Brahmamudi March 11th Episode: సుభాష్‌కి ప్రాణాపాయం.. తాత కోసం పనిమనిషిగా మారిన ఇందూ
Photo Courtesy: JioHotstar
బయటి నుంచి వచ్చిన ఇందూని ఎక్కడికి వెళ్లావు? ఎవరికి చెప్పి వెళ్లావు? అని నిలదీస్తుంది రేఖ. స్వాతి డ్రెస్‌ని కుట్టించడానికి బయటికి వెళ్లానని ఇందూ చెప్పడంతో నువ్వు వెళ్లి షాప్ అడ్రెస్, టైలర్ ఫోన్ నెంబర్ ఇవ్వమని అడగటంతో ఇందూ, స్వాతిలు షాక్ అవుతారు. వెంటనే టైలర్‌కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయగా.. ఇందూ గారు వచ్చారని చెప్పడంతో స్వాతి, ఇందూ, అపర్ణలు ఊపిరి పీల్చుకుంటారు. నన్నెందుకు మీరు బయటకు వెళ్లనివ్వడం లేదని ఇందూ అడగ్గా రేఖ మండిపడుతుంది. పరీక్ష బాగా రాశానని అపర్ణతో చెబుతుంది ఇందూ. అయితే చిన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అప్పూ కూతురు నందూని తలచుకుని అపర్ణ బాధపడుతుంది.
నందూ చదువుకుంటూ పాకెట్ మనీ కోసం బోకే నడుపుతూ ఉంటుంది. అక్కడికి స్వరాజ్ తమ్ముడు వెంకట్ వచ్చి తన గర్ల్ ఫ్రెండ్ కోసం మంచి బోకే ఇవ్వమని అడుగుతాడు. గోడ మీద రాసున్న కొటేషన్స్ బాగుండటంతో ఆమెను మెచ్చుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్‌ని ఫాలో అవుతూ గులాబీ పూలు ఇచ్చి.. నందూ దగ్గర చదివిన కొటేషన్స్ చెప్పడంతో అతని ప్రియురాలు ఇంప్రెస్ అవుతుంది. ఇంతలో నందూ వచ్చి తన కొటేషన్స్ వాడుకున్నందుకు 1000 రూపాయలు కట్టమని అడగటంతో వెంకట్ కట్టేస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 11వ తేదీ ఎపిసోడ్ 977లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుభాష్‌కి ఎన్నేళ్లుగా వైద్యం చేయిస్తున్నా ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆపరేషన్ ఒక్కటే దీనికి పరిష్కారమని చెబుతాడు డాక్టర్. ఆపరేషన్‌కి ఎంత ఖర్చు అవుతుందని అపర్ణ అడగ్గా.. సర్జరీ 10 లక్షలు, అబ్జర్వేషన్, టెస్టులు కలిపి ఒక 15 లక్షల వరకు అవుతుంది. అది కూడా వీలైనంత త్వరగా ఆపరేషన్ చేస్తే మంచిది.. లేకపోతే వెన్నెముక పూర్తిగా దెబ్బతింటుందని డాక్టర్ చెప్పడంతో అపర్ణ, ఇందూలు షాక్ అవుతారు. కోటలో బతుకుతున్నా.. కోట్ల ఆస్తి కళ్ల ముందు కనిపిస్తున్నా మీకు ఆపరేషన్ చేయించడానికి ఒక్క రూపాయి కూడా లేకుండా చేశాడు ఆ దేవుడు.. ఇప్పుడు అంత డబ్బంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి. వచ్చిన డబ్బుని వచ్చినట్లు వాళ్లు రాబందుల్లా పీక్కుతుంటున్నారు.. ఇప్పుడు మనకి అవసరమైతే అంత డబ్బు ఎవరిస్తారని అపర్ణ బాధపడుతుంది.
