Brahmamudi March 5th Episode: అపర్ణ ఉగ్రస్వరూపం.. రేఖకి ముచ్చెమటలు, ఆడగుంపుతో స్వరాజ్‌కు తన్నులు
Photo Courtesy: JioHotstar
ఇందూ ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పని మొత్తం చేసేసి స్వాతి సహా అందరికీ కాఫీ ఇస్తుంది. సీక్రెట్‌గా చదువుకుంటూ డిగ్రీ వరకు వచ్చేశావని ఇందూతో చెబుతుంది స్వాతి. ఈ రహస్యం లీకైతే నీ వల్లే అవుతుందని అంటుంది ఇందూ. తనకు జ్యూస్ ఆలస్యంగా తీసుకొచ్చావని ఇందూపై భ్రమరాంబ మండిపడుతుంది. ఆ తర్వాత అపర్ణ- సుభాష్‌ల దగ్గరికి కాఫీ ఇస్తుంది. నీ ఇంట్లోనే నువ్వు పనిమనిషిలా బతుకుతున్నావని అపర్ణ బాధపడుతుంది. ఈ వయసులో నీకు అండగా ఉండాల్సిన ఈ తాతయ్య ఏం చేయలేక మంచానికే పరిమితం అయిపోయాడని ఆవేదన వ్యక్తం చేస్తాడు సుభాష్. దేనికైనా టైం రావాలి.. మా అమ్మనాన్నల ఆశయాల్ని కాపాడటానికి అవసరమైతే ప్రపంచంతోనే యుద్ధం చేస్తాను.. ఈ రేఖ ఎంత అని అంటుంది ఇందూ.
ఆరోజున ప్రమాదం జరగకుండా ఉంటే ఈపాటికి స్వరాజ్‌తో ఇందూ పెళ్లి జరిగేదని అపర్ణ బాధపడుతుంది. నా మనవడిని కాపాడుకోలేకపోయాను.. వాడు ప్రాణాలతో ఉండి ఉంటే ఇందూకి అండగా ఉండేవాడని సుభాష్ ఆవేదన వ్యక్తం చేస్తాడు. మరోవైపు బారెడు పొద్దెక్కిని నిద్రపోతూ.. కలలు కంటున్న స్వరాజ్‌ని లాగిపెట్టి తంతాడు తండ్రి. పనిపాటా లేకుండా ఊరంతా బలాదూర్ తిరగడం, పగటి కలలు కంటూ ఉంటే ఎప్పుడు బాగుపడతావని చీవాట్లు పెడతాడు. ఇంతలో వాటర్ ట్యాంక్ రావడంతో మంచినీళ్లు తీసుకురమ్మని చెబుతాడు తండ్రి. స్వరాజ్ అక్కడికి వెళ్లేసరికి ఆడవాళ్లు కొట్టుకుంటూ ఉండటంతో నకిలీ నోట్లతో వాళ్లని డైవర్ట్ చేస్తాడు స్వరాజ్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. ఇక మార్చి 5వ తేదీ ఎపిసోడ్ 972లో ఇంకా ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
మమ్మల్ని మోసం చేసి నీళ్లు పట్టుకుంటావా అంటూ స్వరాజ్‌పై కాలనీ ఆడవాళ్లంతా మండిపడతారు. అందరూ కలిసి రౌండప్ చేసి రాజ్‌ని చితక్కొడతారు. వారి నుంచి ఎలాగోలా తప్పించుకుని నీళ్లు పట్టుకుంటాడు స్వరాజ్. ఆ ఆడగుంపుతో పడలేకపోతున్నా.. నేను నీళ్లు తీసుకురావడానికి వెళ్లనని తండ్రితో చెబుతాడు స్వరాజ్. రోజూ ఏదో ఒక గొడవ చేసి వాళ్లకంటే ముందు నువ్వు నీళ్లు పట్టుకుంటున్నావట. నువ్వు చేస్తున్న గొడవతో వాళ్ల మొగుళ్లతో విడాకులు అయ్యే వరకు వస్తుందని మీ అమ్మ దగ్గరికి వచ్చి ఒకటే ఏడుపు అంటాడు తండ్రి. ఆడవాళ్లతో బిందెలతో కొట్టించుకుంటావా? అని మండిపడతాడు తండ్రి. అందుకే రేపటి నుంచి మీ ముద్దుల చిన్నకొడుకుని పంపించండి అంటాడు స్వరాజ్. ఇప్పుడు ఒకే కానీ రేపు పెళ్లయ్యాక ఏం చేస్తావని నిలదీస్తాడు తండ్రి. అంటే పెళ్లయ్యాక కూడా వాడు ఇదే బస్తీలో ఉంటాడా? అని నిలదీస్తుంది తల్లి. వీడి ముఖానికి కోటలో మహారాణి వస్తుందా అని సెటైర్లు వేస్తాడు తండ్రి. ఆ మహారాణి ఏదో ఒక కోటలో ఉండే ఉంటుందని అంటాడు.
