Brahmamudi May 1st Episode : రాజ్‌ని చూసిన కళ్యాణ్.. మనవడి కోసం సీతారామయ్య కన్నీరు, రుద్రాణిలో అనుమానం
కావ్యకి రాజ్ ఫోన్ చేసి చీర ఎలా ఉందని అడగ్గా.. ఆమె చాలా బాగుందని చెబుతుంది. భర్త వచ్చి తనకు ముద్దు పెట్టినట్లుగా కావ్య ఊహల్లో తేలిపోతుంది. కిచెన్‌లో వంట చేస్తున్న కావ్య దగ్గరికి అపర్ణ వచ్చి ఆఫీస్, ఇంటిని చక్కదిద్దింది చాలు కానీ వాడికి గతం గుర్తొచ్చే పనులు చూడమని చెబుతుంది. రాజ్‌తో కలిసి పెళ్లి పత్రికలు పంచాలని అనుకుని ఈ విషయం చెప్పడంతో యామినితో కలిసి వెళ్లేందుకు రాజ్ ఒప్పుకుంటాడు. ఇంతలో కావ్య ఫోన్ చేసి కలవాలని చెప్పడంతో యామినికి ఏదో సాకు చెప్పి తప్పించుకుంటాడు రాజ్.
రాజ్‌ను కలిసి మీరు ఫోర్జరీ చేయడంతో డీల్ పూర్తి చేశానని, నాకు ప్రమోషన్ కూడా వచ్చిందని థ్యాంక్స్ చెబుతుంది కావ్య. అయితే తనకు పార్టీ కావాలని అడుగుతాడు రాజ్. వీరిద్దరి మాటలను చూసిన యామిని రగిలిపోతుంది. రాజ్ వెళ్లిపోయిన తర్వాత కావ్యని కలిసి నా బావని నాకు దూరం చేయాలని అనుకుంటున్నావా అంటూ మండిపడుతుంది. నువ్వే నా భర్తని లాక్కున్నావని, నువ్వేం చేసినా ఆయనని నన్ను విడదీయలేరని చెబుతుంది కావ్య. అయితే రాజ్ ఎవరికి దక్కుతాడో చూసుకుందామని కావ్య - యామినిలు సవాళ్లు విసురుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 1వ తేదీ ఎపిసోడ్ 710లో ఏం జరిగిందంటే?

నువ్వు ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఆయన నన్ను కలవాలని తపించిపోయాడని యామినితో అంటుంది కావ్య. నేను అడ్రస్ తప్పుగా చెప్పినా తన పుట్టింటిలో అడుగుపెట్టాడని చెబుతుంది. నువ్వు తన చుట్టూ అల్లిన కట్టుకథ ఓ కథలాగే మిగిలిపోయిందని అంటుంది కావ్య. అలా ఎప్పటికీ జరగదని, రాజ్ నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని చెబుతుంది యామిని. ఇంత జరుగుతున్నా నీకు అర్ధం కావడం లేదా? ఆయన మనసు ఎప్పుడో మారిపోయింది .. ఇక గతం గుర్తుకు రావడమే అని అంటుంది కావ్య.
త్వరలోనే మా పెళ్లి జరగబోతోంది.. పెళ్లి పత్రికలు కూడా పంచేశామని చెబుతుంది యామిని. మా పెళ్లికి రాజ్ కూడా ఒప్పుకున్నాడని, నా ఇష్టమే తన ఇష్టమని కూడా చెప్పాడని అంటుంది. నీ కల కలగానే మిగిలిపోతుందని.. నీ మెడలో ఉన్న తాళి తాగిపోతుందని చెబుతుంది. నీతో పెళ్లికి ఒప్పుకున్నాడనే అనుకుందాం.. కానీ నీతో ఉండాల్సిన మనిషి నాతో రెస్టారెంట్‌కి కాఫీ తాగడానికి ఎందుకొచ్చాడని ప్రశ్నిస్తుంది కావ్య. నీతో కలిసి పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సిన మనిషి చీర కొనుక్కుని నన్ను వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చాడని అడుగుతుంది. నేను అడిగితే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నానని, నాకు మాట ఎందుకిస్తాడని ప్రశ్నిస్తుంది.
అంటే నువ్వు అడిగితే నాతో పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకుంటాడా? అని నిలదీస్తుంది యామిని. ఆ పని చేయాలని అనుకుంటే తాను ఎప్పుడో చేసేదాన్నని.. ఆయన మనసులో ఇప్పటికీ నేనే ఉన్నానని, అది తిరిగి ఆయన గతాన్ని గుర్తుచేసి నా దగ్గరికి వచ్చేలా చేస్తుందని అంటుంది కావ్య. రాజ్ నా మెడలో మూడు ముళ్లు వేయడం జరుగుతుంది.. మేమిద్దరం కలిసి కాపురం చేయడం జరుగుతుంది.. అది నువ్వు చూసి తట్టుకోలేవని చెబుతుంది యామిని.
ఇప్పటి వరకు రాజ్‌ను నేను సొంతం చేసుకోవాలని అనుకున్నానని.. నీ మీద నాకు కోపం లేదని, కానీ ఎప్పుడైతే నా రాజ్‌ని నాకు దూరం చేయాలని నువ్వు అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు నాకు శత్రువులా మారిపోయావని అంటుంది. నాకు మాత్రం నువ్వు జోకర్‌లా మారిపోయావని సెటైర్లు వేస్తుంది కావ్య. జోకర్ ఎవరు అవుతారో? రాజ్‌కు పెళ్లాం ఎవరు అవుతారో చూద్దాం అంటూ ఇద్దరూ సవాళ్లు విసురుకుంటారు.
కళ్యాణ్ బైక్ మీద వస్తుండగా ఓ కారు అతనిని ఢీకొట్టబోతుంది.. దీంతో కళ్యాణ్ కింద పడబోతాడు. కారులోంచి దిగకుండానే చూసుకోవాలి కదా తమ్ముడు అని రాజ్ చెబుతాడు. తప్పు నాదే థ్యాంక్స్ బ్రో అని కారు వంక చూడగా అందులో రాజ్ కనిపించడంతో కళ్యాణ్ షాక్ అవుతాడు. అన్నయ్య.. అన్నయ్య అని పిలిచినా రాజ్ కారు దిగకుండా వెళ్లిపోవడంతో కళ్యాణ్ పరిగెడతాడు. బైక్‌పై ఫాలో అవుదామని వెళ్తుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్ కళ్యాణ్‌ని ఆపుతాడు.మర్యాదగా బైక్ డాక్యుమెంట్స్ చూపిస్తేనే వదిలి పెడతానని చెప్పడంతో కళ్యాణ్ వాటిని చూపిస్తాడు. అన్నయ్య నన్ను చూశాక కూడా ఎందుకు గుర్తుపట్టలేదు? నన్ను వదిలేసి ఎందుకు వెళ్లిపోయాడని అనుకుంటాడు కళ్యాణ్.
హడావుడిగా ఇంటికొచ్చి అందరినీ కిందకి పిలిచి ఇన్ని రోజులు కావ్య వదిన చెబుతుంటే మనం నమ్మలేదు కదా.. అన్నయ్య బతికే ఉన్నాడని కళ్యాణ్ చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. అన్నయ్యని నేను నా కళ్లతో చూశానని కళ్యాణ్ చెప్పడంతో చూస్తే ఇంటికి తీసుకురాలేదని ప్రశ్నిస్తుంది ధాన్యలక్ష్మీ. అన్నయ్యని నేను చూశాను.. మీ మాటల నమ్మనందుకు నన్ను క్షమించాలని కావ్యతో అంటాడు కళ్యాణ్. ఎవ్వరూ నమ్మకపోవడంతో ఆ దేవుడి మీద ఒట్టు వేసి అన్నయ్యని చూశానని చెబుతాడు . అన్నయ్య నన్ను చూసి కూడా చూడనట్లు వెళ్లిపోయాడని కళ్యాణ్ అనడంతో రాజ్ గతం మరిచిపోయాడని బాధపడుతుంది స్వప్న.
కళ్యాణ్ చెప్పింది నిజం రాజ్ బతికే ఉన్నాడని .. వాడిని నేను కూడా చూశానని జరిగిదంతా చెబుతుంది అపర్ణ. మమ్మల్ని పరాయి వాళ్లలా చూసి రాజ్ బతికున్న విషయం దాచి పెట్టారా అని ధాన్యలక్ష్మీ, ప్రకాశంలు బాధపడతారు. రాజ్ బతికే ఉన్నాడన్న సంగతి తెలిసింది కదా ఇక వాడిని తీసుకొద్దామని సీతారామయ్య చెప్పగా కావ్య వద్దని ఆపుతుంది. ఆయనకి ఏం గుర్తులేదని, మనం అక్కడికి వెళితే ఆయన మైండ్ మీద ప్రెజర్ పడితే అది ప్రాణానికే ప్రమాదమని చెబుతుంది కావ్య. నేను నెల రోజులు టైం అడిగింది కూడా అందుకేనని ఆయనని ఖచ్చితంగా ఇంటికి తీసుకొస్తానని అంటుంది.
ఈ విషయం రుద్రాణి, రాహుల్‌లకు తెలియకూడదని అందరూ మాట్లాడుకుంటూ ఉండగా రాహుల్, రుద్రాణిలు సడెన్‌గా రావడంతో అంతా షాక్ అవుతారు. దాంతో అంతా సైలెంట్‌గా తప్పుకోవడంతో రుద్రాణికి అనుమానం వస్తుంది. అందరి ముఖాల్లోనూ ఆనందం కనిపిస్తోందని.. దానిన మనం తెలుసుకోవాలని అనుకుంటారు. కళావతి గురించి ఎలాగైనా తెలుసుకోవాలని అనుకుంటాడు రాజ్. ఇంతలో యామిని వచ్చి పెళ్లి పత్రికలు తీసుకొచ్చి ఇవ్వడంతో రాజ్ షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