ఆ రేఖ ఆంటీయే ఇవ్వాలి.. ఇప్పటి వరకు మన కోసం ఏది అడగలేదు. తాతయ్య కోసమైనా ఒకసారి రేఖ ఆంటీని అడుగుతానని చెబుతుంది ఇందూ. నువ్వు వెళ్లి ఆ రాక్షసి దగ్గర దేహి అంటూ చేయి చాచడం నాకు ఇష్టం లేదు, నీ కోసం నేను ఏం చేయలేకపోయాను, భవిష్యత్తులో చేస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. అలాంటి నా కోసం నువ్వెళ్లి ఆ రాక్షసిని అడగొద్దని చెబుతాడు సుభాష్. మా వల్ల నువ్వు పడుతున్న కష్టాలు, అవమానాలు చాలు.. ఆపరేషన్ చేయకపోతే ఏం జరుగుతుంది.. చచ్చే వరకు ఇలాగే జీవచ్ఛవంలా పడిఉంటాను, దానికి నేను సిద్ధమేనని చెబుతాడు సుభాష్. ఈ ప్రపంచంలో నా కంటూ ఉన్నది మీరిద్దరే.. నా జీవితంలో నేను ఏదైనా సాధించాలంటే మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడం మాత్రమే. అది కూడా చేయకపోతే ఇక నేను ఉండి ప్రయోజనం ఏంటీ? అని అడుగుతుంది ఇందూ.
ఒకప్పుడు ఇదే ఇంట్లో తాతయ్య మహారాజులా తిరిగారు.. అందరి సంతోషం కోసం ఎంతో కష్టపడ్డారు. అలాంటి మనిషి ఈరోజు ఇలా బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. రాజులా బతికిన తాతయ్యని నేను మళ్లీ చూడాలి. తనకి ఆ పూర్వవైభవాన్ని తిరిగి తీసుకురావడమే నా లక్ష్యమని చెబుతుంది ఇందూ. చిన్నప్పుడే అమ్మానాన్నల్ని కోల్పోయాను.. మీరు తండ్రి స్థానంలో నిలబడి నా భుజం నెట్టారు. మీ ఇద్దరి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తానని.. రేఖ దగ్గరికి వెళ్తుంది. తను కోల్పోయిన అమ్మానాన్నల్ని మనలో చూసుకుంటోంది.. కానీ ఆ దారి ఎంత కఠినమైనది అనేది తెలియదని అపర్ణతో అంటాడు సుభాష్. వాళ్ల అమ్మలాగే అది కూడా మొండిది.. మన మాట వినిపించుకోదని చెబుతుంది అపర్ణ.
పోలీస్ స్టేషన్‌లో ఉన్న రౌడీ తన షాప్ ముందు టీ తాగుతూ కనిపించడంతో వెంటనే బాబాయ్‌కి ఫోన్ చేసి చెబుతుంది నందూ. వాడిని మాటల్లో పెట్టి మాట్లాడుతుండగా రౌడీకి అనుమానం వచ్చి.. పరిగెత్తుతుండగా పోలీసులు ఎదురొచ్చి పట్టుకుంటారు. వాడి సంగతి తర్వాత ముందు నాకు సెటిల్ చేయండి అంటుంది నందూ. దాంతో ఎస్ఐ డబ్బులు ఇస్తాడు. ఇలాంటి చిల్లర వెధవల్ని పట్టుకుని బోర్ కొట్టింది.. దేశమంతా మాట్లాడుకునే కేసు ఇవ్వమని చెబుతుంది. అలాంటి కేసు వస్తే చెబుతాను కానీ ముందు డిగ్రీ ఫినిష్ చేయమని చెబుతాడు ఎస్ఐ. నిన్ను వదిలిపెట్టనని నందూకి దొంగ వార్నింగ్ ఇస్తాడు.
ఐశ్వర్య కోసం నెక్లెస్ గురించి భ్రమరాంబ, రేఖలు మాట్లాడుకుంటూ ఉండగా.. ఇందూ వచ్చి తాతయ్యకి ఆపరేషన్ చేయించాలి.. డాక్టర్15 లక్షలు అవుతుందని చెప్పారని అంటుండగా వారిద్దరూ ఏమాత్రం పట్టించుకోరు. ఇంతలో ఐశ్వర్య వచ్చి పార్టీకి వెళ్తున్నానని చెబుతుంది. చిన్నప్పటి నుంచి నీ దరిద్రం గురించి వింటూనే ఉన్నాం.. ఇలాంటివి అన్ని చెప్పి నా మూడ్ పాడు చేస్తున్నారని మండిపడుతుంది. పార్టీ కోసం లక్ష రూపాయలు అడగ్గానే ఐశ్వర్యకి ఇచ్చేస్తుంది రేఖ. నాకంటూ ఈలోకంలో ఉన్నది వాళ్లిద్దరే.. మీరు ఏం చెప్పినా చేస్తాను ఆపరేషన్‌కి డబ్బులు ఇవ్వమని బతిమలాడుతుంది ఇందూ. ఇంటి మెయింటెనెన్స్ కోసం వస్తున్న డబ్బులు.. మీ తిండికి సరిపోవడం లేదు. అంత డబ్బుల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి.. అయినా ఆ ముసలోడికి ఆపరేషన్ చేయించకపోతే వచ్చిన నష్టం ఏంటీ? అని రేఖ మండిపడుతుంది.
