్కకి తీసుకెళ్లి నిలదీస్తారు. యామిని సూసైడ్ అటెంప్ట్ చేయడంతో తప్పనిసరి పరిస్ధితుల్లో పెళ్లికి ఒప్పుకున్నానని.. ఇక జీవితాంతం కళావతి జ్ఞాపకాలతో బతికేస్తానని అంటాడు రాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 13వ తేదీ ఎపిసోడ్ 747లో ఏం జరిగిందంటే?

Brahmamudi Serial June 13th 2025 Episode 747 Here is Today s full story

Photo Courtesy: JioHotstar

పూజ చేస్తుండగా కావ్య పక్కన నిలబడ్డ రాజ్‌ను తనవైపుకు లాగుతుంది యామిని. అది చూసిన దుగ్గిరాల కుటుంబ సభ్యులు రగిలిపోతుంటారు. ఆ వెంటనే కావ్యని పిలిచి మాకు హారతి ఇవ్వమని అడుగుతుంది యామిని. దానిపై మండిపడ్డ కావ్య.. మీ పెళ్లిని నేనే దగ్గరుండి జరిపిస్తాను, కానీ హారతిని పెద్దవారు మీ అమ్మగారే ఇవ్వాలని చెబుతుంది. ఎవరు చేసే పనిని వారే చేయాలి? అని మీ అమ్మతో హారతి ఇప్పించమని అంటుంది ఇందిర. ఇంతలో ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం పెళ్లి రాటను విరగ్గొడతారు కళ్యాణ్ ఏర్పాటు చేసిన మనుషులు. దాంతో అంతా షాక్ అవుతారు.

పెళ్లిలో ఇలాంటిది జరగడం అపశకునం, అరిష్టం ఈ పెళ్లి జరగకూడదు.. ఈ పెళ్లిని ఆపేయండి అని ముత్తయిదువులుగా ఉన్న కళ్యాణ్ మనుషులు అంటారు. పెళ్లిని ఆపేయాలా? అని యామిని అడగ్గా.. నా ఇన్నేళ్ల అనుభవంలో ఎప్పుడూ? ఇలా జరగలేదని అంటుంది ఇందిర. ఇలా జరిగింది అంటే తప్పుకుండా ఈ పెళ్లిలో ఏదో దోషం ఉందని చెబుతుంది ఇందిర. దాంతో యామిని కుటుంబం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. మాకు తెలిసిన వాళ్ల పెళ్లిలోనూ ఇలాగే జరిగిందని, వినకుండా పెళ్లి చేస్తే ఏడాది తిరక్కుండానే వాళ్లు విడిపోయారని అంటుంది ధాన్యలక్ష్మీ.

ఇవన్నీ వింటుంటే నాక్కూడా అనుమానం వస్తోందని చెబుతుంది అపర్ణ. యామిని చెప్పినట్లు వాళ్లకు నిశ్చితార్ధం అవ్వగానే రామ్‌కి యాక్సిడెంట్ కావడం, కోమాలోకి వెళ్లి 6 నెలల తర్వాత తిరిగి రావడం, మళ్లీ ఇప్పుడు పెళ్లి రాట విరిగిపోవడం చూస్తుంటే అసలు ఈ పెళ్లి చేయడం కరెక్టేనా అనిపిస్తోందని అంటుంది అపర్ణ. ఆ మాటలతో యామిని షాక్ అవుతుంది. వాళ్లు చెబుతున్నది నిజమేనా అని శాస్త్రి గారిని అడుగుతుంది యామిని. నేను ఒకసారి పంచాంగం చూసి ముహూర్తం పెట్టానంటే తిరుగులేదని, ఏవో దుష్టశక్తులు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నాయని అంటాడు శాస్త్రి.

ఒకసారి వాళ్లిద్దరి జాతకం పరిశీలించమని శాస్త్రితో అంటాడు ప్రకాశం. అసలే నా మనవడు యాక్సిడెంట్ అయి చావు వరకు వెళ్లొచ్చాడని, అలాంటప్పుడు జాగ్రత్త పడటంతో తప్పు లేదు కదా అని అంటుంది ఇందిర. ఏ కీడు లేకుండానే ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నిస్తుంది. దీంతో దుర్గామాతకు కుంకుమ పూజ చేస్తే అన్ని దోషాలు పోతాయని చెబుతాడు శాస్త్రి. ఈ శాస్త్రి పెళ్లి పనులు మొదలు పెట్టిన తర్వాత పెళ్లి ఆగడం అనేది నా హిస్టరీలోనే లేదని అంటాడు. ఈ శాస్త్రి ఓవరాక్షన్ చేసి పెళ్లి ఆగదు అని చెబుతున్నాడేంటీ? అని ఇందిరతో అంటుంది అపర్ణ. వాడి చేతే ఈ పెళ్లి ఆపించాలని ఇందిర ప్లాన్ చేస్తుంది. అలా జరగాలంటే బుల్డోజర్ లాంటి మనిషి మనికి తోడు కావాలని ఆలోచిస్తుండగా కనకాన్ని తలచుకోగానే ఆమె ప్రత్యక్షమవుతుంది.

కళ్ల ముందే నా బిడ్డ జీవితం ఇంత అన్యాయం అయిపోతుంటే, దాని కాపురం పేక మేడలా కూలిపోతుంటే, నా కూతురి ఐదోతనాన్ని ఇంకో ఆడది లాగేసుకుంటుంటే నాకెందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది కనకం. మీ పద్దతి అస్సలు నచ్చడం లేదని ఫైర్ అవుతుంది. అసలు ఆ యామిని ఎవరు? ఎక్కడుంది? అని మండిపడుతుంది కనకం. ఆ యామిని రక్తం కళ్లచూడనిదే నేను ఈ రోజు నిద్రపోనని అంటుంది. మేం నిన్ను పిలిపించింది నీ చేత రక్త పాతాలు చేయించడానికి కాదు.. నీ సాయంతో ఈ పెళ్లి ఆపించడానికి అని చెబుతుంది అపర్ణ. నువ్వు అనవసరంగా గొడవ చేస్తే మా ప్రయత్నమంతా వృథా అయిపోతుందని అంటుంది ఇందిర.

గొడవ చేయాలంటే మేమంతా కలిసి ఆ యామినితో మూడు చెరువుల నీళ్లు తాగించే వాళ్లమని, అలా చేయలేకే సీక్రెట్‌గా ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతుంది అపర్ణ. మేం ఏం చెబితే అది చేస్తే చాలని, కర్ర విరక్కూడదు కానీ పాము చావాలి అన్నట్లు ఈ పెళ్లి దానంతటే అదే ఆగిపోవాలని అంటుంది ఇందిర. నా కూతురి జీవితాన్ని నిలబెట్టడానికి నేను ఏమైనా చేస్తానని అంటుంది కనకం. రాజ్ ముందు మాత్రం నీ కూతురిని కావ్య అని పిలవొద్దని వార్నింగ్ ఇస్తుంది ఇందిర.

కనకాన్ని చూసిన కావ్య షాక్ అవుతుంది. ఈ పూజలేంటీ? ఈ పనులు చేయడం ఏంటని కూతురిని ప్రశ్నిస్తుంది కనకం. నీ పిచ్చి చేష్టలతో ఇక్కడ ఎలాంటి పొరపాటు చేయొద్దని తల్లితో అంటుంది కావ్య. కట్టుకున్న మొగుడిని మరో ఆడది లాక్కుంటుంటే సాయం చేస్తున్నావ్.. సిగ్గుగా లేదా అని కావ్యపై మండిపడుతుంది కనకం. అల్లుడుగారు నిన్ను ప్రేమిస్తున్నారు కదా.. నువ్వు కూడా ప్రేమిస్తున్నానని చెప్పి ఒక్కటి అయిపోవచ్చు కదా అని అంటుంది కనకం. ఈ పెళ్లి జరగదని.. నాకు ఆయన మీద, దేవుడి మీద నమ్మకం ఉందని చెబుతుంది కావ్య. మా అమ్మని ఎందుకు పిలిపించారని కావ్య అడుగుతుంది. ఈ పెళ్లి ఆపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయొద్దని కావ్య మొత్తుకుంటుంది.

కావ్య లోపలికి వెళ్తుండగా రాజ్ ఎదురై కొంచెం మాట్లాడాలని చెబుతాడు. మీతో మాట్లాడేంత టైం లేదని కావ్య వెళ్లిపోతుండగా ఆమె చేయి పట్టుకుని లాగుతాడు రాజ్. ఇప్పుడు మాట్లాడకపోతే నా జీవితాంతం బాధపడాల్సి వస్తుందని అంటాడు. కావ్యతో ఏదో చెబుతుండగా యామిని వచ్చి రాజ్‌ని పిలుస్తుంది. యామిని పెళ్లి జరిపిస్తున్న శాస్త్రిని కనకానికి చూపిస్తారు ఇందిర, అపర్ణ. ఈ పంతులు మా కాలనీలోనే ఉంటాడని, ఆయనకి ఒక వీక్‌నెస్ ఉందని.. మనం దాని మీద దెబ్బ కొడితే చచ్చినట్లు మనం చెప్పినట్లే చేస్తాడని అంటుంది కనకం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X