ఉదయాన్నే రుద్రాణి, రాహుల్‌ల ఫోటోలు శుభ్రం చేస్తున్న ఇందూ దగ్గరికి స్వాతి వచ్చి.. నా సిలబస్‌లో డౌట్ ఉంది సాల్వ్ చేయమని అడుగుతుంది. రేఖ ఆంటీ ఆఫీస్‌కి వెళ్లే సమయానికి ఈ ఫోటోలు క్లీన్‌గా లేకపోతే గొడవ చేస్తుందని అంటుంది. వీళ్లేమైనా దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన దేశభక్తులా.. రోజూ దండవేసి దండం పెట్టడానికి. వీళ్లు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే టైప్ అని నానమ్మ పూర్తిగా చెప్పిందని అంటుంది స్వాతి. ఆ మాటలతో సైలెంట్‌గా ఉండమని ఇందూ సైగలు చేస్తుంది. రేఖ ఆంటీకి నువ్వు భయపడతావేమో నేను కాదు అంటుంది స్వాతి. దాంతో రేఖ ఆంటీ వచ్చినట్లు ఫ్రాంక్ చేస్తుంది ఇందూ. డౌట్స్ క్లియర్ చేయమంటూ స్వాతి బలవంతంగా లాక్కెళ్తుండగా ఆమె చేయి తగిలి రుద్రాణి ఫోటో కిండపడిపోతుంది. దాంతో ఇద్దరూ వణికిపోతారు.
అది చూసిన భ్రమరాంబ.. రుద్రాణి గారి ఫోటో కిందపడేశావా? రేఖకి వాళ్ల అమ్మ అంటే ఎంత ఇష్టమో? ఎంత గౌరవమో? తెలిసి కూడా ఇంత పనిచేస్తావా? అని మండిపడుతుంది. ఆ ఫోటో నేనే పడేశానని స్వాతి చెప్పబోతుండగా నింద తన మీద వేసుకుంటుంది ఇందూ. ఈ చిన్న పని కూడా చేయడం చేతకాదా? ఈ ఇంట్లో పని అంతా నువ్వే చేస్తున్నట్లు బిల్డప్ ఇవ్వడం తప్పించి ఒక్క పనైనా సరిగా చేస్తున్నావా? అని మండిపడుతుంది. ఇప్పుడు వాళ్ల అమ్మ ఫోటో పగిలిపోయిందని రేఖకి తెలిస్తే అప్పుడు నీకుంటుందని అంటుంది భ్రమరాంబ. ఇంతలో రేఖ వచ్చి నీకు పొగరు బాగా పెరిగిందని అంటుంది. మా అమ్మ నాకు దూరమైనప్పటి నుంచి తనని ఈ ఫోటోలో నుంచే చూసుకుంటున్నాను అని నీకు తెలుసు.. అయినా దీనిని పగలగొట్టావంటే నేనంటే భయం పోయిందా? మీ నానమ్మ మాటలు విని ధైర్యం వచ్చిందా? అని నిలదీస్తుంది రేఖ.
అద్దాన్ని నేను మళ్లీ సరిచేయిస్తానని ఇందూ చెబుతుండగా.. పగిలిన అద్దాన్ని చూస్తున్నావు కానీ, కిందపడిన మా అమ్మ ఫోటో కనిపించడం లేదా అని ఇందూని కొట్టబోతుండగా అపర్ణ సీరియస్ అవుతుంది. నా మనవరాలి మీద చేయిపడితే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. అయినా పగిలిపోయింది అఫ్ట్రాల్ రుద్రాణి ఫోటోనే కదా.. మీరంతా పుట్టకముందు రోడ్డు మీద అడుక్కుతినే బతుకు మీ అమ్మది అని అంటుంది. జాలిపడి ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే వెన్నుపోటు పొడిచి నా కుటుంబాన్ని నాకు దూరం చేసింది. అలాంటి దాని ఫోటోయే కాదు.. జ్ఞాపకం కూడా ఇంట్లో ఉండటం పాపమే అవుతుందని అంటుంది అపర్ణ. అది నా మనవరాలు మాత్రమే కాదు.. కావ్య కూతురని కూడా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇస్తుంది. కావ్య బతికున్నప్పుడు మీ అమ్మని ఏం చేసిందో గుర్తుందా? దాని రక్తమే ఇందూలో ప్రవహిస్తుందని అంటుంది.
20 ఏళ్లుగా నువ్వు, ఈ భ్రమరాంబ కలిసి నా మనవరాలికి నరకం చూపిస్తున్నారు. అయినాసరే మౌనంగా భరిస్తున్నాం.. ఒకసారి నా మనవరాలి రక్తంలో ఉన్న ఆ కావ్య కోపం బయటికొస్తే మీ జీవితాలే తలకిందులైపోతాయని వార్నింగ్ ఇస్తాడు సుభాష్. నిన్ను వీల్‌చైర్‌కే పరిమితం చేసినా నీ నోరు ఇంకా లేస్తోంది. ఇన్నేళ్లు గడిచినా నీలో పొగరు మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. నేనంటే నీకు తెలుసు అయినాసరే ఈరోజు నా మీదే నోరు లేచింది అంటే మీలో భయం పోయిందని అంటుంది రేఖ. మీరు మా అమ్మ ఫోటోని అఫ్ట్రాల్ అని పిలవడం నాకు నచ్చలేదు.. మీలో పుట్టుకొచ్చిన ఈ ధైర్యం నాకు నచ్చలేదు. వెంటనే మొగుడిని పిలిచి సుభాష్‌ని ఇంట్లోంచి తోసేస్తుంది. కిందపడిన సుభాష్‌కి దెబ్బలు తగలడంతో అపర్ణ మండిపడుతుంది. నా భార్య మీద అరిచారని నీ మొగుడిని బయటకు తోసేశా.. ఇంకోసారి ఇలాగే చేస్తే ప్రాణాలు తీసేస్తానని వార్నింగ్ ఇస్తాడు భూషణ్. నానమ్మ చేసింది తప్పే తనకి బదులుగా నేను క్షమాపణలు చెబుతున్నానని అంటుంది ఇందూ.
ఆ ముసలోడు నేల మీద పడగానే నీ రక్తంలో భయం కనిపించింది కదా? ఇది కావాలి నాకు అని అంటుంది రేఖ. ఈరోజు మీరందరూ ప్రాణాలతో ఉన్నారంటే అది నేను పెట్టిన భిక్ష అనే విషయం మరిచిపోవద్దని చెబుతుంది. ఈరోజు నుంచి ఏ తప్పు జరిగినా శిక్ష కూడా నీకే పడుతుందని ఇందూకి వార్నింగ్ ఇస్తుంది రేఖ. ఈరోజు నా జీవితం ధన్యమైంది.. తాటకి లాంటి వాళ్లు ఉంటారు అనుకోవడమే తప్పించి కళ్లారా ఎప్పుడు చూడలేదు. ఈరోజే నీ వల్ల ఆ భాగ్యం కలిగిందని భ్రమరాంబపై సెటైర్లు వేస్తాడు శేషం. సుభాష్‌ని తీసుకెళ్లి మంచంపై పడుకోబెడతారు ఇందూ, అపర్ణ. ఈ నొప్పి రెండ్రోజుల్లో తగ్గిపోతుంది.. కానీ ఆ రేఖ వల్ల నువ్వు పడుతున్న బాధ ఎప్పటికీ తీరదు కదా అని అంటాడు సుభాష్.
నువ్వు ఆపకపోతే ఈరోజు అటో ఇటో తేలిపోయేదని అంటుంది అపర్ణ. మేం చిన్నగా ఉన్నప్పుడు మమ్మల్ని కాపాడటానికి నువ్వు తలవంచావు. ఈరోజు మిమ్మల్ని కాపాడటానికి నేను మౌనంగా భరిస్తున్నాను.. కాలం మారింది కానీ మన పరిస్ధితులు మారలేదని అంటుంది ఇందూ. నన్ను ఎన్నయినా భరిస్తాను కానీ నిన్ను అంటుంటే తట్టుకోలేనని అంటుంది అపర్ణ. రేఖలాంటి వాళ్లను ఎదిరించాలంటే ఆవేశం మాత్రమే కాదు.. ఆలోచన కూడా కావాలి, దానికి సమయం కలిసిరావాలని చెబుతుంది ఇందూ. ఆ భగవంతుడు చెడ్డవాళ్లకు కలిసొచ్చేలా ఎందుకు చేస్తాడో అర్ధం కాదని బాధపడుతుంది అపర్ణ. పాపం పండాలి.. కాలం ఎదురు తిరగాలి, అప్పటి వరకు ఎదురుచూడాలని ధైర్యం చెబుతుంది ఇందూ.
కొన్నాళ్లు ఓపికపడితే నా కష్టంతో మిమ్మల్ని బాగా చూసుకుంటానని చెబుతుంది. ఇంతలో స్వాతి వచ్చి సారీ చెబుతుంది. నేను చేసిన తప్పు వల్ల మీరంతా మాటపడ్డారు, ఫోటో నా వల్లే పగిలిందని చెప్పొచ్చు కదా అని అంటుంది. చెబితే నిన్ను కూడా తిట్టేది అంటుంది ఇందూ. నన్ను తిడితే మా అమ్మ ఊరుకుంటుందా అని స్వాతి అడగ్గా.. రేఖ ఆంటీని మీ అమ్మ ఎదురిస్తుందా అని ప్రశ్నిస్తుంది ఇందూ. నేను ఎగ్జామ్‌కి వెళ్లాలంటే రేఖ ఆంటీ ఆఫీస్‌కి వెళ్లాలి కదా అని బాధపడుతుంది. చిన్న చిన్న వాటితోనే ఆనందాన్ని వెతుక్కుంటోంది.. దీని ధైర్యాన్ని చూసి మెచ్చుకోవాలో? దీని తలరాతను చూసి బాధపడాలో అర్ధం కావడం లేదని సుభాష్‌తో అంటుంది అపర్ణ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