నేను ఏదైనా ఒక్కసారే చెబుతాను.. దానిని చేతల వరకు తీసుకురావొద్దని ఇందూకి వార్నింగ్ ఇస్తుంది. ఈరోజు మనింటికి శివరామ్ గారు అని పెద్ద బిజినెస్‌మెన్ డిన్నర్‌కి వస్తున్నాడు. ఆయనకి ఏ లోటు రాకూడదు. నాన్‌వెజ్‌లో నీకు ఎన్ని రకాలు వస్తే అన్ని వండమని చెబుతుంది రేఖ. చేసేదేం లేక కన్నీళ్లతో వెళ్లిపోతుంది రేఖ. ఇంతలో శివరామ్ కోసం రేఖ- భ్రమరాంబలు ఎదురుచూస్తుంటారు. ఆయనని నేను ఇంప్రెస్ చేస్తే.. రేపు ఈ ఆస్తి మన చేతికి వచ్చాక, ఆయన పలుకుబడిని ఉపయోగించి ఇంకా గొప్ప స్థాయికి వెళ్లొచ్చని చెబుతుంది రేఖ. ఇంతలో శివరామ్ రావడంతో ఆయనని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. ఇదంతా చూసిన స్వాతి, అపర్ణలు రగిలిపోతారు.
తనకి భోజనం వడ్డిస్తున్న ఇందూ ఎవరు అని అడుగుతాడు శివరామ్. వంట చేస్తే వంట మనిషి, పనిచేస్తే పనిమనిషి అని చెబుతుంది భ్రమరాంబ. ఆ మాటలు విన్న అపర్ణ కోపంతో ఊగిపోతుండగా స్వాతి ఆపుతుంది. ఫుడ్ చాలా టేస్ట్‌గా ఉంది.. మా అమ్మ చేతి వంట గుర్తొచ్చిందని ఇందూని మెచ్చుకుంటాడు శివరామ్. ఇంత రుచిగా వంట చేయడం ఎక్కడ నేర్చుకున్నావని అడుగుతాడు. పనివాళ్లు అన్నాక పది ఇళ్లలో వంట చేస్తుంది.. ఎక్కడో ఒక చోట నేర్చుకుని ఉంటుందని అంటుంది భ్రమరాంబ.
మా అమ్మ చేతి వంట అంటే మా వైఫ్‌కి కూడా చాలా ఇష్టం. తను లేకపోవడం వల్ల ఆ రుచిని మిస్ అవుతున్నాం.. మీకు అభ్యంతరం లేకపోతే ఇందూని మా ఇంట్లో వంట చేయడానికి పంపిస్తారా అని అడుగుతాడు శివరామ్. దాంతో తప్పకుండా పంపిస్తానని చెబుతుంది రేఖ. జీతం ఇస్తే తప్ప గడవని బతుకులు వాళ్లవి.. పని ఇస్తానంటే పండగ చేసుకుంటుంది కానీ అభ్యంతరం ఏముంటుంది అని అంటుంది భ్రమరాంబ. రేపటి నుంచి ఇది మీకు వంట చేసి పెడుతుందని చెబుతుంది. ఇంతకీ నీకు మా ఇంటికి రావడం ఇష్టమేనా అని శివరామ్ అడగ్గా.. నాకు ఇష్టమేనని ఇందూ చెప్పడంతో స్వాతి, అపర్ణలు షాక్ అవుతారు. నువ్వు నాకు మంచి కుక్‌ని ఇచ్చావు కాబట్టి.. నేను కూడా బిజినెస్‌లో నీకు హెల్ప్ చేస్తానని చెబుతాడు శివరామ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications










