Brahmamudi June 3rd Episode: రాజ్‌తో నాకు శోభనం జరగలేదు.. రేఖకి నిజం చెప్పేసిన ఇందూ
Photo Courtesy: JioHotstar
నీ కళ్లలో ఏదో మాయ ఉందని ఇందూని ముద్దు పెట్టుకోబోతాడు రాజ్. ఆ వెంటనే గట్టిగా నవ్వుతూ భయపడ్డావు కదా అని అంటాడు. నా మీద చేయి వేసి చూడాల్సింది అప్పుడు చెప్పేదానిని అంటుంది ఇందూ. నేను నీ అద్దె మొగుడిని అందుకే కంట్రోల్‌గానే ఉంటానని చెబుతాడు రాజ్. అయితే ఈరోజు నీ ఈ పూల పాన్పు మీద పడుకుంటానని బతిమలాడగా.. అదేం కుదరదు రోజు లాగానే కింద పడుకోమని చెబుతుంది ఇందూ. చేసేదేం లేక తిట్టుకుంటూ కింద పడుకుంటాడు రాజ్. చలపతి, లక్ష్మీలు వెంకీ గురించి బాధపడుతుండగా నందూ కంగారుగా పరిగెత్తుకొస్తుంది. వెంకీ నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.. వాడికేం కాలేదు కదా అని టెన్షన్ పడుతుంది. వెంకీ రూమ్ దగ్గరికి వెళ్లి పిలిచినా తలుపులు మూసేసి ఉంటాయి.
ఎంతసేపటికీ తీయకపోవడంతో కిటికీలోంచి చూడగా వెంకీ చేయి కట్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. ఆ వెంటనే తలుపులు బద్ధలుకొట్టి వెంకీని కాపాడుతుంది. నేను చచ్చిపోతానంటూ గోల చేయడంతో లాగిపెట్టి కొడుతుంది నందూ. డాక్టర్ వచ్చి ట్రీట్‌మెంట్ చేసినా డబ్బులు ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉంటారు చలపతి- లక్ష్మీ. జాబ్ లేకపోయినా పర్లేదు.. నువ్వు ప్రాణాలతో నా కళ్లముందు ఉంటే చాలని చలపతి బాధపడతాడు. శోభనం జరిగిందా? ఆగిపోయిందా అనేది తెలుసుకోవాలని భ్రమరాంబ, రేఖలు టెన్షన్ పడుతుండగా రాజ్ ఒళ్లు విరుచుకుంటూ కిందకి వస్తాడు. అది చూసి రేఖ షాక్ అవ్వగా.. భ్రమరాంబ మాత్రం మురిసిపోతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక జూన్ 3వ తేదీ ఎపిసోడ్ 1049లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శోభనం గదిలో నుంచి నలిగిన బట్టలు, చెరిగిన జుట్టుతో ఇందూ బయటకు రాగానే రేఖ షాక్ అవుతుండగా.. భ్రమరాంబ సంతోషిస్తుంది. ఇందూని ఆడుకోవాలని అనుకున్న రాజ్.. ఏమే అని పిలవడంతో ఇందూ మండిపడుతుంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంది.. హీటర్ ఆన్ చేస్తే వేడి వేడి నీళ్లతో స్నానం చేస్తానని అంటాడు రాజ్. సూపర్ హిట్ కాదు.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేశాను.. నువ్వు ఆయిల్ తీసుకొచ్చి మసాజ్ చేయమని శేషంతో అంటాడు రాజ్. ఆ మాటలు వినగానే ఇందూ, రేఖలు షాక్ అవుతారు.
నువ్వు నాకు చెప్పింది ఏంటీ? జరిగింది ఏంటీ? అని ఇందూపై సీరియస్ అవుతుంది రేఖ. వాడు మీ ముందు ఓవరాక్షన్ చేస్తున్నాడు. మీరిచ్చిన పాలు తాగి వాడు రాత్రంతా మత్తుగా పడుకున్నాడు. అసలు వాడంటేనే అసహ్యం.. అలాంటప్పుడు ఫస్ట్ నైట్ ఎలా జరుగుతుంది. ముందు వాడిని ఇంట్లోంచి పంపించేయండి వాడు, వాడి కోతి చేష్టలు పడలేక చస్తున్నానని అంటుంది ఇందూ. వాడు చెబుతున్న దానికి, నువ్వు చెప్పేదానికి అస్సలు పొంతన లేకుండా ఉందని చెబుతుంది రేఖ. వాడి బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్‌గా ఉందని అంటుంది.
