Brahmamudi March 26th Episode: రుద్రాణికి కావ్య వార్నింగ్ .. రాజ్‌ని కలిసిన కళావతి, షాక్‌లో యామిని
రాజ్ బతికి ఉన్నాడని, నెల రోజుల్లోపు మన ముందు నిలబెడతానని కావ్య అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో రాహుల్ - రుద్రాణిలు షాక్ అవుతారు. నిజంగా రాజ్ బతికే ఉంటే వాడిని శాశ్వతంగా ఈ ఇంటికి రాకుండా చేయాలని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. కావ్య మీద ఓ కన్నేసి ఉంచాలని రాహుల్‌కి చెబుతుంది
గతం గుర్తురాక రాజ్ బాధపడుతుండటంతో అతనిని డైవర్ట్ చేయడానికి తల్లిదండ్రులను దించుతుంది యామిని. రాజ్‌ను దక్కించుకునే మార్గం చూపించమని దేవుడిని కావ్య వేడుకుంటుంది. యామిని కారు నెంబర్‌ను తీసుకొచ్చి అప్పూకి ఇచ్చి కనుక్కోమంటుంది కళావతి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మార్చి 26వ తేదీ ఎపిసోడ్ 679లో ఏం జరిగిందంటే?

అప్పూ ఇచ్చిన అడ్రస్ తీసుకుని బయల్దేరుతున్న కావ్యని రుద్రాణి ఆపి నానా మాటలు అంటుంది. మన ఇంటి పరువు గురించి చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానని అంటుంది కావ్య. మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్లి పాతికేళ్లు అవుతుంది కదా? ఆయన ఎక్కడున్నారో మీకు తెలుసా? కనీసం ప్రాణాలతోనైనా ఉన్నారా అని ప్రశ్నిస్తుంది. ఆ మాటలతో రుద్రాణి మండిపడుతుంది. నా జోలికి మీరొస్తే.. మీ జోలికి నేను రావాల్సి ఉంటుంది, మీ హద్దుల్లో మీరుండటం చాలా మంచిదని వార్నింగ్ ఇస్తుంది కావ్య.
నీకు ఏం కావాలో చెప్పు మేం తీసుకొస్తామని సుభాష్ చెప్పగా.. మీరు కూడా నేను గడప దాటితే ఈ ఇంటి పరువు పోతుందని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తుంది కావ్య. నీకు హెల్ప్ చేద్దామని సుభాష్ చెప్పగా.. మీ నమ్మకం వేరు, నేను వెళ్తున్న రూట్ వేరని అంటుంది. అలాంటప్పుడు నేను అడిగింది మీరు ఎలా తీసుకురాగలరు అదేంటో తెలియదని చెబుతుంది కావ్య. జీవితంలో ప్రతిసారి నేను ఒంటరిగానే పోరాడాల్సి వస్తోందని.. నన్ను నమ్మి ఎవ్వరూ నాతో రావడం లేదని బాధపడుతుంది. నేను ఏదైనా సాధించాకే నన్ను నమ్ముతున్నారని.. అప్పటి వరకు నేను వెళ్లే దారిని కూడా తప్పు పడుతున్నారని, నాకు బాగా అలవాటైపోయిందని చెబుతుంది. ఇప్పుడు కూడా ఒంటరిగానే పోరాడతానని బాధపడుతూ వెళ్తుంది కావ్య.
అన్నయ్యని అది అన్నేసి మాటలు అంటుంటే నువ్వేం మాట్లాడవేంటి అని అపర్ణని అడుగుతుంది రుద్రాణి. అది మాట్లాడిన దానిలో తప్పుంటే అడగొచ్చని చెబుతుంది అపర్ణ. కావ్య మాటల్ని నువ్వు కూడా నమ్ముతున్నావా అని ప్రశ్నిస్తుంది రుద్రాణి. కావ్య చెప్పే ప్రతి మాటలోనూ నా కొడుకు బతికే ఉన్నాడు.. తన నమ్మకం నిజం కావాలని కోరుకుంటున్నానని చెబుతుంది. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు మన ఇంటి పరువు తీసేస్తుందని అంటుంది రుద్రాణి. కావ్య నెల రోజులు గడువు అడిగాక కూడా నువ్వెందుకు మొత్తుకుంటున్నావ్ అంటూ ఇందిర సెటైర్లు వేస్తుంది. మా అత్తకి పరువు ప్రతిష్టలు లేవని ఉంటే చిన్నవాళ్ల దగ్గర కూడా ఇలా మాటలెందుకు పడుతుందని స్వప్న అంటుంది.
అప్పూ ఇచ్చిన అడ్రస్ ఆధారంగా యామిని ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది కావ్య. దాంతో రాజ్ తలుపు తీసి చూసేసరికి ఎదురుగా కావ్య కనిపిస్తుంది. ఆమెను చూసి చాలా సంతోషించి లోపలికి పిలుస్తాడు రాజ్. మీకు ఏం కాలేదు చాలా హ్యాపీగా ఉందని అంటాడు. ఇంతలో వైదేహి వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఆ రోజు హాస్పిటల్‌లో జాయిన్ చేసింది ఈ అమ్మాయినే అని చెబుతాడు రాజ్. నన్ను ఆసుపత్రిలో జాయిన్ చేసినందుకు రాజ్‌కి థ్యాంక్స్ చెబుతుంది కావ్య. ఆ రోజు అంత మంది రోడ్డు మీదున్నా ఎవరు ముందుకు రాలేదని.. కానీ మీరు హాస్పిటల్‌లో జాయిన్ చేసి వెళ్లారని అంటుంది. ఇదంతా నేను మా తాతయ్య దగ్గర నేర్చుకున్నానని అంటాడు రాజ్. ఆ మాటలతో కావ్య షాక్ అవ్వగా.. లేకపోతే ఏంటండి తోటి మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయడం కనీస ధర్మం అంటాడు .
మీకు మా ఇంటి అడ్రస్ ఎలా దొరికిందని అడుగుతాడు రాజ్. హాస్పిటల్ ఓపీ మీద అడ్రస్ ఉండటంతో అది చూసి వచ్చానని చెబుతుంది కావ్య. మీరు చాలా ఇంటెలిజెంట్ అని ఆమెను మెచ్చుకుంటాడు. రాజ్‌తో కావ్య కబుర్లు చెబుతుండగా యామిని వాళ్లిద్దరిని చూసి షాక్ అవుతుంది. ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది. రోడ్డు మీద కళ్లు తిరిగి పడిపోయుంటే నేను సేవ్ చేసింది ఈ అమ్మాయినే అని చెబుతాడు. మీ పేరు ఏంటీ అని రాజ్ అడగ్గా.. కళావతి అని చెబుతుంది కావ్య. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ట్రెడిషనల్ పేరు పెట్టారంటే మీ అమ్మానాన్నలు చాలా గ్రేట్ అంటాడు రాజ్. అది మా అమ్మానాన్నలు పెట్టలేదని నేను నచ్చిన వాళ్లు నాకు పెట్టిన పేరని చెబుతుంది. అనంతరం కావ్యకి షేక్ హ్యాండ్ ఇస్తాడు రాజ్.
మీ పేరు ఏంటని యామినిని అడుగుతుంది కావ్య. ఇంతలో యామిని తండ్రి వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడగ్గా కళావతి అని చెబుతాడు రాజ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోందని యామిని చెబుతుంది. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెబుదామని వచ్చానని అంటుంది కావ్య. కళావతికి ఏదో ఫోన్ రావడంతో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్తానని చెబుతుంది. టిఫిన్ చేసి వెళ్లమని వైదేహి బతిమలాడుతుండగా.. ఏదో పని ఉందని చెబుతుంది కదా వెళ్లనివ్వు అంటూ కోపంగా చెబుతుంది యామిని. వెళ్లే ముందు బై రాజ్ అని కావ్య చెప్పడంతో యామిని, ఆమె తల్లిదండ్రులు షాక్ అవుతారు. కావ్య వెళ్తుండగా చాలా మంచి అమ్మాయిలా ఉందని యామిని తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారు.
కావ్య వెళ్తుండగా రాజ్ పరుగు పరుగున మేడపైకి వెళ్లి చూస్తూ ఉంటాడు. కావ్య కూడా అక్కడి నుంచి వెళ్లలేక వెళ్లలేక వెళ్తుంది. ఆమె ఎవరో నాకు బాగా తెలిసినట్లు ఆమె స్పర్శ కూడా పరిచయం ఉన్నట్లుగా ఉందని, నా మనసు ఏదో గుర్తుచేయడానికి ప్రయత్నిస్తోందని రాజ్ బాధపడతాడు. కారులో కావ్య ఏడుస్తూ ఉంటుంది. ఆమె ఎవరో రాజ్ కూడా ఆలోచిస్తుంటాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











