Brahmamudi June 16th Episode: ప్లేట్ తిప్పేసిన శాస్త్రి.. షాక్‌లో ఇందిర, అపర్ణ.. యామినితో రాజ్ నిశ్చితార్ధం
Photo Courtesy: JioHotstar
యామిని రాజ్‌లకు పెళ్లి చేయించే పంతులు నాకు బాగా తెలుసని మా కాలనీలోనే ఉంటాడని అతనికి కనకాంబరం అంటే వీక్ నెస్ ఉందని శాస్త్రి బండారం బయటపెడుతుంది. అమ్మవారి పూజ ఏర్పాట్లు చేస్తున్నశాస్త్రి దగ్గరికి అపర్ణ- ఇందిరలు వచ్చి కనకాంబరం మీకోసం పైన గదిలో వెయిట్ చేస్తుందని అంటారు. ఆ మాటలతో నవ్వుకుంటూ.. సిగ్గుపడుతూ పైకి వెళ్లి చూసిన శాస్త్రికి అక్కడ కనకం కనిపిస్తుంది. ఇంతలో ఇందిర, అపర్ణలు వచ్చి ఈ పెళ్లి ఆపితే బోల్డంత డబ్బు ఇస్తామని ఎరవేస్తారు .
డబ్బుతో నన్ను కొనలేరని శాస్త్రి చెప్పగా.. ఇందిరను బెదిరించినట్లుగా ఉన్న ఫోటోలు, వీడియోలు తీస్తుంది కనకం. మేం చెప్పినట్లు చేయకపోతే వీటిని మీ ఆవిడకు చూపిస్తామని బెదిరించడంతో పెళ్లి ఆపడానికి శాస్త్రి ఒప్పుకుంటాడు. యామిని చనిపోతానని బెదిరించడంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నానని కావ్యకు చెబుతాడు రాజ్. ఎవరు బెదిరిస్తే వాళ్లని పెళ్లి చేసుకుంటారా? అని కావ్య నిలదీస్తుంది. రూమ్‌లో ఇరుక్కుపోయిన రాహుల్ తనకు బాగా ఆకలిగా ఉందని తలుపు తీయమని స్వప్నను అడుగుతాడు. ఇంతలో రుద్రాణికి యామిని ఫోన్ చేసి పెళ్లికి త్వరగా రమ్మని చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 16వ తేదీ ఎపిసోడ్ 749లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
అమ్మవారి పూజ పూర్తి చేసి యామినిని హారతి ఇవ్వమని చెబుతాడు శాస్త్రి. ఆ వెంటనే కనకానికి సైగా చేసి ఫ్యాన్ ఆమె వైపు తిప్పాలని అంటాడు. కనకం ఎంత ప్రయత్నించినా ఆ ఫ్యాన్ తిరగదు. దీంతో ఇందిర, అపర్ణలు షాక్ అవుతారు. హారతి ఇచ్చి యామిని పల్లెం కింద పెడుతుండగా పూజారి కోప్పడతాడు. మరో మూడు సార్లు అమ్మవారికి హారతి ఇవ్వమని చెబుతాడు. ఇలాంటి ఆచారం మేం ఎక్కడ చూడలేదని వైదేహి చెప్పగా.. అయితే మీరే మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని కోప్పడతాడు శాస్త్రి. దీంతో పంతులు చెప్పినట్లే మరసారి హారతి ఇస్తుంది యామిని.
పవర్ సప్లయ్ రావడంతో వెంటనే ఫ్యాన్‌ని హారతి వైపు తిప్పుతుంది కనకం. ఫ్యాన్ గాలికి హారతి ఆరిపోతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. పెళ్లిలో ఇలా జరగకూడదని వెంటనే ఆపేయమని ముత్తయిదువుల వేషంలో ఉన్న కళ్యాణ్ మనుషులు అంటారు. ఆ మాటలతో వైదేహి - రఘునాథ్‌లు ఆలోచనలో పడతారు. ఇంతకు ముందు పెళ్లి రాట విరిగిపోయిందని, ఇప్పుడు హారతి పెళ్లెం గాలికి ఆరిపోయిందని అంటారు యామిని, వైదేహి. నేను ఇంత దీక్షగా పూజ చేసినా ఆ అమ్మవారికి కూడా ఈ పూజ జరగడం ఇష్టం లేదేమో అంటాడు పంతులు. ఇంతకంటే ముందుకు వెళ్లడం సరికాదేమోనని, ఈ పెళ్లిని ఇంతటితో ఆపేయడం వధూవరులు ఇద్దరికీ మంచిదని చెబుతాడు. ఆ మాటలతో యామిని, ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు.
ఈ పెళ్లిని ఆపేయమని అంటాను అనుకున్నారా? ఈ శాస్త్రి ఉండగా ఎవ్వరూ ఈ పెళ్లిని ఆపలేరని చెబుతాడు. శాస్త్రి ప్లేట్ తిప్పేయడంతో ఇందిర, అపర్ణ, కనకం ఉలిక్కిపడతారు. పెళ్లిని ఆపమంటే తాత్కాలికంగా ఆపమని అని చెబుతాడు శాస్త్రి. రామ్ గారితో మీ నిశ్చితార్ధం ముహూర్తంలోనే లోపం ఉందని, సమస్యలన్నీ అక్కడి నుంచే మొదలయ్యాయని అంటాడు. వధూవరులిద్దరికీ ఈరోజు మరో ముహూర్తం చూసి నిశ్చితార్ధం చేయించి, అక్కడ పెళ్లికి మళ్లీ ముహూర్తం పెడతానని అంటాడు శాస్త్రి. ఎన్ని దుష్ట గ్రహాలు వచ్చినా ఈ పెళ్లిని ఆపలేరని చెబుతాడు. ఆ మాటలు విన్న కావ్య, ఇందిరలు షాక్ అవుతారు.
కావ్య వైపు చూసిన యామిని ఏం జరిగిందో గుర్తుచేసుకుంటుంది. శాస్త్రి ఈ పెళ్లి ఆపాలని తన భార్యతో మాట్లాడుతుండగా అతని వెనుక యామిని కోపంగా చూస్తూ ఉంటుంది. ఈ పాపంలో నాకు ఎలాంటి భాగం లేదని వాళ్లు భయపెట్టి చేయమన్నారని చెబుతాడు. మీరు ఏం చేయమంటే అది చేస్తానని మీ కంటి చూపుతో భస్మం చేయొద్దని యామినిని వేడుకుంటాడు శాస్త్రి. ఈ పెళ్లి ఆగకుండా జరిపించాలని తేల్చి చెబుతుంది యామిని. ఇది మామూల్ది కాదని ఆ శాస్త్రినే బెదిరించి ప్లాన్ మొత్తం మార్చేసిందని అపర్ణతో కనకం ఉంటుంది.
నిశ్చితార్ధం జరిపించిన తర్వాత పెళ్లికి కొత్త ముహూర్తం పెడతానని చెబుతాడు శాస్త్రి. మళ్లీ జాతకం చూసి కొత్తగా ముహూర్తం పెడతారంట అని ఇందిరపై యామిని సెటైర్లు వేస్తుంది. ఇక మీ మనవడికి వచ్చిన ప్రమాదం ఏం లేదని అంటుంది. నీక్కూడా ఏ అభ్యంతరం లేదు కదా అని కళావతిని అడుగుతుంది యామిని. నీతో కొంచెం మాట్లాడాలని కావ్యని పక్కకి తీసుకెళ్తుంది. దీపాలు ఆర్పడం, కర్రలు విరగ్గొట్టడం ఇదేనా నీ ఆలోచన అని ప్రశ్నిస్తుంది. యామిని రేంజ్‌కు నువ్వు ఎదురు నిలబడాలంటే ఇది సరిపోదని మండిపడుతుంది. నీ పెళ్లి ఆపాలని నేనేం అనుకోలేదని.. ఒకవేళ నేను కనుక తలచుకుంటే నిమిషం పట్టదని కౌంటర్ ఇస్తుంది కావ్య. నాకు కావాల్సింది అది కాదని, నీ తప్పు నీకు అర్ధం కావాలని యామినికి చెబుతుంది.
నీది ప్రేమ కాదు స్వార్ధమని, అనుకున్నది దక్కాలనే పంతమని నీ అంతట నువ్వే తెలుసుకోవాలని అంటుంది కావ్య. నువ్వు ఆయన చుట్టూ ఒక కథ అల్లి మోసం చేస్తున్న మాట నిజం కాదా అని యామినిని ప్రశ్నిస్తుంది. ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని బెదిరించడం మోసం కాదా? అని అడుగుతుంది. నీ ప్రయత్నంలోనే నిజాయితీ లేనప్పుడు నువ్వు గెలుస్తావని ఎలా అనుకుంటున్నావని నిలదీస్తుంది కావ్య. మా వాళ్లు పిచ్చి ప్లాన్లు వేస్తున్నారు కానీ.. నేను ఆపను, అలాగని ఈ పెళ్లి జరగదని తేల్చిచెబుతుంది. నీ మెడలో మూడు ముళ్లు పడటానికి అరక్షణం ముందు ఆయన మనసులోకి నేనొస్తే చాలు ఈ పెళ్లి ఆగిపోతుందని అంటుంది కావ్య. నువ్వు చూస్తుండగానే రాజ్‌ను పెళ్లి చేసుకుంటానని, నీకు దూరంగా తీసుకెళ్లిపోతానని యామిని అనుకుంటుంది.
మనం వేసిన ప్లాన్స్ అన్ని వేస్ట్ .. అంతా సర్వనాశనం అయిపోయిందని బాధపడుతుంది అపర్ణ. మనం ఈ పెళ్లి ఆపుతున్న విషయం యామినికి తెలిసిపోయిందని ఇక అది ఊరుకోదని అంటుంది. మీరేం భయపడొద్దని నేనున్నాను కదా అని చెబుతుంది కనకం. అల్లుడుగారి మనసు మార్చితే చాలు ఈ పెళ్లి ఆగిపోతుందని చెబుతుంది. ఒకసారి పెళ్లని, మరోసారి ఎంగేజ్‌మెంట్ అని చిరాకు తెప్పిస్తున్నారని రాజ్ మండిపడతాడు. ఇంతలో కనకం అక్కడికి వస్తుంది. ఎవరు మీరు? గదిలోకి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలియదా అని కనకం మీద కోప్పడతాడు రాజ్. మీరు నాకు బాగా తెలుసు అల్లుడుగారు అని అంటుంది కనకం. మా అమ్మాయి నచ్చుతుంది కానీ వాళ్లమ్మ మాత్రం అల్లుడుగారు అని పిలిస్తే నచ్చదా అని మండిపడుతుంది. అసలు మీ అమ్మాయి ఎవరు? అని రాజ్ ప్రశ్నించగా.. కళావతి అని చెప్పడంతో అతను షాక్ అవుతాడు.
మీ గురించి కళావతి ఎప్పుడూ చెబుతూనే ఉంటుందని అంటాడు రాజ్. మిమ్మల్ని నా కూతురు ప్రాణం అనుకుందని, అలాంటిది నా బిడ్డ కళ్ల ముందే మీరు ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే అదెలా తట్టుకుంటుందని ప్రశ్నిస్తుంది కనకం. తన మనసులో ఏముందో మీతో చెప్పలేకపోతోందని.. దానికి మీరంటే ప్రాణమని అంటుంది కనకం. అది నాక్కూడా తెలుసని కానీ పరిస్ధితులు కలిసి రానప్పుడు జ్ఞాపకాల్లో ఆనందాన్ని వెతుక్కోవాల్సిందేనని అంటాడు. ఆ యామిని వల్లే మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారని నాకు తెలుసని చెబుతుంది. ఆ యామినితో మీ పెళ్లి జరగదని.. మిమ్మల్ని, కళావతిని విడదీయడం ఆ దేవుడి ఇష్టం లేనట్లుగా ఉందని అంటుంది కనకం. జరుగుతున్నవన్నీ చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోందని అంటాడు రాజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