అసలేం జరగలేదు.. ఇకపైనా జరగదు, మీరేం టెన్షన్ పడొద్దని చెబుతుంది ఇందూ. ఈ విషయాలు పక్కనపెట్టి వాడు సీఈవో అవ్వకుండా ఏం చేయాలో ఆలోచించమని అంటుంది. వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు.. పక్కా ప్లాన్‌తో రెడీగా ఉన్నానని అంటుంది. వాడు సీఈవో అవ్వడు, నేనే సీఈవో అవుతానని చెబుతుంది రేఖ. కంపెనీ సీఈవో కుర్చీలో కూర్చోబోయేది నేను అనుకుంటుంది ఇందూ. వాళ్ల ముందు ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావని రాజ్‌పై సీరియస్ అవుతుంది ఇందూ.
మన సీక్రెట్ బయటపడకుండా ఉండటానికే అలా చేశాను.. లేదంటే అనుమానం వస్తుందని అంటాడు రాజ్. నేను చెప్పినట్లు చేస్తే చాలని అంటుంది ఇందూ. అలా చెప్పకపోతే నేను చాలా వీక్ అనుకుంటారు.. అది నా పరువుకి సంబంధించినది, నా క్యారెక్టర్‌కి సంబంధించినది. ఏం జరగకపోయినా సరే నా క్యారెక్టర్‌ని నేను కాపాడుకుంటాను, అసలే పెళ్లి కావాల్సిన వాడిని, నాకు ఇంత వరకు ఒక్కసారి కూడా ఫస్ట్ నైట్ జరగలేదు. అలాంటిది ఈ విషయం బయటకు తెలిస్తే నా బతుకు ఏం కావాలి? నా జీవితాన్నే నాశనం చేద్దామని అనుకుంటున్నావా? నీకేంటీ నువ్వు బాగానే ఉంటావు.. బలయ్యేది నేను కదా అంటాడు రాజ్.
మల్లెపూల పాన్పు మీద పడుకోనివ్వలేదు.. కనీసం నా పరువు కాపాడుకోవడం కోసం నాలుగు మాటలు చెబితే కటింగ్ అంటున్నావు. ఇలాంటి ఫస్ట్ నైట్ లాంటిది ఉంటుందని ముందే నాకు చెప్పలేదు. నీ దగ్గర కూడా బిల్డప్ ఇవ్వాలి కదా? లేకపోతే నువ్వు కూడా నాకు విషయం లేదని అనుకుంటావని అంటాడు. నువ్వు కటింగ్ కటింగ్ అంటే నేను అస్సలు ఊరుకోనని బెదిరిస్తాడు రాజ్. ఊరుకోకపోతే ఏం చేస్తావని ఇందూ ప్రశ్నించగా.. అసలు మాకు పెళ్లే కాలేదు, మాకు ఫస్ట్ నైట్ కూడా జరగలేదని లీక్ చేస్తా. అప్పుడు మీ నానమ్మ, తాతయ్య బాధపడతారు.. ఆ రేఖ ఆంటీ అయితే మదన్ గాడికి ఇచ్చి నీకు పెళ్లి చేస్తారని బ్లాక్‌మెయిల్ చేస్తాడు రాజ్.
వెంకీ చేయి కట్ చేసుకున్న విషయం తెలిసిన రాజ్.. కంగారుగా ఇంటికి పరిగెత్తుకొస్తాడు. అసలు ప్రాణాలు తీసుకోవాలని అనుకునేముందు ఈ అన్నయ్య, అమ్మానాన్న గుర్తుకు రాలేదా అని మండిపడతాడు. జాబ్ పోయిందని వాడిని తిట్టావా అని తండ్రిపై సీరియస్ అవుతాడు రాజ్. మిమ్మల్ని తిట్టడం తప్పించి నాకేం పనిపాటా లేదా అని మండిపడతాడు చలపతి. అసలు మేం నీ కన్నకొడుకులమేనా రాజ్ అనడంతో నేనే నీ కన్నతండ్రిని, ఆవిడే నిన్ను నవమాసాలు మోసిన కన్నతల్లి అంటాడు చలపతి.
అసలు ఇన్నిరోజులు ఎక్కడికి వెళ్లావు? నీకో ఇల్లుంది ఆ ఇంట్లో మనుషులు ఉన్నారనే సంగతే మరిచిపోయావు. ఇప్పటి వరకు ఎంత సంపాదించావు అని ప్రశ్నిస్తాడు చలపతి. సార్ బిజినెస్ చేస్తున్నారట కానీ ఒక్క రూపాయి కూడా రాలేదట అంటాడు. అసలు ఎందుకు చావాలని అనుకుంటున్నావు? కారణం ఏంటో చెప్పమని తమ్ముడిని నిలదీస్తాడు రాజ్. ఉన్న జాబ్ పోయింది.. నెలనెలా వడ్డీలు, ఈఎంఐలు ఎలా కట్టాలో అర్ధం కాలేదు. ఆ శంకర్ గాడు నానామాటలు అన్నాడు.. ఎక్కడా జాబ్ దొరక్క అవమానం భరించలేక ఈ పని చేసుకున్నాడని చెబుతాడు చలపతి.
నన్ను ఎవడైనా తిడితే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తాను.. మనకి డబ్బు కంటే బంధాలే ముఖ్యం. ప్రాణం పోతే తిరిగి తీసుకురాలేం.. నాన్న తిట్టిన మాటలకు నేను చనిపోవాలని అనుకున్నానా? నువ్వు నా కన్నా తెలివైన వాడివి, చాలా మంచోడివి, సెన్సిటివ్ అంటాడు. నీలాంటోళ్లు జీవితంలో ఏదైనా సమస్య వస్తే పోరాడలేరు.. నా వల్ల కాదని ఇలాగే చచ్చిపోవాలని అనుకుంటారు. ఒకడు మనల్ని తిట్టినా మన జీవితం తలకిందులు కాదు.. మనం స్ట్రాంగ్‌గా నిలబడాలని అంటాడు రాజ్. మీ అన్నయ్యని ఆదర్శంగా తీసుకుంటే సిగ్గు లేకుండా ఎలా బతికేయొచ్చో తెలుస్తుంది.. వాడికి భవిష్యత్ గురించి భయం లేదు, జీవితం ఏమైపోతుందోనన్న బాధ లేదు, రోజూ సంతోషంగా తిరిగేస్తుంటాడు అని మండిపడతాడు చలపతి. బిజినెస్ చేయడం అంటే ఒంటి మీదకి కోటు వచ్చినంత ఈజీ కాదని చెబుతాడు.
నువ్వు బిజినెస్ అంటూ రోడ్ల మీద తిరుగుతున్నావు.. వీడేమో ఇలా అయిపోయాడు. ఇంటిని ఎలా నడిపించాలో? ఏం చేయాలో అర్ధం కావడం లేదని లక్ష్మీ బాధపడుతుంది. మనవి చిన్నాచితకా బతుకులు ఉన్నదానిలో హ్యాపీగా బతకాలి. కానీ ఇలా గాల్లో మేడలు కట్టడం మంచిది కాదు.. నేను చెప్పిన ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్ జాబ్ ఉంది నెలకు 25 వేలు జీతం. నిన్ను చూసైనా నీ తమ్ముడికి ధైర్యం వస్తుంది. ఒకవేళ మేం లేకపోయినా నీ జీవితం బాగుంటుందన్న ధైర్యం ఉంటుందని అంటాడు చలపతి. నా ఊపిరి ఆగిపోయే వరకు.. నాకు ఊపిరి పోసిన మిమ్మల్ని సంతోషంగా చూసుకుంటాను. మనకి ఈ కష్టాలు, బాధలు ఇంకొన్నాళ్లే. బిజినెస్‌లో ఖచ్చితంగా సక్సెస్ అవుతానని చెబుతాడు రాజ్.
కిచెన్‌లో వంట చేస్తున్న ఇందూని పదే పదే పిలుస్తుంది ఐశ్వర్య.. అయినా ఆమె మాటలు ఏ మాత్రం పట్టించుకోదు. ఇన్నిరోజులు స్టోర్ రూమ్‌లో పడుకునే దానివి, నీ స్థాయి ఏంటో తెలిసేది. ఇప్పుడు పెళ్లయ్యింది, మొగుడు వచ్చాడు. చక్కగా పడుకోవడానికి ఏసీ గది దొరికింది, ఇక పని గురించి ఏం తెలుస్తుందని ఐశ్వర్య మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications