Brahmamudi March 25th Episode: రాజ్ కథ ముగించే పనిలో రుద్రాణి.. యామిని జాడ కనిపెట్టిన అప్పూ
స్కూళ్లో ప్రిన్సిపాల్‌తో, రాజ్ ఫ్రెండ్స్ అంటూ కొందరి తీసుకురావడం, రాజ్ తల్లిదండ్రులంటూ సమాధులపై పూలమాలలు వేయించడంతో యామిని ఆడిన డ్రామాని కనిపెడుతుంది కావ్య. ఆయన గతం మరిచిపోవడంతో నీకు ఇష్టం వచ్చినట్లుగా ఆడిస్తున్నావా? నిన్ను వదలను యామిని అంటూ మనసులో అనుకుంటుంది. ఆయనను ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసునంటూ వెళ్లిపోతుంది.
రుద్రాణి ఫోన్ చేయడంతో కావ్య కోసం మెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ , స్టాఫ్ వస్తారు. అది చూసిన దుగ్గిరాల ఫ్యామిలీ రుద్రాణిపై మండిపడుతుంది. ఈలోపు కావ్య రావడంతో మీరు తీసుకెళ్లాల్సిన పేషెంట్ ఆమెనని చెబుతుంది రుద్రాణి. రాజ్‌ని నెల తిరిగేసరికి మీ ముందు తీసుకొచ్చి నిలబెడతానని.. లేకపోతే ఆయన ఫోటోకి దండవేసి , నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లమని రుద్రాణితో కావ్య ఛాలెంజ్ చేస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 25వ తేదీ ఎపిసోడ్ 678లో ఏం జరిగిందంటే?

నెల రోజుల్లో రాజ్‌ని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతానని కావ్య చెప్పేసరికి రుద్రాణి - రాహుల్ షాక్ అవుతారు. అంత కాన్ఫిడెంట్‌గా కావ్య చెబుతుందంటే రాజ్ బతికే ఉన్నాడా అని తల్లీకొడుకులు కంగారు పడుతుంటారు. మన కలలు కూలిపోకుండా ఉండాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలని రుద్రాణి అంటుంది. కావ్య చెప్పింది నిజమే అయితే రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకుని ఈ ఇంటికి రాకుండా శాశ్వతంగా అడ్డుపడాలని చెబుతుంది రుద్రాణి.
ఒకవేళ నిజంగా రాజ్ బతికే ఉంటే ఆ సగం ప్రాణాన్ని మనం తీసేద్దామని అంటుంది. కావ్య చెబుతుంది కాబట్టి ఆమెకు ఖచ్చితంగా రాజ్ ఎక్కడున్నాడో తనకి తెలుసని చెబుతుంది. ఈ రోజు నుంచి కావ్య మీద ఒక కన్నేసి ఉంచు , అది ఎక్కడికి వెళితే.. అక్కడికి వెళ్లు అని రాహుల్‌కి చెబుతుంది. రాజ్ బతికే ఉన్నాడని తెలిస్తే చాలు వాడిని శాశ్వతంగా దూరం చేసేద్దాం అంటుంది రుద్రాణి. ఈ రోజు నుంచి అదే పని మీద ఉంటానని చెప్పి రాహుల్ వెళ్లిపోతాడు.
కావ్య ఏడుస్తూ కృష్ణుడి దగ్గరికి వస్తుంది. ఆ యామిని ఎవరు? బావ అంటూ ఆయనతో తిరుగుతోందేంటీ? తన చుట్టూ ఒక కొత్త గతాన్ని ఎందుకు సృష్టిస్తోంది? ఆయన మావారు కాదంటూ ఆ యామిని చూపిస్తున్న సాక్ష్యాలు కనిపిస్తున్నా నా మనసు ఆయనే అని చెబుతుందని అంటుంది. ఏది అబద్ధమో , ఏది నిజమో తేల్చుకోలేక నా జీవితం చీకటి పాలయ్యేలా ఉందని బాధపడుతుంది. మరోవైపు ఇంట్లో వాళ్లంతా ఆయన చనిపోయారని నమ్ముతున్నారని.. నేను ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మడం లేని అంటుంది.
వాళ్లు నమ్మేలా చేయాలంటే నాకు సాక్ష్యాలు కావాలని , అలా జరగాలంటే ఆయనకు గతం గుర్తురావాలని అంటుంది. నువ్వే నా భార్యవి అని ఆయన ఇంట్లో అడుగుపెట్టాలి? అప్పుడే వీళ్లు నమ్ముతారని అంటుంది. నేను ఆయనకు గతం గుర్తుచేద్దామంటే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెబుతున్నారని , ఇప్పుడు నేనేం చేయాలని కృష్ణుడి ముందు బాధపడుతుంది. నెల రోజుల్లోపు ఆయనను తీసుకొస్తానని వీళ్లకి మాటిచ్చానని.. ఈ చీకట్లు తొలగించి, నన్ను వెలుగు వైపు నడిపించు అంటూ వేడుకుంటుంది కావ్య.
గతం గుర్తుకురాక గార్డెన్‌లో కూర్చొని బాధపడుతుంటాడు రాజ్. ఇంతలో యామిని తన తల్లిదండ్రులతో కలిసి వస్తుంది. బుర్రలు బద్ధలు కొట్టుకుంటూ మీ అల్లుడుగారు గతాన్ని గుర్తుచేసుకుంటున్నారని చెబుతుంది. తనకి ఆ అవకాశం ఇవ్వకూడదు, మన ప్రపంచాన్ని దాటి వేరే ప్రపంచంలోకి వెళ్లకూడదని అంటుంది. వెంటనే ఆ మనిషిని డైవర్ట్ కాకుండా చూడమదని తల్లిదండ్రులతో చెబుతుంది. మీకో మంచి అల్లుడిని ఇవ్వడానికి నేను చేస్తున్న ప్రయత్నమని అంటుంది.
ఇంత రాత్రయినా పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావ్, గతాన్ని గుర్తుచేసుకుంటున్నావా అని రాజ్‌ని అడుగుతాడు యామిని తండ్రి. నీ బాధను అర్ధం చేసుకున్నాం గనుకే నీ చిన్నప్పటి విషయాలన్నీ తెలిసేలా చేయాలని అనుకున్నామని చెబుతాడు. మీరు గతం గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యం గురించి బాధపడకూడదని అమ్మాయిని స్కూల్ దగ్గరికి పంపించామని అంటాడు. యామిని అన్ని చూపించిందని, కానీ అది నా గతమని నేను తేల్చుకోలేకపోతున్నానని చెబుతాడు రాజ్.
మీరు చెప్పినట్లుగానే నన్ను ఒక స్కూల్‌కి తీసుకెళ్లి నేను అక్కడ చదువుకున్నానని చెప్పిందని, నా కాలేజ్ ఫ్రెండ్స్‌ని పరిచయం చేసిందని అంటాడు రాజ్. వాళ్లంతా నేనెవరో తెలిసినట్లుగానే మాట్లాడారని, ఆ తర్వాత రెండు సమాధుల దగ్గరికి తీసుకెళ్లి వాళ్లే మా అమ్మానాన్నలని చెప్పిందని అంటాడు. కానీ అవి నిజమైతే వాటిని చూస్తే నాకు కొంచెమైనా ఫీల్ రావాలి కదా అంటాడు రాజ్. కోమాలోంచి బయటికొచ్చి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు కదా.. అవన్నీ గుర్తుకు రావడానికి టైం పడుతుందని చెబుతాడు యామిని తండ్రి. ఇప్పుడు వాటి గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దని అంటాడు.
నేను ఆలోచించకూడదని అనుకుంటున్నా.. ఆలోచించకుండా ఉండలేకపోతున్నానని చెబుతాడు రాజ్. మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ల స్థానంలో మీరుండి చూసుకుంటున్నారని చెప్పిందని, కానీ ఆ జ్ఞాపకాలైనా గుర్తుకు రావాలి కదా అని అంటాడు. ఏం పర్లేదు బాబు .. నువ్వు మా దగ్గరే ఉన్నావ్ కదా కొద్దిరోజుల్లో అవే గుర్తొస్తాయని అంటుంది వైదేహి. నాకు ఆలోచించి ఆలోచించి తల పట్టేసినట్లుగా అనిపిస్తోందని, నాకెందుకు ఇలా అయ్యిందో అర్ధం కావడం లేదని బాధపడతాడు రాజ్.
ఇంతలో యామిని వచ్చి నువ్విలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానని అంటుంది. నువ్వు నన్ను బావా అంటున్నా అది నా గుండె దాకా చేరడం లేదని చెబుతాడు రాజ్. చిన్నప్పటి నుంచి మనం ఎంత క్లోజ్‌గా ఉన్నాం, సొంత భార్యాభర్తల్లా ఒకరికొకరం కలిసిపోయామని చెబుతుంది యామిని. నిన్ను తిరిగి మామూలు మనిషిని చేసుకుంటానని, అది నా బాధ్యత అంటుంది. నేను బతికేదే నీకోసమేనని, ఏదో ఒక రోజు నీకు అన్ని గుర్తొస్తాయని చెబుతుంది. నువ్వు అలా ప్రెజర్ తీసుకుని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ ప్రాణానికే ప్రమాదమని అంటుంది.
అల్లుడుగారికి అన్ని గుర్తొస్తాయిలే , నువ్వు బాధపడి తనను బాధపెట్టొద్దని అంటాడు యామిని తండ్రి. ఇంకెప్పుడూ ఇలా ఆలోచించనని , ఇక ఏడవొద్దని చెబుతాడు రాజ్. నువ్వు తనికి గతాన్ని సృష్టించి అంత పరిచయం చేసినా తను మళ్లీ మొదటికే వచ్చి నేనెవరు అంటాడేంటీ అని అడుగుతుంది వైదేహి. ఈ అబద్ధమే నిజమని మనం పదే పదే గుర్తుచేయాలని చెబుతుంది యామిని. అప్పూ తన కేసు ఫైల్స్ చూసుకుంటూ ఉండగా కావ్య పరుగు పరుగున వస్తుంది. మీ బావగారు ఒక అమ్మాయితో కారులో వెళ్లడం నేను చూశానని చెప్పాను కదా అని అంటుంది. ఆ కారు నెంబర్ గుర్తొచ్చిందని, ఇదే ఆ నెంబర్ అని ఇస్తుంది.
ఈ రోజు నువ్వు హాస్పిటల్‌కి వెళ్లింది బావ గారి గురించి తెలుసుకోవడానికే కదా? మళ్లీ ఈ నెంబర్ ఏంటీ? అని అడుగుతుంది అప్పు. తెలుసుకోవడానికే వెళ్లాను, ఆయన్నే నేరుగా చూశానని చెబుతుంది కావ్య. బావగారు హాస్పిటల్‌కి వచ్చారా? నువ్వు కలిశావా? అని అడుగుతుంది అప్పూ. ఆయన్ను హత్తుకుని ఏడవాలని అనుకున్నానని చెబుతుంది కావ్య. మరెందుకు కలవలేదని అప్పూ అడగ్గా ఆయన గతం మొత్తం మరిచిపోయారని చెబుతుంది. ఇప్పుడు నేనెవరో కూడా ఆయనకు గుర్తులేదని అంటుంది.
అందుకే నేను రోడ్డు మీద కళ్లు తిరిగి పడిపోతే ఎవరో అనుకుని హాస్పిటల్‌లో జాయిన్ చేసి వెళ్లిపోయారని చెబుతుంది కావ్య. బావకి గతం గుర్తులేకపోతే బావ పక్కనే ఉన్న ఆ అమ్మాయి ఎవరు? బావ ఆమెతో ఎందుకున్నారని ప్రశ్నిస్తుంది అప్పూ. ఈ కారు నెంబర్ ఎవరిదో తెలుసుకో, ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటానని అంటుంది కావ్య. ఆ కారు నెంబర్ తెలుసుకుని కావ్యకి ఇస్తుంది అప్పూ. ఆఫీస్‌కి వెళ్తున్నట్లుగా రెడీ అయ్యావ్ ఎక్కడికి అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. త్వరలో ఆడిటింగ్ ఉంటుందని అప్పటికైనా నిజం బయట పెట్టాలి కదా అని అంటుంది. మీ భర్త మిమ్మల్ని వదిలేసి 25 ఏళ్లు అవుతుంది కదా? ఆయన ఎక్కడున్నారు? ఉంటే ప్రాణాలతోనే ఉన్నారా? అని ప్రశ్నిస్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











